భారత్‌పై మరోసారి ట్రంప్‌ పిడుగు! | US proposes up to 25 percent excess capacity tariff on India | Sakshi
Sakshi News home page

భారత్‌పై మరోసారి ట్రంప్‌ పిడుగు!

Nov 25 2026 9:31 PM | Updated on Nov 25 2026 9:34 PM

US proposes up to 25 percent excess capacity tariff on India

వాషింగ్టన్: భారత్‌పై గరిష్ఠంగా 25 శాతం సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించనున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) వెల్లడించింది. అధిక ఉత్పత్తి సామర్థ్యం పేరుతో 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై చేపట్టిన దర్యాప్తు అనంతరం ఈ ప్రతిపాదనలు వచ్చాయి.

ఇందులో ప్రతి దేశానికి అమెరికా రెండు రకాల సుంకాలను ప్రతిపాదించింది. వాణిజ్య ఒప్పందం కుదిరిన దేశాలకు తక్కువ సుంకం, ఒప్పందం కుదరకపోతే అధిక సుంకం విధించేలా నిర్ణయించింది. ఒప్పందాలు రద్దయినా, చర్చలు నిలిచిపోయినా మరింత ఎక్కువ సుంకాలు విధించే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటికే భారత్‌పై జూలై నుంచి అమల్లో ఉన్న 10 శాతం సుంకానికి ఈ కొత్త సుంకం అదనంగా వర్తించదు. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దానినే వసూలు చేస్తారు. 17 శాతం సుంకం అమలైతే భారత ఎగుమతులపై ప్రస్తుతం ఉన్నదానికంటే మరో 7 శాతం భారం పడుతుంది. కొత్త సుంకాలపై త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ, విచారణలు ప్రారంభం కానున్నాయి. వచ్చే జనవరి కంటే ముందుగా ఇవి అమల్లోకి వచ్చే అవకాశం లేదని అమెరికా అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరిలో కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌పై 18 శాతం సుంకం ఉండగా, తాజా ప్రతిపాదనలో 17 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. భారత్‌కు పోటీగా ఉన్న ఆసియా దేశాలపై అమెరికా మరింత ఎక్కువ సుంకాలను ప్రతిపాదించింది. వియత్నాంపై 35 శాతం, ఒప్పందం కుదిరితే 20 శాతం సుంకం విధించనుంది. బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌లపై 18 శాతం సుంకాన్ని ప్రతిపాదించింది.

అమెరికా ప్రతిపాదనలను భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు న్యూఢిల్లీలోని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించలేదు.

ఇదీ చదవండి: యూపీ సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాతే నిర్ణయం: కేశవ్ మౌర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement