బాబు రౌడీ రాజ్యంలో... రిగ్గింగ్‌దే విజయం | The coalition that hijacked the municipal election process | Sakshi
Sakshi News home page

బాబు రౌడీ రాజ్యంలో... రిగ్గింగ్‌దే విజయం

Nov 4 2026 5:44 AM | Updated on Nov 4 2026 5:44 AM

The coalition that hijacked the municipal election process

చిత్తూరులోని వళ్లియప్ప నగర్‌ బూత్‌లోకి చొరబడి రిగ్గింగ్‌ చేస్తున్న టీడీపీ రౌడీలు.. ఒంగోలులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ గూండాల దాడి (ఫైల్‌)

ప్రజాతంత్రం కాదు... అంతా చంద్రబాబు కుతంత్రమే.. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను హైజాక్‌ చేసిన కూటమి

చంద్రబాబు పన్నాగానికి ఎన్నికల కమిషన్‌ వత్తాసు 

బాబు జంగిల్‌ రాజ్‌కు కొమ్ముకాసిన పోలీసులు 

నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకూ దశకుట్రల బరితెగింపు 

కూటమి రెండున్నరేళ్ల పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత 

మున్సిపల్‌ ఎన్నికలు సక్రమంగానిర్వహిస్తే కూటమి ఓటమి ఖాయం 

అందుకే యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలకు తెగబడ్డ కూటమి 

నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు కుట్రలమయం 

పోలింగ్‌ రోజు రాత్రికి రాత్రే లక్షల్లో పెరిగిపోయిన ఓట్లు 

కౌంటింగ్‌ సందర్భంగానూపచ్చమూకల బీభత్సం... 

మొత్తంగా ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ముఠా 

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని నిలువునా సమాధి చేశారు. ఎన్నికలంటే ప్రజాతంత్ర ప్రక్రియ కాదు.. అధికార పార్టీ ఆడే కుతంత్రాల ఆట అని నిర్లజ్జగా చాటిచెప్పారు. రెండున్నరేళ్ల పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తిన చంద్రబాబు.. తన మార్కు అధికార దౌర్జన్యానికి తెరలేపారు. ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజాస్వామ్య వ్యవస్థలనే తన రాజకీయ ప్రయోజనాలకు పావులుగా మార్చుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ కూటమి తన గుప్పిట్లోకి తీసుకుంది. నామినేషన్ల దశ నుంచి స్రూ్కటినీ, ఉపసంహరణలు, పోలింగ్, పోలింగ్‌ శాతం నమోదు, కౌంటింగ్‌ వరకు అడుగడుగునా అక్రమాలు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, దాడులతో ఎన్నికల వ్యవస్థను భ్రషు్టపట్టించారు. 

కీలకమైన పోలింగ్‌ రోజున రిగ్గింగ్, బూత్‌ల ఆక్రమణలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులతో భయానక వాతావరణం సృష్టించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ కొమ్ముకాసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలే అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వేదికలుగా మారాయి. ప్రజల ఓటుతో గెలవడం కష్టమని.. దండోపాయాన్నే ఏకైక ఎన్నికల వ్యూహంగా మార్చుకున్నారు. 

బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రతిపక్షాన్ని అణచివేసి, ప్రజాతీర్పును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అడుగడుగునా అక్రమాలు.. ప్రతి మలుపులోనూ అధికార బలప్రయోగం.. చివరకు అన్నీ ముగిశాక ‘కూటమి ఘనవిజయం’ అంటూ ప్రకటించుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సాగిన అధికార దాడి. ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి సాధించిన ఫలితాలను ప్రజాతీర్పుగా ఎలా చెప్పుకుంటారు? ప్రజల ఓటు స్వేచ్ఛను హరించి, వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసి సాధించిన గెలుపులో ప్రజాస్వామ్య విలువలకు చోటెక్కడ?   

కరకట్ట నివాసంలోనే దశకుట్రల స్కెచ్‌ 
రెండున్నరేళ్ల పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతను చూసి బెంబేలెత్తిన చంద్రబాబు.. మున్సిపల్‌ ఎన్నికలను అధికార దౌర్జన్యానికి వేదికగా మార్చుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేసే రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు సూత్రధారిగా.. ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పాత్రధారులుగా భారీ రాజకీయ పన్నాగానికి రూపకల్పన చేశారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు ఏ దశలో ఎలా అడ్డుకోవాలి.. ఎక్కడ బెదిరించాలి.. ఎక్కడ దాడులకు దిగాలి.. ఎక్కడ ఫలితాలను తారుమారు చేయాలి అన్నట్లుగా కరకట్ట నివాసంలోనే దశకుట్రల స్కెచ్‌ వేశారు. ఆ పథకాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం నుంచి టీడీపీ శ్రేణుల వరకు రంగంలోకి దిగాయి. ప్రజల ఓటుతో గెలవాల్సిన ఎన్నికలను అధికార బలంతో కైవసం చేసుకునేందుకు కూటమి బరితెగించింది. 

నామినేషన్ల దశలోనే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు!  
స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచీ దశకుట్రలను పకడ్బందీగా అమలు చేస్తూ వచ్చారు. ఎన్నికల అక్రమాలకు తొలి అడుగే నామినేషన్ల అడ్డగింత. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలో నిలవకుండా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. టీడీపీ శ్రేణులు మారణాయుధాలతో దాడులకు దిగుతూ బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను అపహరించారు. పుంగనూరు, రాయచోటి, ప్రొద్దుటూరు వంటి వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించారు. 

వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఏకంగా 20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయలేదు. పోలీసు వ్యవస్థ మొదలుకొని ఎన్నికల కమిషనర్, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్ల వరకు యావత్‌ అధికార యంత్రాంగం టీడీపీ అక్రమాలకు అండగా నిలిచింది. ప్రతిపక్ష అభ్యర్థులను బరి నుంచి తప్పించి, వీలైనన్ని స్థానాలను కూటమి ఖాతాలో ఏకగ్రీవాలుగా వేసుకునే ప్రయత్నం చేశారు.  

స్క్రూటినీ, ఉపసంహరణల్లో కుట్రల పర్వం!  
బెదిరింపులు, దాడులను ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో రెండో దశలో అక్రమాలకు తెరతీశారు. పలు మున్సిపాలిటీల్లో రిటరి్నంగ్‌ అధికారులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను సైతం అక్రమాలకు వేదికగా మార్చారు. అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి, వారే స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. బాధిత అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.  

పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌.. బూత్‌లపై దండయాత్ర!  
ఇన్ని అడ్డంకులను అధిగమించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీలో నిలవడంతో కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయన్న భయంతో పోలింగ్‌ రోజున బలప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు రక్షణ కల్పించలేదు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పోలింగ్‌ రోజున పలుచోట్ల అపహరణలు, దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. బూత్‌లలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపి, టీడీపీ వర్గీయులు పోలింగ్‌ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును హరించారు.  

పోలైన ఓట్ల గణాంకాల్లో రాత్రికి రాత్రే మార్పులెలా?  
పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా అక్రమాల పర్వం ఆగలేదు. ఆదివారం పోలింగ్‌ ముగిసిన అనంతరం వెల్లడించిన పోలైన ఓట్ల గణాంకాలకు, సోమవారం అధికారికంగా ప్రకటించిన గణాంకాలకు మధ్య తేడా ఉండటం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే పోలైన ఓట్ల సంఖ్య ఎలా పెరిగింది? బ్యాలెట్‌ బాక్సుల్లోకి అదనపు ఓట్లు ఎలా వచ్చాయి? ఈ మార్పులకు బాధ్యులెవరు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పోలింగ్‌ గణాంకాల్లో చోటుచేసుకున్న ఈ వ్యత్యాసంపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఎవరి ఆదేశాలతో గణాంకాలు మారాయి? అన్నది తేల్చాల్సిందే. 

రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాల తారుమారు! 
ఎన్నికల ప్రక్రియ చివరి అంకమైన ఓట్ల లెక్కింపులోనూ వివాదాలు చెలరేగాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న కార్పొరేషన్‌ డివిజన్లు, మున్సిపల్‌ వార్డుల్లో కౌంటింగ్‌కు ఆటంకాలు సృష్టించారు. రీకౌంటింగ్‌ పేరుతో పదేపదే లెక్కింపులు జరిపించి, తొలుత ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బదులుగా కూటమి అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించేవరకు ఒత్తిడి తెచ్చారు.  

అనంతపురం కార్పొరేషన్‌: రెండు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేశ్‌ గౌడ్‌ దాదాపు 3,200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దాంతో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్‌ యాదవ్, సవిత తదితరులు అక్కడికి చేరుకుని కౌంటింగ్‌ నిలిపివేయించారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది.  

నందికొట్కూరు మున్సిపాలిటీ: ఇక్కడ వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ పదవితోపాటు మెజార్టీ వార్డులను గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో కూటమి నేతలు, శ్రేణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హంగామా సృష్టించారు, ఫలితాన్ని తారుమారు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. 

విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ కార్పొరేషన్లు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న డివిజన్లలో ఓట్ల లెక్కింపునకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టించారు. ఐదారు సార్లు రీకౌంటింగ్‌ నిర్వహించాలని ఒత్తిడి తెచ్చి, చివరకు కూటమి అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించే వరకు అధికారులపై ఒత్తిడి కొనసాగించారు. 

ప్రజాతీర్పును గౌరవించాల్సిన ఎన్నికల వ్యవస్థ ఎటు దారి తీసింది?  
నామినేషన్ల అడ్డగింత నుంచి కౌంటింగ్‌ వివాదాల వరకు ప్రతి దశలోనూ వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలు, అభ్యర్థుల ఫిర్యాదులు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓటరు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును కాపాడాల్సిన వ్యవస్థలు వివాదాల కేంద్రంగా మారడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరం. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

పులివెందులపై పగ.. ప్రజాస్వామ్యంపై దాడి 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులపై చంద్రబాబు రాజకీయ కుట్రలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఒక్కసారి కూడా విజయం దక్కని పులివెందుల.. వైఎస్సార్‌ కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా నిలుస్తోంది. అలాంటి చోట ఎలాగైనా గెలిచామని చెప్పుకోవాలన్న దురాశతో చంద్రబాబు అధికార దౌర్జన్యానికి పచ్చజెండా ఊపారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఏకంగా 20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలింగ్‌ రోజున అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాలకు దూరం చేసి, బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనను అడ్డుకునేందుకు ఆయన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడం మరో వివాదానికి దారితీసింది. శనివారం ల్యాండింగ్‌కు అనుమతించిన అధికారులు.. ఆదివారం మాత్రం నిరాకరించడం వెనుక చంద్రబాబు రాజకీయ కుట్ర ఉంది. దీంతో పైలట్‌ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఇక పులివెందులలోని 80 పోలింగ్‌ కేంద్రాలకు గాను ఏకంగా 70 కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా తరిమివేయడంపై వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు.

బహిష్కరణకు గురైన 70 మంది ఏజెంట్లను స్వయంగా వెంటబెట్టుకుని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రిటర్నింగ్‌ అధికారి అందుకు అంగీకరించకపోవడంతో నిరసనగా తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు సాగిన అక్రమాల పర్వం కౌంటింగ్‌ ప్రక్రియలోనూ కొనసాగింది. టీడీపీ కూటమి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement