సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు, అభిప్రాయభేదాలను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేయడానికి భార్య క్రూరత్వాన్ని విశ్వసనీయ ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ విషయంలో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమరి్థంచింది. అలాగే భార్య దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ ఇచి్చన ఉత్తర్వులను కూడా సబబేనని పేర్కొంది. విడాకులు కోరుతూ ఓ భర్త, దాంపత్య హక్కులను పునరుద్ధరించి కలిసి జీవించడానికి అనుమతి కోరుతూ భార్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.
పొంతన లేని వివరాలు..: భార్యకు మానసిక సమస్యలు ఉన్నాయనేందుకు భర్త వైద్య ఆధారాలు సమరి్పంచలేదని హైకోర్టు పేర్కొంది. అలాగే భార్య ఇంటి నుంచి వెళ్లిపోతూ నగలు తీసుకెళ్లిందన్న ఆరోపణలోనూ పొంతనలేదని తెలిపింది. ఘటన జరిగిన రోజైన ఆదివారం తాను ఆఫీసుకు వెళ్లానని భర్త చెప్పడం విశ్వసనీయంగా లేదని పేర్కొంది. అలాగే అమెరికా వచ్చి తనతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భార్య ఈ–మెయిల్స్ పంపినా భర్త ఆమెను, కుమార్తెను వెంట తీసుకెళ్లలేదని గుర్తుచేసింది. క్రిమినల్ కేసు పెట్టినంత మాత్రాన భార్య భర్తపై క్రూరత్వానికి పాల్పడినట్లు భావించలేమని స్పష్టం చేసింది. ప్రతి కేసులో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, దంపతుల ప్రవర్తనను సమగ్రంగా పరిశీలించాలని తెలిపింది.
ఇదీ నేపథ్యం..: 2009 నవంబర్ 5న వివాహం చేసుకున్న దంపతులకు 2010 సెప్టెంబర్ 26న కుమార్తె జన్మించింది. అయితే భార్య ప్రవర్తన సరిగా లేదని.. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని భర్త ఆరోపించాడు. 2011 మార్చి 6న ఇంట్లోంచి నగలతో పరారైందని.. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపిస్తూ భర్త విడాకులు కోరాడు. అయితే భర్తే తనను వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని భార్య వాదించింది. అదనపు కట్నం కోసం వేధించారని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేశారని తెలిపింది. భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పునిచ్చింది.


