ఈపీఎఫ్‌లో ఇక నేరుగా డబ్బులేసుకోవచ్చు! | EPFO big update Employees Deposit Money Directly Into PF Account Without Employer | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌లో ఇక నేరుగా డబ్బులేసుకోవచ్చు!

Nov 25 2026 8:39 PM | Updated on Nov 25 2026 8:57 PM

EPFO big update Employees Deposit Money Directly Into PF Account Without Employer

ఎంత సేపూ ఈపీఎఫ్‌ నుంచి డబ్బులు ఎలా విత్‌ డ్రా చేసుకోవాలని ఆలోచిస్తుంటారు చాలా మంది ఉద్యోగులు. ఇదే సమయంలో తమ ఈపీఎఫ్‌ ఖాతాలోకి నేరుగా ఉద్యోగులే డబ్బులు జమ చేసుకునే రోజులు త్వరలోనే వస్తున్నాయి...

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇకపై ఉద్యోగులు తమ యజమానుల (ఎంప్లాయర్స్‌) ప్రమేయం లేకుండానే నేరుగా పీఎఫ్‌ ఖాతాల్లో అదనపు డబ్బులు జమ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు తమకు వచ్చిన బోనస్‌, ఇతర అదనపు ఆదాయంలో కొంత మొత్తాన్ని రిటైర్మెంట్ పొదుపు కోసం పీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన నవంబర్ 19న జరిగిన ఈపీఎఫ్‌ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా నేరుగా స్వచ్ఛంద విరాళాలు (Direct Voluntary Contributions), థర్ఢ్‌ పార్టీ నుంచి చిన్న మొత్తాల చెల్లింపులు (Third-party Micro-contributions) స్వీకరించేందుకు యూఏఎన్‌ ఆధారిత వ్యవస్థను ప్రతిపాదించారు.

కంపెనీ ప్రమేయం లేకుండానే డిపాజిట్‌!

ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం, డీఏలో సాధారణంగా 12 శాతం పీఎఫ్‌కు జమ చేస్తారు. యజమాని (కంపెనీ) కూడా తన వంతు వాటాను చెల్లిస్తారు. అంతేకాకుండా, ఉద్యోగులు అదనంగా పొదుపు చేయాలనుకుంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా ఎక్కువ మొత్తాన్ని అందించవచ్చు. అయితే ఈ అదనపు మొత్తాన్ని కూడా ప్రస్తుతం యజమాని ద్వారానే పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది.

కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ విధానం మారనుంది. ఉద్యోగులు తమ యూఏఎన్‌ ద్వారా నేరుగా అదనపు మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఇందుకు ప్రతిసారీ యజమానిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ డిపాజిట్లకు సంబంధించిన గరిష్ఠ పరిమితి, చెల్లింపు విధానం వంటి వివరాలను ఇంకా ప్రకటించలేదు.

గిగ్‌ వర్కర్లు, ఫ్రీలాన్సర్లకూ ప్రయోజనం

ఈ ప్రతిపాదనలో మరో ముఖ్యమైన అంశం మూడో పక్షాల నుంచి చిన్న మొత్తాల విరాళాలను స్వీకరించడం. ఉదాహరణకు.. డెలివరీ ఉద్యోగులకు కస్టమర్లు ఇచ్చే టిప్స్‌ వంటి మొత్తాలను కూడా వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసే వెసులుబాటు కల్పించనున్నారు. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లు, డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవచ్చు. క్రమబద్ధమైన నెలవారీ జీతం లేని వారికి కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.

పన్ను ప్రయోజనాలు ఉంటాయా?

ఈ కొత్త విధానంలో స్వచ్ఛందంగా జమ చేసే మొత్తాలకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో అవసరమైన మార్పుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. అనంతరం ఈపీఎఫ్‌ పథకంలో అవసరమైన సవరణలు చేసి అధికారికంగా నోటిఫై చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ డిపాజిట్ పరిమితి, అర్హతలు, చెల్లింపు విధానం, పన్ను నిబంధనలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement