చిరు దివ్వెలు
చక్రాల్లాంటి కళ్లు భూ చక్రాలను తలపిస్తాయి... టపా టపా మాట్లాడే మాటలు.... హండ్రెడ్ వాలా, థౌజండ్ వాలాలను గుర్తు చేస్తాయి... కాంతులీనే ముఖ వర్చస్సు కాకర పువ్వొత్తి కళ్ల ముందు కనబడినట్లు చేస్తుంది... అయితే ఈ చిచ్చర పిడుగు చిన్నారి థనస్వికి చిచ్చు బుడ్డి అంటే ఇష్టం. పలు చిత్రాల్లో నటించిన ఈ బేబీకి ‘పొట్టేల్’ సినిమా బాగా పాపులార్టీ తెచ్చి పెట్టింది. ఇక ఈ ‘దీపావళి లిటిల్ గెస్ట్’ చెప్పిన విశేషాల్లోకి వెళదాం.
→ దీపావళి సండే రోజు వచ్చింది. ఆ రోజు ఎలాగూ హాలిడేనే కదా (బుంగ మూతి పెట్టి). దీపావళి అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి రెండు రోజులైనా ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నా కోసం పెద్ద బాక్స్ క్రాకర్స్‌ని మా నాన్న తెప్పిస్తారు. అవన్నీ రెండు రోజులు కాల్చుకోవచ్చు. క్రాకర్స్ బాక్స్ ఇంటికి రాగానే నేను, అమ్మ, నాన్న ముగ్గురం అన్‌ప్యాక్ చేస్తాం.
→ నాకు ఎక్కువగా చిచ్చు బుడ్డి అంటేనే ఇష్టం. అలాగే కాకర పువ్వొత్తులు కూడా. పేద్ద సౌండ్‌తో పేలే లక్ష్మీ బాంబు ఇష్టం. లక్ష్మీ బాంబులు కూడా కాలుస్తాను. అయితే మా నాన్న చెయ్యి పట్టుకుని కాల్పిస్తారు. మా ఇంటి దగ్గరే మా అమ్మమ్మ, తాత కూడా ఉంటారు. ‘జాగ్రత్తగా కాల్చుకోవాలి. చెయ్యి మీద పడతదేమో’ అని చెబుతారు.
→ రాకెట్స్ పైకి వెళుతుంటే చూడటం ఇష్టం. బాటిల్‌లో పెట్టి రాకెట్‌ని అంటిస్తే ‘సుయ్‌మని’ పైకి వెళుతుంది కదా... అది చాలా బాగుంటుంది. అయితే రాకెట్ డైరెక్షన్ మారితే మనవైపే వస్తుందట. అందుకే మా నాన్న చాలా జాగ్రత్తగా కాలుస్తారు. మాకైతే ఎప్పుడూ కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్లింది.
→ ఈ దీపావళికి నా డ్రెస్ లెహంగా, క్రాప్ టాప్. మా అమ్మే కుట్టింది. మెరూన్ కలర్ డ్రెస్. ఆ కలర్ నాకు చాలా ఇష్టం. ఇంకా దీపావళి స్వీట్స్ అంటే అమ్మ చాలా చేస్తుంది. నాకు ‘మోతీ చూర్ లడ్డూ’ ఇష్టం.
→ పండగ రోజు పొద్దునే నిద్ర లేస్తాను. అమ్మ, నేను దీపాలు పెడతాం. లక్ష్మీ పూజ చేస్తాం. ఆ తర్వాత క్రాకర్స్ కాలుస్తాను. ఆ తర్వాత నుంచి కార్తీక మాసం. నాన్ వెజ్ తినకూడదు. మా ఫ్యామిలీ మొత్తం ఈ నెల రోజులు నాన్ వెజ్ తినం. నాకు తినాలనిపించినా తినను. ఇంకేమో ఇవాళే మా క్రాకర్స్ బాక్స్ వస్తుంది. కాల్చడానికి ఇంకా మూడు రోజులు వెయిట్ చేయాలి. అందరికీ హ్యాపీ దీపావళి... క్రాకర్స్ జాగ్రత్తగా కాల్చుకోండి అంటూ చక్రాల్లాంటి కళ్లు తిప్పుతూ జాగ్రత్తలు చెప్పింది తనస్వి.
– డి.జి. భవాని


