కురుక్షేత్ర (హర్యానా): న్యాయమూర్తులు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన శ్రేష్ఠులుగా నడుచుకుంటే అది యావత్ న్యాయ వ్యవస్థని, తద్వారా సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలదని అమరావతి హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి తమ విశ్వాసాన్ని ప్రకటించటంతో కురుక్షేత్రంలో వైభవంగా సాగుతున్న ‘మహా భారతంలో శ్రీకృష్ణపాత్ర’ నేడు ప్రవచనాలు ముగిశాయి.
“నేను నా కన్నా జూనియర్ న్యాయమూర్తుల కోసం సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంటాను. న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కే ప్రతి మనిషికీ ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం పెరగాలంటే ఈ గీతా సారం మన నడవడిలో ప్రతిఫలించాలి అని” జ్యోతిర్మయి అన్నారు. తన తల్లి బోధించిన విలువైన సూక్తులు (జీవన సూత్రాలు) తన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో గుర్తు చేసుకుంటూ, గీతా బోధ శక్తిని గురించి కూడా న్యాయమూర్తి జ్యోతిర్మయి ప్రసంగించారు.
అమరావతి హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ రావు కూడా ఈ ముగింపు సభలో అతిథిగా పాల్గొంటూ, ఇటువంటి ప్రవచనాల లక్ష్యం భగవంతుని గాథలు వినటంద్వారా భక్తి పెంచుకోవటమేనని, దైవ నామ స్మరణ ఒక్కటే భగవంతుణ్ణి మనసులో నిలుపుకునే మార్గమని అన్నారు. తెలుగులో రాగయుక్తంగా పద్యం పాడి సభను అలరించారు.
మరో ప్రవచన కర్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మహాభారతం మనం ఎలా జీవించాలో సూచించే దిక్సూచి అని సోదాహరణంగా వివరించారు. సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్ మాట్లాడుతూ 2015 లో విన్న షణ్ముఖ శర్మగారి మహాభారత ప్రవచనాలు తన ఆలోచనా విధానాన్ని , జీవన సరళిని ప్రభావితం చేశాయని ఉదాహరణలతో వివరించారు. వారణాశిలోని తారకరామ ఆంధ్రాశ్రమం అధ్యక్షులు సుందర శాస్త్రి ప్రభృతులు ప్రసంగించారు.
తన ప్రవచనాలను వినడానికి ఎక్కడెక్కడినుంచో వందలాది తెలుగువారు రావటం శ్రీకృష్ణుని గాధ పట్ల హిందూసమాజంలో ఉన్న భక్తి విశ్వాసాలకు అద్దం పడుతోందని షణ్ముఖ శర్మ అన్నారు. గీతా బోధ జరిగిన కురుక్షేత్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ ప్రవచనాలు ఏర్పాట్లు చేసిన గోవిందవజ్ఘల కామేశ్వర రావు, తూములూరి బాలాజీ బృందాన్ని ఆయన అభినందించారు.
తొమ్మిది రోజులు ఈ ప్రవచనామృత సాగరంలో ఓలలాడిన ఆధ్యాత్మిక ప్రియులంతా షణ్ముఖ శర్మగారికి పాదపూజ చేశారు. కురుక్షేత్రలోని గీత జ్ఞాన్ సంస్థాన్ ప్రాంగణంలో అక్టోబర్ 24 నుంచి గురుకృప చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలను ప్రత్యక్షంగా వినటానికి దాదాపు 400 మంది తెలుగు వారు వివిధ ప్రాంతాల నుంచి, విదేశాలనుంచి కూడా ఆసక్తి చూపటం విశేషం.
ఇదీ చదవండి: రౌడీయిజం, గూండాయిజంతో భయభ్రాంతులకు గురిచేశారు: రోజా


