సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలు, సర్వీసు నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. 2025 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయిస్తారు.
ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలకు క్లాస్–1, 2 పరిధిలోని అన్ని కేటగిరీల పోస్టులకూ రెవెన్యూ జిల్లానే ప్రాథమిక యూనిట్‌గా నిర్ణయించారు. ఆయా క్లాస్ పోస్టుల విభజన వివరాలతో కూడిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం జారీ చేశారు. క్లాస్–1లో స్కూల్ అసిస్టెంట్, మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితర 19 కేటగిరీలు, క్లాస్–2లో సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్లు సహా మొత్తం 13 కేటగిరీలు ఉన్నాయి.
ఎంపీపీ, జెడ్పీపీ ఉపాధ్యాయులకు కూడా..
అలాగే, ఎంపీపీ, జెడ్పీపీ ఉపాధ్యాయులకు కొత్త సర్వీస్ రూల్స్ ఇస్తూ మరో జీవో ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో లోకల్ కేడర్ అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. సర్వీసును క్లాస్–1లో స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ ప్రైమరీ హెచ్‌ఎం కలిపి 15 కేటగిరీలు, క్లాస్–2లో ఎస్జీటీ, ఇతర స్పెషలిస్ట్ టీచర్లు కలిపి 10 కేటగిరీలుగా వర్గీకరించారు.
» నాన్–లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 30% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 70% ప్రమోషన్ల ద్వారా, లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 70% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 30% ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు.
» పీఈటీ పోస్టులకు భవిష్యత్తులో కొత్త రిక్రూట్‌మెంట్ ఉండదు.
» స్కూల్ అసిస్టెంట్ (పీఈటీ మినహా), ఎస్జీటీ పోస్టులకు టెట్ తప్పనిసరి. ఎస్జీటీగా ఎంపికయ్యే బీ.ఎడ్ అభ్యర్థులు రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలి.
» నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లకు రెవెన్యూ జిల్లానే యూనిట్‌గా ఉంటుంది. మండల, జిల్లా పరిషత్‌లలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీని వారు విధుల్లో చేరిన తేదీ నుంచే లెక్కిస్తారు.


