కుంభవృష్టి | Heavy to very heavy rains likely today due Cyclone Murasu | Sakshi
Sakshi News home page

కుంభవృష్టి

Nov 4 2026 5:29 AM | Updated on Nov 4 2026 5:29 AM

Heavy to very heavy rains likely today due Cyclone Murasu

గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు–పెదనందిపాడు రహదారిపై వరద నీటి ప్రవాహం

దక్షిణ కోస్తా అతలాకుతలం  

బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కుండపోత 

పల్నాడు జిల్లా మర్రిపాలెంలో 26.4 సెంటీమీటర్ల వర్షం 

విజయవాడలో ఎడతెరిపి లేని వాన.. రహదారులు జలమయం 

తీరం దాటి నత్తనడకన సాగిన తుపాను 

8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు 

బలహీనపడుతూ తెలంగాణ వైపు.. నేడూ భారీ వర్షాలు 

సాక్షి, అమరావతి/ బిట్రగుంట/ సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తాడికొండ: తీవ్ర తుపాను మురసు దక్షిణ కోస్తా జిల్లాలను ముంచెత్తింది. మంగళవారం తెల్లవారుజామున తీరం దాటిన తర్వాత రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. విజయవాడలో మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఎడతెగని వర్షం కురిసింది. తీవ్ర తుపానుగా తీరం దాటిన మురసు భూభాగంపైనా అదే తీవ్రతతో కొనసాగడంతో ప్రభావం ఎక్కువైంది. 

తీరం దాటిన తర్వాత కూడా తుపాను గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదిలింది. ఉదయం 11.30 వరకు తీవ్ర తుపానుగానే కొనసాగింది.సాయంత్రం 5.30 గంటలకు సాధారణ తుపానుగా బలహీనపడింది. ఆ సమయానికి విజయవాడకు, నందిగామకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో రోజంతా పల్నాడు, గుంటూరు, బా­ప­ట్ల ప్రాంతాలపైనే నిలిచి కుంభవృష్టి కురిపించింది. మంగళవారం అర్ధరాత్రికి ఇది వాయుగుండంగా, బుధ­వారం తెల్లవారుజామునకు అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.  

                         జలమయమైన విజయవాడ మొగల్‌రాజ్‌పురం ప్రాంతం 

పల్నాడులో కుండపోత 
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం మర్రిపాలెంలో 26.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో 24.7, చిరుమామిళ్లలో 23.9, చిలకలూరిపేట మండలం గోవిందపురంలో 21.7, నరసరావుపేట మండలం రావిపాడులో 14.6, కాకానిలో 14.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోణంకిలో 21.3, మార్టూరులో 20.8 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 16.4 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. 

విజయవాడ జలమయం 
విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత కురిసింది. రాత్రి వరకూ వర్షం తగ్గలేదు. నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాత్రి 9 గంటల వరకు విజయవాడ తూర్పు ఎలక్ట్రిసిటీ కాలనీ వద్ద 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నగరంలో పలుచోట్ల 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఓడరేవుల్లో హెచ్చరికలు 
నిజాంపట్నం, వాడరేవు ఓడరేవుల్లో పదో నంబర్‌ మహా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నంలో తొమ్మిదో నంబర్, కృష్ణపట్నంలో ఎనిమిదో నంబర్‌ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. 

నేడూ భారీ వర్షాలు 
బుధవారం ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు 
నేల పూర్తిగా తడిసిపోవడంతో పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు ఆకస్మిక వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ప్రకాశంపై పంజా  
మురసు తుపాను ప్రకాశం జిల్లాపై పంజా విసిరింది. మంగళవారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరం దాటిన తుపాను  పెనుగాలులతో బీభత్సం సృష్టించింది. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 150 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతింది. సెల్‌ఫోన్‌ నెట్‌వర్కులూ స్తంభించాయి. కొత్తపట్నంలో సోమవారం మధ్యాహ్నం నుంచే సముద్రం అల్లకల్లోలంగా మారింది. 

అలలు ఎగసిపడి దాదాపు 30 మీటర్లు మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కొత్తపట్నం మండలంలో బకింగ్‌హామ్‌ కాలువ దాటుతుండగా ఓ మహిళ గల్లంతైంది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద టోల్‌గేట్‌ సమీపంలో కంటైనర్‌ మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. కందుకూరు నియోజకవర్గం రామాయపట్నం పల్లెపాలెం తీరంలో సముద్రం 70 మీటర్లు ముందుకుచొచ్చుకొచ్చింది. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సొంత జిల్లాలోనే విద్యుత్‌ పునరుద్ధరణ పనులు సజావుగా సాగడం లేదు.   

ఉమ్మడి గుంటూరు విలవిల 
మురసు తుపాను ధాటికి ఉమ్మడి గుంటూరు చిగురుటాకులా వణికింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.  జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్‌ సౌకర్యం నిలిచిపోగా, చెరువులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, చీరాల, చిన్నగంజాం, భట్టిప్రోలు, రేపల్లె, కొల్లూరు, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, వేటపాలెంలో వర్షం ప్రభా­వం తీవ్రంగా ఉంది. బాపట్ల సూర్యలంక రోడ్డులో డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జలమయమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు తీవ్రంగా స్తంభించా­యి.  

