breaking news
baby sale
-
నాలుగో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని..
సాక్షి, తెలంగాణ: ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కన్న తల్లిదండ్రులే పసికందును విక్రయించిన అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది.వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇటీవల వారికి నాలుగో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆ చిన్నారిని పెంచేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ దళారీ మధ్యవర్తిత్వం వహించి రూ.3 లక్షలకు పసికందును విక్రయించినట్లు తెలిసింది.నెలరోజుల పసికందు విక్రయం వ్యవహారం బయటకు రావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా.. చిన్నారి విక్రయం వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ కాళ్లు విరగ్గొట్టారు.. -
ఆడపిల్ల పుట్టిందని అమ్మేశాడు!
షాద్‌నగర్ రూరల్: ఆడపిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వాలు ఎంత భరోసా కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. కొందరు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే అమ్మేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆడపిల్ల పోషణ భారమవుతుందని భావించిన ఓ తండ్రి రెండు నెలల పసికందును ఇలానే అమ్మేశాడు. ఘటన రంగారెడ్డి జిల్లా చౌలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేకంగుట్ట తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డి రుక్యాతండాకు చెందిన హస్లీబాయికి రెండేళ్ల క్రితం మేకంగుట్ట తండాకు చెందిన కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కాన్పులో హస్లీబాయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం మరో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. మొదటిసారి ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి కుమార్ భార్యతో తరచూ గొడవపడుతూనే ఉన్నాడు. రెండవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో మరింత ఘర్షణ పడటం ప్రారంభించాడు. రెండో ఆడపిల్ల మనకు వద్దని, అమ్మేద్దామని భార్యను వేధించసాగాడు. రెండు నెలల పసికందును కుమార్ వదిలించుకునేందుకు యత్నించాడు. మానవత్వాన్ని మరిచి కన్నకూతురిని అంగట్లో అమ్మకానికి పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన వారికి రూ.15 వేలకు అమ్మేశాడు. పసిపాపను ఏం చేశావని హస్లీ ప్రశ్నిస్తే చంపుతానని బెదిరించాడు. పోలీసులను ఆశ్రయించడంతో.. కుమార్‌కు హస్లీ కంటే ముందే ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల పరిధిలోని వెంకన్నగూడ తండాకు చెందిన బుజ్జితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుజ్జి కొన్నేళ్ల నుంచి కుమార్‌కు దూరంగా ఉంటోంది. తర్వాత హస్లీబాయిని రెండవ వివాహం చేసుకున్నాడు. కాగా తనను బెదిరించి రెండు నెలల పసికందును తన భర్త అమ్మేశాడని హస్లీబాయి షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. తన ప్రమేయం లేకుండా చిన్నారిని అమ్మేశాడని, తన బిడ్డను ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
తుల్జారావుపేటలో శిశు విక్రయం
నల్లగొండ, చివ్వెంల (సూర్యాపేట) : మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామంలో శిశువును విక్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుగలోతు లింగయ్య, సరోజ దంపతులకు ఆగస్టు 25న పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువు జన్మించింది. నెలరోజుల పాటు తల్లి వద్దనే ఉన్న శిశువు ఇటీవలే సూర్యాపేటకు చెందిన ఓ డ్రైవర్ ద్వారా విజయవాడకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక అంగన్వాడీ కార్యకర్త తేజావత్ జానమ్మ ఐసీడీఎస్ సీడీపీఓకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న సీడీపీఓ అరుణ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. చిన్నారిని ఇక నుంచి తానే చూసుకుంటానని, లేకపోతే ఐసీడీఎస్‌కు అప్పగిస్తానని తల్లి నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. శిశువును తెలిసిన వారికి దత్తత ఇచ్చామని.. ఆస్పత్రి ఖర్చుల కింద వారు రూ. 10 వేలు ఇచ్చారని తల్లిదండ్రులు తమతో చెప్పినట్లు సీడీపీఓ తెలిపారు. -
‘మగ్గాన్’లో శిశువు విక్రయం
శివమొగ్గ, స్థానిక ప్రభుత్వ మగ్గాన్ ఆస్పత్రిలో ఆడశిశువును విక్రయించారు. బాలింత, ఆమె తల్లి కలిసి రూ. ఆరు వేలకు నెల రోజుల పసికందును విక్రయించారు. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా సవళంగ సమీపంలోని కూడతాళ తండాకు చెందిన నాగిబాయి(27) 25 రోజుల క్రితం అక్కడి తాలూకా ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. వారం రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆమెను మగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు తోడుగా తల్లి సోమ్లిబాయి ఉంటున్నారు. మగ్గాన్ ఆస్పత్రిలోని శరావతి వార్డులో ఉంటున్న వీరు గుర్తు తెలియని మహిళ వద్ద నుంచి ఆదివారం మధ్యాహ్నం రూ. ఆరు వేలు తీసుకుని శిశువును అప్పగించారు. విషయాన్ని పక్క బెడ్‌పై ఉన్న రోగులు గుర్తించి ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు. దీంతో ఆస్పత్రి పాలక మండలి ఫిర్యాదు మేరకు దొడ్డపేట పోలీసులు అక్కడకు చేరుకుని తల్లీకూతుళ్లను విచారణ చేశారు. సోమవారం ఉదయం తిరిగి ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సోమ్లీబాయిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నాగిబాయి ఇద్దరు ఆడపిల్లలు, ఓ మగబిడ్డకు జన్మనిచ్చిందని, వీరిని కూడా అప్పట్లో వీరు విక్రయించినట్లు వెలుగు చూసింది. ఈ విషయంపై నాగిబాయిని ప్రశ్నిస్తే తనకు తెలియకుండా తల్లీ ఈ పనిచేసిందని విలపించింది. అదే సమయంలో సోమ్లిబాయి మాట్లాడుతూ... తన కూతురి అభీష్టం మేరకే విక్రయించినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శిశువు విక్రయంలో ఇద్దరి హస్తమున్నట్లు తెలుస్తోంది.


