హైదరాబాద్: బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరగిన ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్యే అసలు సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ఆమె తన ప్రియుడితో కలిసి ముందస్తు పథకం ప్రకారం భర్త మహ్మద్ అబ్దుల్ రహీం అలియాస్ బబ్బు (45)ను హత్య చేయించింది. ఇప్పటికే ఇద్దరు నిందితులను టాస్‌్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం పక్కపక్క ఇళ్లలో నివాసం ఉన్న సమయంలో రహీం భార్య షిరీన్‌కు, నిందితుడికి ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న రహీం అతన్ని మందలించి, అక్కడి నుంచి మకాంను సమీపంలోని అబూబకర్ కాలనీకి మార్చాడు. అయినప్పటికీ వీరి నడుమ వివాహేతర సంబంధం యథావిధిగా కొనసాగినట్లు తేలింది. ఈ క్రమంలోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఈ హత్యకు ఒడిగట్టారు. హత్యకు వివాహేతర సంబంధం మాత్రమే కారణమా, లేక మరే ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్య అనంతరం నిందితురాలు చెప్పిన పొంతన లేని సమాధానాలు, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. త్వరలోనే నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు.