                బాపట్ల జిల్లా కొల్లూరు వెంకటేశ్వర థియేటర్‌ సమీపంలో గృహంలోకి చేరిన వర్షపు నీరు 

నెల్లూరు తీరం అల్లకల్లోలం 
మురసు తుపాను ప్రభావంతో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద తీరం అల్లకల్లోలంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు సముద్రం మునుపెన్నడూ లేని స్థాయిలో ముందుకు విరుచుకుపడింది. భారీ వర్షం లేకపోయినా ఈదురుగాలులు, ఉవ్వెత్తున ఎగసిన అలలతో తాటిచెట్లపాలెంతోపాటు జువ్వలదిన్నె వద్ద తీరం భారీగా కోతకు గురైంది. 

అర్ధరాత్రి సమయంలో తీరం వైపు విరుచుకుపడిన అలలతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలల తాకిడికి జువ్వలదిన్నె, చెన్నాయపాళెం తదితర గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లో రొయ్యల గుంతలు ధ్వంసమయ్యాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. సుమారు 80 నుంచి 60 కౌంట్‌కు వచ్చిన రొయ్యలు ఉన్న గుంతలు ధ్వంసం కావడంతో రొయ్యలతోపాటు ఏరియేటర్లు, మోటార్లు కూడా కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పశ్చిమలో కుండపోత
మురసు తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా అంతటా కుండపోతగా వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయానికి జిల్లాలో 151 సెం.మీ, ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయానికి 84సెం.మీ వర్షం కురిసింది. అత్యధికంగా భీమవరం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, పాలకోడేరు, పెనుగొండ తదితర చోట్ల 14 సెం.మీ. పైబడి వర్షపాతం నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమవరంలో పలు లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి తూర్పుగోదా­వరి జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి.

వాటర్‌ ట్యాంకు మూత పడి వృద్ధురాలు మృతి 
కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో సిమెంట్‌ వరలతో ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంక్‌ మూత గాలికి మట్లపూడి తిరుపతమ్మ (66) నివాసముండే రేకుల షెడ్డుపై పడింది. దీంతో ఇంట్లో ఉన్న తిరుపతమ్మ తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  

చెట్టు కూలి మహిళ మృతి 
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రశాంతినగర్‌కు చెందిన చూపూరి అమృత (35), చంద్రమ్మ ఇద్దరూ స్కూటీపై రామిరెడ్డిపేట పాత సమితి కార్యాలయం రోడ్డు మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుకూలింది.  ఈ ప్రమాదంలో అమృత అక్కడికక్కడే మరణించింది, చంద్రమ్మ తీవ్రంగా గాయపడింది. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో నక్క వాగు వద్ద ఉన్న లిఫ్ట్‌ పంపు హౌస్‌ వద్ద  నలుగురు కుటుంబ సభ్యులు వాగు నీటిలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి.  

కొండరాయి పడి వ్యక్తి మృతి  
గుంటూరు జిల్లా ఫిరంగిపురం రాజాపేటకు చెందిన  కె.కృష్ణారెడ్డి(65) కొండరాయి మీద పడడంతో మరణించాడు. ఆయనతోపాటు పశువుల కొష్టంలోని గేదెలు మరణించా­యి.  నేరెళ్లవాగు చప్టా ఉప్పొంగడంతో రాకపోక­లు నిలిచిపోయాయి. నీటిలో కొందరు చిక్కు­కుపోవడంతో వారిని సీఐ భుజంగ­రావు, తన రెస్క్యూ సిబ్బందితో వచ్చి రక్షించారు.  

తుపాను ప్రభావంతో 9 విమానాలు రద్దు
విమానాశ్రయం(గన్నవరం): మురసు తుపాను ప్రభావం కారణంగా గన్నవరం(విజయవాడ) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే తొమ్మిది విమానాలను మంగళవారం రద్దు చేశారు. సింగపూర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కడప నుంచి గన్నవరానికి రాకపోకలు సాగించే 8 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఫ్లై 91కు చెందిన ఒక విమాన సర్వీస్‌ను కూడా రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. బుధవా­రం నుంచి అన్ని విమాన సర్వీసులు యథా­విధిగా నడుస్తాయన్నారు.

అమరావతిని ముంచెత్తిన వరద  
మురసు తుపాను  ప్రభావంతో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీల సాయంతో చెట్లను తొలగించారు. భారీగా వరద ముంచెత్తడంతో లాం వద్ద కొండవీటి వాగు పొంగి రోడ్డుపైకి నీరు చేరింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు, అనంతవరం రోడ్డులో వాగు పొంగి పొర్లాయి. దీంతో రాజధానికి మళ్లీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 

కొండవీటి వాగుకు వరద ఉప్పొంగడంతోపంట పొలాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి, మిర్చి, వరి, అపరాల పంటలు నీట మునిగి దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు మండలం లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రంలో వసతి కల్పించనున్నట్లు తహసీల్దార్‌ హరిబాబు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement