బోర్డ్‌ రూమ్‌లో రాజ్యం! | Developments at Nvidia are surprising people all over the world | Sakshi
Sakshi News home page

బోర్డ్‌ రూమ్‌లో రాజ్యం!

Nov 27 2026 3:58 AM | Updated on Nov 27 2026 3:58 AM

Developments at Nvidia are surprising people all over the world

అపారమైన సంపద పోగేస్తూ అమెరికన్‌ కార్పొరేట్‌ దిగ్గజాల వరసలో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియా సంస్థ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.   సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్‌ సంస్థ చీఫ్‌ అలిస్‌ హువాంగ్‌తో సంబంధాలు గుప్పు మనడంతో అల్లరై, పదవినుంచి తప్పుకున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ వెళ్లినంత వేగంగా మళ్లీ తిరిగిరావటం ఆ ఆశ్చర్యానికి కారణం. నిజానికి ఇది కొత్తేం కాదు. ఓపెన్‌ ఏఐ చీఫ్‌ సామ్‌ ఆల్ట్‌మాన్‌ కూడా ఇలాగే వెళ్లొచ్చారు. అంతక్రితం యాపిల్‌లో స్టీవ్‌ జాబ్స్‌ కూడా అంతే. కానీ కార్పొరేట్‌ గవర్నెన్స్, దానికి ఉందనుకుంటున్న స్వతంత్రతఉత్త డొల్ల అని తెలియడం, రాజ్యం ఒత్తిడిని ఏ బోర్డు రూమ్‌ అయినా సరే శిరసావహించక తప్పని పరిస్థితులేర్పడ్డాయని గ్రహించటం ఈ ఉదంతంలో అదనం. 

తన ప్రవర్తన సరిగా లేదని జెన్సన్‌ కూడా అంగీకరించారు. దీన్లో మరో కోణం కూడా ఉంది. అలిస్‌కు చైనా గూఢచార సంస్థలతో సంబంధం ఉన్నదనీ, ఎన్విడియా లోగుట్టు వారికి చేరిందనీ... ఆ చిప్‌లు ఆయుధ సామగ్రిలో వినియోగించి, చైనా సైన్యం అమెరికాకు దీటుగా తయారైవుండొచ్చనీ మీడియా కథనాలు అంచనా వేశాయి. సాధారణంగా తన భద్రతకు ముప్పు కలిగించారనేవారిని అమెరికా సహించదు. వారికి వందల ఏళ్లు కారాగారవాసం పడటం కూడా రివాజు. 

కానీ జెన్సన్‌కు ఇలాంటి ‘సత్కారం’ ఎదురుకాలేదు సరిగదా... 11 రోజుల వ్యవధిలో ఆయన మళ్లీ సంస్థలోకి తిరిగొచ్చారు. తెరవెనక ఏం జరిగిందో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంస్థ బోర్డుపై ఎంత ఒత్తిడి తెచ్చారో మీడియా కథలుగా చెబుతోంది. ‘అమెరికాను మళ్లీ మహోన్నతం చేయాల’న్న సంకల్పంగల ‘మాగా’ ఉద్యమ బాధ్యతలు కూడా చూస్తున్న ట్రంప్‌... జెన్సన్‌ నిష్క్రమణతో ఎంత తల్లడిల్లిపోయారో ఆయన ప్రకటనలే చెప్పాయి. ఎన్విడియా నష్టపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నది ఆయన బెదిరింపు. 

ఎన్విడియా వ్యవహారం ఇన్ని మలుపులు తిరగటం చర్చనీయాంశమైంది. జెన్సన్‌ దాని సహ వ్యవస్థాపకుడే కావొచ్చుగానీ... విధి నిర్వహణలో ఆయన తీరు ఏ వ్యాపార సామ్రాజ్యమూ సహించలేనిది. వాటికి లాభాలు ఆర్జించేవారు అవసరమే అయినా, వ్యక్తిగత ప్రవర్తన సక్రమంగా లేదంటే అది సంస్థపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఉంటుంది. కానీ జెన్సన్‌ నిష్క్రమణ తర్వాత కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు ఆయన పునరాగమనంతో ఒక్కసారిగా లక్ష కోట్ల డాలర్లకు ఎగబాకాయట! ఇదంతా ఒక్క ఎన్విడియా మదుపుదార్లకు సంబంధించింది. దాంతో ముడిపడిన ఇతర కంపెనీల షేర్ల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఇదింకా ఎక్కువే ఉండొచ్చు. 

ఉన్నత స్థానాల్లోనివారికి ఉందని చెప్పే వివాహేతర సంబంధాలపై చెవులు కొరుక్కోవటం ఒకప్పటి రివాజు. కానీ అటువంటì వాటికి సైతం మీడియాలో ‘తగినంత’ చోటు దొరకడం తెలుగు ప్రజలకు తెలుసు. సామాజిక మాధ్యమాలు ఎక్కువైనాక ఈ ధోరణి మరింత వికటించింది. జనం సమస్యలకన్నా వాటికే ప్రాధాన్యత పెరిగింది. అమెరికాలో సైతం ఇదే ధోరణి ఉన్నదని జెన్సన్‌ వ్యవహారం నిరూపించింది. అలిస్‌ పుట్టుపూర్వోత్తరాలు మీడియాకు ఇప్పుడు పెద్ద మేత. ఇందులో పురుషాధిపత్య కోణాన్ని తోసిపుచ్చలేం. దేశద్రోహం జరిగిందని వినబడుతున్నా, దాన్ని నిర్ధారించే సాక్ష్యాలుఇంతవరకూ లేవు. వచ్చేవారం అమెరికన్‌ కాంగ్రెస్‌ కమిటీల విచారణకు జెన్సన్‌ హాజరవుతారు.

ఇదంతా సరేగానీ... లాభార్జనే ధ్యేయంగా పనిచే స్తామని మదుపుదారులకు హామీ పడుతూ కంపెనీలు రూపొందించుకునే నిబంధనలూ, జవాబుదారీతనంతో కూడిన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఏమైనట్టు? దాని స్వతంత్రత, పారదర్శకత ఎటు పోయినట్టు? రాజ్యం బోర్డు రూమ్‌లోకి చొరబడి ఆదేశాలిస్తే, నిర్దేశిస్తే లొంగిపోయేంత పిపీలికమా ఎన్విడియా? అమెరికాలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పరిచి, విదేశాలపై ఒత్తిడి తెచ్చి లేదా ఒప్పించి కంపెనీల వ్యాపారాన్ని మరిన్ని రెట్లు పెంచటం మొన్నటివరకూ అమెరికా అధ్యక్షుల బాధ్యత. కానీ ట్రంప్‌ దాన్ని తలకిందులు చేశారు.ఇంతకూ కొన్ని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నట్టు లక్షల డాలర్ల విలువచేసే ఎన్విడియా షేర్లు ఆయన కుటుంబానికి ఉండటమే ఈ చొరబాటుకు కారణమా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement