జనతంత్రం
ఏప్రిల్ నెలలో తోకముడిచిన డీలిమిటేషన్ బిల్లు మెరుపు వేగంతో మరోసారి పార్లమెంట్ తలుపు తట్టబోతున్నది. ఈసారి ఉభయసభల ఆమోదం ఖాయమనే ఆత్మవిశ్వాసం ఎన్డీఏ కూటమిలో తొణికిసలాడుతున్నది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగానే రూపాంతరం చెందు తున్నాయి. ఈ ఘడియల కోసమే వర్షాకాల పార్లమెంట్ సమా వేశాలకు గడియ వేయకుండా మూడున్నర నెలలుగా సర్కార్ ఎదురుచూస్తున్నది. ఎన్డీఏ కూటమి తన పంతాన్ని నెగ్గించు కోవడం ఖాయమనే అభిప్రాయం బలపడింది. ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన డీఎంకే, శరద్‌పవార్ వర్గం ఎన్సీపీ ఈసారి మద్దతును ప్రకటించాయి. వీరికి 29 మంది సభ్యులు న్నారు. అప్పుడు వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్‌లోంచి 20 మంది చీలిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. వారు ఎన్డీఏకు మద్దతునివ్వబోతున్నారు. ఫిరాయింపుల ఫిర్యాదు స్పీకర్ పరిశీలనలో ఉండగా వారి ఓట్లు చెల్లుబాటవుతాయా అనే అను మానం అనవసరం. పొలిటికల్ గేమ్స్‌లో ఫౌల్స్ను లెక్కించరు.
పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి జనాభాకు అనుగుణంగా నియోజక వర్గాల పునర్విభజన చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిన జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ లక్ష్యాలు సాధించిన రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గిపోవడం భావ్యం కాదు గనుక 1971 నుంచి చట్టసభల స్థానాల సంఖ్యపై సీలింగ్ కొనసాగుతున్నది. ఇప్పుడున్న నిష్పత్తి దెబ్బతినకుండా అన్ని అసెంబ్లీల్లోనూ లోక్‌సభలోనూ యాభై శాతం చొప్పున సీట్లు పెంచుకుందామనీ, ఈ ఏర్పాటు ఇంకో పాతికేళ్లపాటు అమలులో ఉంటుందనీ ఈసారి ఎన్డీఏ రాజీకి వచ్చింది. డీఎంకే వంటి పార్టీలు ఇందుకు తలలూపాయి. ఏప్రిల్‌తో పోలిస్తే యాభైకి పైగా సీట్ల బలం తగ్గిపోయిన ఇండియా కూటమి మాత్రం బిల్లును వ్యతిరేకించడానికే కంకణం కట్టుకున్నది. లోక్‌సభ స్థానాల పెంపు ద్వారా శాశ్వతంగా అధికారంలోఉండేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరిగితే బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారనీ, ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం వాటిల్ల బోతున్నదనీ ఇండియా కూటమి హెచ్చరిస్తున్నది. సీట్ల సంఖ్య పెరిగినంత మాత్రాన బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చేంత బలం ఎట్లా వస్తుందనే విషయంలో ఈ కూటమి స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. సర్ కార్యక్రమంలో అప్రదిష్ట మూటకట్టుకున్న జ్ఞానేశ్ కుమార్ చేతికి డీలిమిటేషన్ కార్యక్రమాన్ని అప్పజెప్పు తారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష భయాల్లో నిజం లేదని కూడా చెప్పలేము.
లోక్‌సభ సీట్ల సంఖ్యను అమాంతం 815కు పెంచడానికి బీజేపీ నాయకత్వం ఎందుకింత పట్టుదలతో ఉన్నట్టు? ఇందుకోసం మూడున్నర నెలలుగా పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేయకుండా ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఈ కార్యక్రమానికి కొన్నేళ్ల ముందుగానే పెరిగే సంఖ్యాబలానికి అనుగుణంగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణం వెనుక దాగి ఉన్న వ్యూహమేమిటి? డీలిమిటే షన్ బిల్లును మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టడం దేనికి? మహిళా బిల్లును కవచంగా వాడుకోవడం ఎందుకు?... ఇటువంటి సందేహాలకు బీజేపీ నుంచి కూడా సమాధానాల్లేవు. కనుక దాల్ మే కుచ్ కాలా హై అనుకోవడంలో తప్పులేదు.
అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రయోజనం కలుగుతుందంటే యూపీఏ హయాంలో జరిగిన కార్యక్రమం వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ప్రయోజనం కలిగి ఉండాలి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోగల క్రియాశీలత, చేవ ప్రతిపక్షానికి ఉంటే డీలిమిటేషన్ వ్యూహాలు పెద్దగా పనిచేయక పోవచ్చు. పార్లమెంటరీ స్థానాలు యథాతథంగా ఉండాలా, పెరగాలా అనే చర్చకంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న ఇతర ధోరణులపై దృష్టి పెట్టడం ఇప్పుడు అత్యవసరం.
మన ప్రజా స్వామ్యం రోజురోజుకూ కులీనస్వామ్యంగా దిగజారుతున్నదని అందుబాటులో ఉన్న గణాంకాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. 35 కోట్ల కుటుంబాలు నివసిస్తున్న భారతదేశంలో కేవలం 989 కుటుంబాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఏడీఆర్–2025 అధ్యయనంలో వెల్లడైంది. ఈ కుటుంబాల్లోంచి 1,176 మంది వంశాంకురాలు పార్లమెంట్, అసెంబ్లీల్లో కొలువు తీరి ఉన్నాయి. ప్రస్తుత లోక్‌సభలో 31 శాతం మంది సభ్యులు అనువంశిక శ్రేష్ఠులే. రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిళ్లను కలిపితే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సభ్యులు రాజకీయ కులీన కుటుంబాల వారు.
ఉదారవాద ఆర్థిక విధానాల ఆసరాతో, రాజ్యాధికారం దన్నుతో నయా సంపన్నులుగా అవతరించినవారు చట్టసభల్లో చక్రం తిప్పడం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పుడు చట్ట సభల్లో ప్రతి నలుగురు సభ్యుల్లో ఒకరు ఈ కుటుంబాల వారే ఉన్నారు. ఇందులో స్థానిక సంస్థలను లెక్కలోకి తీసుకోలేదు. సర్పంచ్‌లు, చైర్మన్లు, మేయర్లు వగైరాలను కలుపుకుంటే ఈ నిష్పత్తి ఇంకా పెరుగుతుంది. ఆస్తుల్ని పంచుకున్నట్లు అధికారా లను, పదవులను పంచుకుంటున్న ధోరణి బలపడుతున్నది. ఇప్పుడు పెంచాలనుకుంటున్న 50 శాతం సీట్లలో వీరికే పెద్ద వాటా దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని క్రమక్రమంగా కబళించే ధోరణి.
ఇక పార్లమెంట్, అసెంబ్లీల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్న ధోరణి ఆందోళన కలిగించే రెండో అంశం. పార్లమెంట్లో మొన్నటి వర్షాకాల సమావేశాలనే పరిశీలిద్దాం. 19 రోజుల సమావేశాల్లో యధార్థంగా పదిహేడున్నర గంటలు మాత్రమే పార్లమెంట్లో చర్చలు జరిగాయి. షెడ్యూల్డ్ సమయం 85 శాతం వృథాగా మారిపోయింది. ప్రశ్నోత్తరాలకు కేటాయించిన సమయంలో కేవలం ఒక్క శాతం మాత్రమే సద్వినియోగమైంది. సమావేశాల్లో లోక్‌సభ 11 బిల్లుల్ని ఆమోదిస్తే వాటిపైమంత్రులు మినహా ఏ ఒక్క సభ్యుడూ మాట్లాడకుండానే తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ‘పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్’ విడుదల చేసిన గణాంకాలివి. ఇటువంటి పరిస్థితులను మార్చడంపై దృష్టి పెట్టకుండా సంఖ్యను పెంచితే సత్ఫలితాలు కలుగుతాయా?
ఆందోళన కలిగిస్తున్న మరో అంశం: మన చట్టసభల సభ్యులు రాజ్యాంగంలో చెప్పిన విధులను వదిలేసి కొత్త బాధ్య తల్ని తలకెత్తుకోవడం. బిల్లులపై జరిగే చర్చల్లో వాళ్ళు పాల్గొ నాలి. సలహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వ ఖర్చుల్లో అసంగతాలను ప్రశ్నించాలి. సభాసంఘాల్లో చురుకైన పాత్ర పోషించాలి. అవసరమైనప్పుడు నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర, దేశ సమస్యలను ప్రస్తావించాలి. ఆ పనులు జరగట్లేదని స్వతంత్ర సంస్థల పరిశోధనల్లోనే వెల్లడైంది. మరేం చేస్తున్నారు మనవాళ్లు? వారివారి నియోజక వర్గాల్లో సామంత రాజుల్లా వెలిగిపోతున్నారు. ప్రభుత్వాధికారుల పోస్టింగులకూ, బదిలీ లకు ముడుపులు పుచ్చుకొని పచ్చజెండాలు ఊపుతున్నారు.
లంచాలు మేసే అధికారులకు అండగా నిలబడి వాటాలు గుంజు తున్నారు. మద్యం షాపుల్లో మామూళ్లు వసూలు చేసి ఇచ్చేందుకు ఎక్సైజ్ అధికారులనే ఉపయోగించుకుంటున్నారు. ఇసుక, మట్టి, కంకర... ఏదైనా సరే టిప్పర్ కదలాలంటే కప్పం కట్టా ల్సిందే. బినామీలకు కాంట్రాక్టులు దక్కేలా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పనులైతే ఎంపీలకు కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే. రైల్వేల నుంచి జాతీయ రహదారుల వరకు ఇదే తంతు. అసలు కాంట్రాక్టుల కోసమే ఎంపీ అవతారాలెత్తడం బాగా పెరిగి పోయింది. ఇటువంటి పెడధోరణులపై చర్చించడానికి ఇప్పుడె వరూ సిద్ధంగా లేరు.
రాజ్యాంగాన్ని సవరించే బిల్లు దేనికైనా రాజ్యసభ సమ్మతి కూడా అవసరం. అటువంటి రాజ్యసభ స్థానాలను పెంచకూడ దని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. లోక్‌సభ ప్రజలకు ప్రాతి నిధ్యం వహించేది కనుక జనాభాకు అనుగుణంగా స్థానాలను పెంచాలని చెప్పారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఎగువసభ. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్, అర్జెంటీనా, మెక్సికో, నైజీరియా వంటి పలు దేశాల ఎగువ సభల్లో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం ఉన్నది. చిన్న రాష్ట్రాల ప్రయోజనాలకు దెబ్బ తగలకుండా ఫెడరల్ స్ఫూర్తితో చేసు కున్న ఏర్పాటిది. భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికర ణమే భారత్‌ను ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’గా ప్రకటించింది. చిన్న రాష్ట్రాలకు, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని భావించేవారు రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేయవచ్చు. అట్లాకాకుండా లోక్‌సభ స్థానాల సంఖ్యపై చేసే యుద్ధం షాడో బాక్సింగ్గానే మిగిలిపోతుంది.
ప్రతిపక్షం ఎంత గింజుకున్నా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని నియోజక వర్గాలు పెరుగుతాయి, ఎక్కడెక్కడ కొత్త నియోజకవర్గాలొస్తాయి, ఎమ్మెల్యేలుగా వచ్చే మహిళా నేతలు ఎవరనే చర్చ విస్తృతంగా మొదలైంది. యాభై శాతంపెంపు లెక్క ప్రకారం ఏపీలో 38 లోక్‌సభ స్థానాలు, 263 అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి. అయితే ఒక్కో లోక్‌సభకు ఏడు అసెంబ్లీ సీట్ల చొప్పున లెక్క వేసుకుంటే ఈ సంఖ్య 266 కూడా కావచ్చు. అలాగే తెలంగాణలో 179 అసెంబ్లీ నియోజక వర్గాలు, 26 లోక్‌సభ స్థానాలు ఏర్పడాలి. కానీ, ఒక్కో లోక్‌సభకు ఏడు చొప్పున అసెంబ్లీ సీట్లను లెక్కిస్తే ఆ సంఖ్య 182కు చేరుకుం టుంది.
నానాటికీ పడిపోతున్న జీవన ప్రమాణాలు, పెరుగు తున్న ఆర్థిక అసమానతలు, ప్రబలుతున్న నిరుద్యోగం, పడి పోతున్న విద్యాప్రమాణాలు, అంగడి సరుకుగా మారుతున్న వైద్యం, గాలిలో దీపంగా మారిన వ్యవసాయం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మన మీడియా సంస్థలు ఈ రెండేళ్లపాటు పెరిగే నియోజక వర్గాలకే చర్చను పరిమితం చేస్తాయి. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, అందుకు తీవ్రంగా కృషి చేసిన అమిత్ షాకే క్రెడిట్ దక్కుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, రాహుల్ గాంధీ డీఎంకే పార్టీకి హ్యాండివ్వకపోతే బిల్లు ఆమోదం పొందే అవకాశమే లేదు. కనుక ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


