దేశీయ ఔషధ సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు ముడి ఔషధ పదార్థాల (బల్క్ డ్రగ్స్) పంపిణీపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇకపై బల్క్ డ్రగ్స్ హోల్‌సేల్ (టోకు) వ్యాపారానికి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఔషధ ఫార్ములేషన్లు (ట్యాబ్లెట్లు, సిరప్‌లు వంటివి), బల్క్ డ్రగ్స్ రెండింటి హోల్‌సేల్ విక్రయాలకు ఒకే ఉమ్మడి లైసెన్స్ అమల్లో ఉంది. అయితే, ఈ విధానంలో ముడి పదార్థాల వాడకాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడంలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ఔషధ నియమావళి-1945కు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పక్కా పర్యవేక్షణ
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. బల్క్ డ్రగ్స్ హోల్‌సేల్ వ్యాపారం చేయాలనుకునే వారు ప్రత్యేకంగా ఫారమ్ 19-బీసీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు పరిశీలన అనంతరం ఫారమ్ 20-బీసీ ద్వారా ప్రత్యేక లైసెన్స్‌ను జారీ చేస్తారు. ఔషధాల తయారీలో కీలకమైన క్రియాశీల, నిష్క్రియాత్మక బల్క్ పదార్థాల నిల్వ, రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించేందుకు ఈ మార్పు దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా, బల్క్ డ్రగ్స్ విక్రయాలు కేవలం అర్హత కలిగిన వ్యక్తి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరగాలని నిబంధనల్లో స్పష్టం చేసింది. దీనివల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడంతోపాటు సరఫరా గొలుసులో జవాబుదారీతనం పెరుగుతుంది.
మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి
కొత్త లైసెన్సింగ్ విధానంలో విక్రయించే బల్క్ డ్రగ్స్ వివరాలను లైసెన్స్‌లో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985 పరిధిలోకి వచ్చే ఔషధ పదార్థాలను ప్రత్యేకంగా గుర్తిస్తారు. తద్వారా మత్తుపదార్థాలు, మానసిక ప్రభావిత రసాయనాలు అక్రమ మార్గాల్లోకి మళ్లకుండా అడ్డుకట్ట వేయడం నియంత్రణ సంస్థలకు సులభతరం కానుంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్యను కట్టడి చేయడంలోనూ ఈ నిర్ణయం కీలకం కానుంది. యాంటీబయాటిక్ ముడి పదార్థాల అనధికారిక విక్రయాలను నిరోధించడం ద్వారా వాటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: ‘ప్రైవేటు బైక్ ట్యాక్సీకి అనుమతులివ్వండి’


