ఎంబీఏ విద్యార్థులు ఏఐ నేర్చుకోవాల్సిందేనా? | MBA Students Must Learn AI Emerging Trends Skills IIM Professor advice | Sakshi
Sakshi News home page

ఎంబీఏ విద్యార్థులు ఏఐ నేర్చుకోవాల్సిందేనా?

Nov 19 2026 4:16 PM | Updated on Nov 19 2026 4:28 PM

MBA Students Must Learn AI Emerging Trends Skills IIM Professor advice

‘కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగాల తీరు వేగంగా మారుతోంది. రెండు, మూడు విభాగాల్లో నైపుణ్యాలున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థులు కూడా దీనికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి’ అని అంటున్నారు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) –లక్నో.. నోయిడా క్యాంపస్‌ అడ్మిషన్‌ చైర్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ ఆశిష్‌ అగర్వాల్‌. యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన.. కార్పొరేట్‌ రంగంలో పలు హోదాల్లో పని చేశారు. గత పదేళ్లుగా ఐఐఎం లక్నోలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలో మేనేజ్‌మెంట్‌ విద్య, కెరీర్స్, తాజా ట్రెండ్స్‌పై విలువైన సలహాలు, సూచనలు అందించారు.

ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్‌ రంగంలో తెరపైకి వస్తున్న హైబ్రీడ్‌ కెరీర్స్‌ ప్రాధాన్యత ఏమిటి?

గత కొన్నేళ్లుగా కంపెనీల అవసరాలు, కార్యకలాపాలు వేగంగా మారిపోతున్నా యి. గతంలో ఫైనాన్స్‌, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్‌ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఎంబీఏలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు వ్యాపార సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు వాటికి సాంకేతిక పరిష్కారాలను గుర్తించగలిగే అభ్యర్థులను సంస్థలు కోరుకుంటున్నాయి. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌ వంటి అంశాలపై మేనేజ్‌మెంట్‌ నిపుణులకు అవగాహన తప్పనిసరిగా మారింది. టెక్నాలజీతో అనుసంధానమైన మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఒక డొమైన్‌ అభ్యర్థులు.. మరో డొమైన్‌ నాలెడ్జ్‌ సొంతం చేసుకోవడం.. కంపెనీల్లో ఈ రెండు డొమైన్లకు సంబంధించిన విధులు నిర్వర్తించేలా కెరీర్స్, జాబ్‌ ప్రొఫైల్స్‌ ఉంటున్నాయి. వీటినే హైబ్రీడ్‌ కెరీర్స్‌ అంటున్నారు. వీటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు సమాయత్తం కావాలి.

ఏఐ, డేటా అనలిటిక్స్‌ ప్రాధాన్యం పెరుగుతోంది కదా! ఎంబీఏ విద్యార్థులు ఎలా వ్యవహరించాలి?

డేటా ఆధారంగా వ్యాపార సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను సూచించడం నేర్చుకోవాలి. ఏఐ టూల్స్‌ను వినియోగించడం, వాటి పరిమితులు తెలుసుకుంటూ.. ఫలితాలను అధ్యయనం చేయడం కూడా ముఖ్యమే. అదేవిధంగా బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్, ప్రోగ్రామింగ్, సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు కమ్యూనికేషన్, నాయకత్వం, టీమ్‌ మేనేజ్‌మెంట్, సమస్య పరిష్కార సామర్థ్యాలు కూడా సొంతం చేసుకోవాలి.

ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ విద్య స్వరూపం, మార్పులపై మీ అభిప్రాయం?

మేనేజ్‌మెంట్‌ విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన బోధన వైపు సాగుతోంది. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేస్‌ స్టడీస్, లైవ్‌ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ నిపుణులతో ఇంటరాక్షన్‌ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. కోర్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులతో పాటు ఏఐ, అనలిటిక్స్, డిజిటల్‌ బిజినెస్, సస్టెయినబిలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి అంశాలను పాఠ్యప్రణాళికలో సమన్వయం చేయాలి. విద్యార్థులు కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా.. వాస్తవ వ్యాపార సమస్యలకు పరిష్కారాలు చూపగలగాలి.

స్పెషలైజేషన్‌ ఎంపికలో ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

జనరల్‌ మేనేజ్‌మెంట్‌.. వ్యాపారంలోని అన్ని ప్రధాన విభాగాలపై విద్యా ర్థులకు అవగాహన కల్పిస్తుంది. స్పెషలైజేషన్‌ మాత్రం ఒక నిర్దిష్ట రంగంపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. విద్యార్థి ఆసక్తి, విద్యా నేపథ్యం, పని అనుభవం, భవిష్యత్‌ కెరీర్‌ లక్ష్యాలను బట్టి స్పెషలైజేషన్‌ ఎంపిక చేసుకోవాలి. ఏ స్పెషలైజేషన్‌ ఎంచుకున్నా.. ఫైనాన్స్‌, మార్కెటింగ్, ఆపరేషన్స్‌, వ్యూహాత్మక నిర్వహణ వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి.

ఎంబీఏలో ఆవిష్కృతం అవుతున్న ఎమర్జింగ్‌ స్పెషలైజేషన్ల ప్రాధాన్యం?

బిజినెస్‌ అనలిటిక్స్, ఫిన్‌టెక్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, సస్టెయినబిలిటీ వంటి స్పెషలైజేషన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే సంప్రదాయ స్పెషలైజేషన్ల ప్రాధాన్యం తగ్గిందని భావించకూడదు. అదే విధంగా మార్కెటింగ్, ఫైనాన్స్‌.. ఇలా అన్నింటిలో ఏఐ వినియోగం పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీని అర్థం చేసుకుని.. దాని ఆధారంగా వ్యాపార వ్యూహాలను రూపొందించగల నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం కొత్త తరం స్పెషలైజేషన్లపై దృష్టి పెట్టడం ఉపయుక్తంగా ఉంటుంది.

క్యాట్‌–2026 అభ్యర్థులకు మీ సలహా?

క్యాట్‌ స్కోర్‌ అనేది అడ్మిషన్లకు ఎంట్రీ పాస్‌ మాత్రమేనని భావించాలి. క్యాట్‌ తర్వాత నిర్వహించే ఎంపిక ప్రక్రియల్లో గెలుపొందడం కూడా ఎంతో ముఖ్యం. కేవలం బుక్‌ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా.. క్రిటికల్‌ థింకింగ్, టీమ్‌ లీడర్‌షిప్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.


- ప్రొఫెసర్‌ ఆశిష్‌ అగర్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement