EPFO గుడ్‌న్యూస్‌.. కొత్త ‘విత్‌డ్రా ప్లాన్‌’కు ఆమోదం! | EPFO New SWP Rule Monthly PF Withdrawal After Retirement | Sakshi
Sakshi News home page

EPFO గుడ్‌న్యూస్‌.. కొత్త ‘విత్‌డ్రా ప్లాన్‌’కు ఆమోదం!

Nov 19 2026 6:05 PM | Updated on Nov 19 2026 6:10 PM

EPFO New SWP Rule Monthly PF Withdrawal After Retirement

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF) జమ చేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్‌ సొమ్మును ఒకేసారి ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో కొత్త వెసులుబాటు కల్పించనుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ పొదుపులను విడతలవారీగా పొందేందుకు వీలుగా  సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)కు ఆమోదం తెలిపింది. దీంతో రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్‌లో మిగిలిన మొత్తంపై వడ్డీ పొందుతూ, క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన తాజాగా జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం ప్రారంభ దశలో రూ.5 లక్షలకు పైగా పీఎఫ్‌ నిల్వలు కలిగి, 55 ఏళ్లు దాటిన సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అంచనా.

మూడు రకాలుగా డబ్బులు పొందే అవకాశం

ఈ కొత్త విధానంలో సభ్యులకు ప్రధానంగా మూడు రకాల ఉపసంహరణ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.

1. విడతలవారీ ఉపసంహరణ: పీఎఫ్‌లోని మొత్తం పొదుపును నిర్ణీత వ్యవధిలో నెలవారీ లేదా ఇతర విడతల రూపంలో తీసుకోవచ్చు.

2. పాక్షిక ఉపసంహరణ: కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని, మిగిలిన సొమ్మును విడతలవారీగా పొందవచ్చు.

3. వడ్డీ మాత్రమే ఉపసంహరణ: అసలు మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలోనే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే తీసుకోవచ్చు.

సభ్యుల కుటుంబాలకూ ప్రయోజనం

ఈ పథకంలో డబ్బులు తీసుకుంటున్న సమయంలో సభ్యుడు మరణిస్తే, మిగిలిన పీఎఫ్‌ మొత్తాన్ని నామినీ లేదా మృతుడిపై ఆధారపడినవాళ్లు ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే గతంలో నిర్ణయించిన విధంగానే విడతలవారీ చెల్లింపులను కొనసాగించే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. అలాగే సభ్యులు తమ విత్‌డ్రా ప్లాన్‌ను మధ్యలో నిలిపివేసి, మిగిలిన మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త విధానం ద్వారా రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్‌ సొమ్మును నిర్వహించడం సులభం కానుంది. అయితే ఎంతకాలం పాటు విడతల చెల్లింపులు ఉంటాయి? కనీసం ఎంత మొత్తాన్ని ఖాతాలో ఉంచాలి? ఉపసంహరణలు ఏ రకమైన విడతల్లో ఉంటాయి? వంటి అంశాలపై ఈపీఎఫ్ఓ పూర్తి మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement