నేను కార్మికురాలిని శివకాశీ బిజిలీ కథ | Sivakasi: A woman employee making crackers at factory | Sakshi
Sakshi News home page

నేను కార్మికురాలిని శివకాశీ బిజిలీ కథ

Nov 4 2026 3:19 AM | Updated on Nov 4 2026 3:20 AM

Sivakasi: A woman employee making crackers at factory

హలో... క్రాకర్స్‌ కొనడానికి బయలుదేరుతున్నారా? దీపావళి వస్తే మీ ఇంటి ముందు ఢమఢమలాడే టపాకాయల వెనుక నేను ఉన్నానని మీకు తెలుసా? నేనూ, నాలాంటి వేల మంది స్త్రీలు.. మా చేతులతో తయారు చేసిన టపాసులనే మీరు కొంటారు. మరి మీకు శివ కాశీలోని మా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మా సంపాదన, సమస్యలేమిటో తెలుసా? రండి చెబుతాను.

నా పేరు మునియమ్మ. నా వయసు ముప్పై ఎనిమిదే. కానీ నా రెండు చేతులూ పొడిబారి, నల్లటి కెమికల్‌ మరకలతో ముడతలు పడి పెద్దవాళ్ల చేతుల్లా ఉంటాయి. గత పదిహేనేళ్లు గా ఉదయం సాయంత్రం నా శ్వాస, నా ఆశ అన్నీ ఇరుకైన, గాలి ఆడని ఫ్యాక్టరీ షెడ్డులోనే గడిచిపోతున్నాయి. మీ ఇళ్లల్లో నవ్వులు పూయించే టపాసుల వెనుక గంధకమై మండే మా జీవితాలున్నాయి.

అరవై శాతం మేమే ఉన్నాం
మా శివకాశిలో అధికారికంగా లెక్కలు తేల్చిన ఫ్యాక్టరీలు  1,160. ఈ పెద్ద సామ్రాజ్యంలో మొత్తం 56,633 మంది కార్మికులు రాత్రింబగళ్లు మందుగుండుతో చెలగాటం ఆడుతుంటే వారిలో 33,375 మంది నాలాంటి ఆడవాళ్లే. అంటే 60 శాతానికి పైగా మేమే ఉన్నాం. ఒకసారి ఫ్యాక్టరీలో చేరాక మా జీవితం మా చేతుల్లో ఉండదు. ఉదయం ఆరు గంటలకే ఇల్లు వదిలి వచ్చేయాలి. టపాసులు చుట్టడం, మందుగుండు నింపడం, లేబుళ్లు అంటించడం, ప్యాకింగ్‌... ప్రతి పనీ పొంచి ఉన్న ప్రమాదం మధ్య చేయాలి. రసాయనాల ఘాటు... పీల్చలేం. మండే కళ్లను చల్లార్చలేం.

అరటిపండు భత్యం
మాకు కరెంట్‌ దీపాలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. చిన్న నిప్పురవ్వ వచ్చినా ఇక్కడ సర్వస్వం బూడిదైపోతుంది కాబట్టి ఉంచరు. కాసింత వెలుతురులో గాలి ఆడని షెడ్లలో రోజంతా అల్యూమినియం, సల్ఫర్, బేరియం వంటి రసాయన పొడి మధ్య కూర్చుంటాం. 

ఈ విషపు పొడి మా ఊపిరితిత్తుల్లోకి వెళ్తూనే ఉంటుంది. మా ఊరిలో చాలామంది మహిళలు ఉబ్బసం, టిబి, చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా పని చేయడం వల్ల పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంతో పుడుతున్నారు. చిత్రమేమిటంటే ఈ రసాయనాల ప్రభావం తగ్గడానికి మాకు ఫ్యాక్టరీ వాళ్లు వారానికి రూ.40 ‘బనానా అలవెన్స్’ (అరటిపండు భత్యం) ఇస్తారు. అరటిపండు తింటే కెమికల్స్‌ విరుగుడు అవుతుందని ఇక్కడి నమ్మకం. అరటిపండు మా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే రసాయనాలను ఎంతవరకు ఆపగలదు? ఇంకోవైపు అగ్నిప్రమాదాలు. 

చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. గత నాలుగు సంవత్సరాలలో  మా కళ్లముందే 104 ప్రమాదాలు జరిగాయి. ఎంతోమంది తోటి అక్కాచెల్లెళ్లు మా ముందే గుర్తుపట్ట లేనంతగా కాలి బూడిదైపోయారు. అయినా సరే, పొట్టకూటి కోసం మరుసటి రోజే మళ్లీ అదే మందుగుండును చేతుల్లోకి తీసుకోక తప్పని పరిస్థితి మాది.

ఆశల గ్రీన్‌ క్రాకర్స్‌
ఇప్పుడు మార్కెట్లో ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ (పర్యావరణ హిత టపాసులు) ట్రెండ్‌ నడుస్తోంది. కోర్టుల నిబంధనల వల్ల ఫ్యాక్టరీలు కూడా కొత్త టెక్నాలజీ వైపు మారుతున్నాయి. కొత్త మెషీన్లు వస్తున్నాయి. ఇవన్నీ వినడానికి బాగున్నా లోపల మాత్రం భయం పట్టుకుంది. టెక్నాలజీ వస్తే మాకు దొరికే అరకొర పని, ఈ రోజువారీ కూలి కూడా ఎక్కడ పోతుందోనని ఆందోళనగా ఉంది. చదువుకున్న మా పిల్లలు ఇప్పుడు ఈ మురికి షెడ్లలోకి రావడం లేదు. పాత వాళ్లమే ఇక్కడ మిగిలిపోతున్నాం. అదొక్కటే మాకు సంతోషం.

ఈసారి మీరు దీపావళి రాత్రి ఆకాశంలో రంగు రంగుల మెరుపులు చూస్తున్నప్పుడు ఆ వెలుతురు వెనుక ఉన్న నాలాంటి మునియమ్మల చేతులను గుర్తు చేసుకోండి. మా జీవితాలు బాగుండాలని మనసారా కోరుకోండి.

కోట్లలో మాకు వచ్చేది కాణీ డబ్బులే
మా ఊరి నుంచి వచ్చే బాణాసంచా మార్కెట్‌ విలువ దాదాపు 7,000 కోట్లు అంటే నమ్ముతారా. కాని నిజం. అంత బిజినెస్‌లో మాకెంత వస్తుందో తెలుసా? మగ కార్మికునికి రోజుకు రూ. 800 వరకు ఇస్తే, అదే పని చేస్తున్న మాకు రూ. 350కి మించి ఇవ్వరు. అదేం లెక్కో. మగాళ్లు వేరు... మేము వేరా? మా చేతులు చేతులు కావా.. రోజంతా వంగి కూర్చోవడం వల్ల పడిపోయే మా నడుములు నడుములు కావా? వాచిపోయే మా కాళ్లు కాళ్లు కావా? ఏడాది పొడవునా ఊపిరి బిగబట్టి పని చేస్తే పండగ ముగిశాక మా చేతిలో మిగిలేది చాలా తక్కువ. ఈ సంపాదనతోనే పిల్లల చదువులు, అప్పుల మీద వడ్డీలు వెళ్లదీయాలి. మగవాళ్లు సంపాదించింది తాగడానికి తగలేస్తుంటే, ఇల్లు గడవడానికి, పిల్లల కడుపు నింపడానికి ఈ విషపు రసాయనాల మధ్య మేము మా ప్రాణాలను వెలిగించుకోక తప్పడం లేదు.

హ్యాపీ దీపావళి. – కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement