కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 2051 వరకు కొనసాగే కాలపరిమితిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2051 వరకు తాము బతికుంటామో లేదో కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. నవంబర్ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మహిళా రిజర్వేషన్లపై వాదన
మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో తమ పార్టీ ముందుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహిళా శక్తి కోసం తాము గట్టిగా పోరాడామని చెప్పారు. తాను లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సమయంలో పార్లమెంటులో తనతో పాటు సహచరులపై దాడి జరిగిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని గుర్తుచేశారు.
నవంబర్ 30 నుంచి పార్లమెంటు సమావేశాలు
లోక్‌సభ నవంబర్ 30న తిరిగి సమావేశం కానుండగా, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పూర్తి ఎజెండాను ప్రభుత్వం వెల్లడించనప్పటికీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
లోక్‌సభలో సీట్ల పెంపు ప్రతిపాదన
కొత్త ప్రతిపాదిత చట్టపరమైన విధానంలో లోక్‌సభతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలని ప్రతిపాదించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసే నిబంధనలతో పాటు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అంశాన్నీ చేర్చారు.
మూడింట రెండొంతుల మెజారిటీ కీలకం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభ మొత్తం సభ్యులలో మెజారిటీ మద్దతుతో పాటు, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. స్పీకర్‌ను మినహాయిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌సభలో ఓటు హక్కు ఉన్న సభ్యుల సంఖ్య 538గా ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరంతా ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లుకు 359 ఓట్లు అవసరమవుతాయి. డీఎంకే, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) వంటి పార్టీలు ప్రతిపాదనకు మద్దతు సంకేతాలు ఇచ్చినప్పటికీ తుది ఓట్ల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు
డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సరిహద్దులతో పాటు రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్యలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే తమ రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్లను ఏకరీతిలో 50 శాతం పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మహిళా రిజర్వేషన్లను ప్రస్తుత శాసనసభల బలంతోనే అమలు చేయకుండా డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య పార్లమెంటులో కేంద్రం అవసరమైన మెజారిటీ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


