సాక్షి, తెలంగాణ: ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కన్న తల్లిదండ్రులే పసికందును విక్రయించిన అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది.
వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇటీవల వారికి నాలుగో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆ చిన్నారిని పెంచేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ దళారీ మధ్యవర్తిత్వం వహించి రూ.3 లక్షలకు పసికందును విక్రయించినట్లు తెలిసింది.
నెలరోజుల పసికందు విక్రయం వ్యవహారం బయటకు రావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా.. చిన్నారి విక్రయం వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ కాళ్లు విరగ్గొట్టారు..


