ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీం షాక్‌... | Supreme Court shocks AP NRI doctor | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీం షాక్‌...

Nov 4 2026 5:19 AM | Updated on Nov 4 2026 5:19 AM

Supreme Court shocks AP NRI doctor

తొలి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్న ఏపీకి చెందిన 

ఎన్నారై డాక్టర్‌పై బహుభార్యత్వం కేసు విచారణ కొనసాగింపునకు ఆదేశం

విదేశాల్లో తీసుకునే విడాకులు భారత్‌లో చెల్లవని స్పష్టీకరణ

విదేశీ పౌరసత్వం తీసుకున్నా భారతీయ చట్టాల నుంచి తప్పించుకోలేరు

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయచట్టాల ప్రకారం వివాహం చేసుకున్న వ్యక్తులు, విదేశీ కోర్టుల్లో అక్కడి నిబంధనల ప్రకారం విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకుంటే, భారతీయ చట్టాల ప్రకారం ఆ విడాకులు చెల్లవని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలో లేని ‘సరిదిద్దలేని విధంగా వివాహ బంధం దెబ్బతినడం’ (ఇర్రిట్రీవబుల్‌ బ్రేక్‌డౌన్‌ ఆఫ్‌ మ్యారేజ్‌) అనే కారణంతో లండన్‌ కోర్టు మంజూరు చేసిన విడాకుల డిక్రీని ప్రాతిపదికగా తీసుకుని ఐపీసీ సెక్షన్‌ 494 (బహు­భా­ర్యత్వం) నుంచి తప్పించుకోలేరని న్యాయ­మూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?
ఏపీలోని ఓ డాక్టర్‌కు పల్నాడు జిల్లాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అనంతరం ఆయన ఇంగ్లాండ్‌ వెళ్లారు. కుమారుడు జన్మించిన అనంతరం దంపతుల మధ్య మన­స్పర్థలు రావడంతో విడాకులు, పిల్లల కస్టడీ కోసం ఏపీలోని  స్థానిక కోర్టులో ఆయన పిటిషన్‌ వేశారు. అది వీగిపోవడంతో హైకోర్టును ఆశ్రయించి, అనంతరం ఆ అప్పీల్‌ను కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో వారి వివాహం చట్టబద్ధంగా కొనసాగు­తూనే ఉంది.

లండన్‌ కోర్టులో విడాకులు.. రెండో పెళ్లి... 
ఆ డాక్టర్‌ ఎనిదేళ్లపాటు అక్కడే ఉండడంతో యూకే పౌరసత్వం పొందారు. 2013 ఆగస్టు 16న ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌ కౌంటీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. 2014 జనవరి 29న వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదన్న కారణంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.  2014లో ఆయన మరో మహిళను యూకేలోని నార్ఫోక్‌లో రెండో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పల్నాడు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, డాక్టర్, అతని తల్లిదండ్రులు సహా రెండో భార్యపై ఐపీసీ 494, 120బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థానిక జడ్జి వీరందరిపై విచారణకు ఆదేశించారు.

అత్తమామలు, రెండో భార్యకు ఊరట... 
రెండో పెళ్లికి సంబంధించి కుట్ర చేశారనడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేనందున డాక్టర్‌ తల్లిదండ్రులపై ఉన్న కేసును ధర్మాసనం కొట్టివేసింది. మొదటి వివాహం కొనసాగుతున్న విషయం రెండో భార్యకు ముందే తెలుసనడానికి తగిన ఆధారాలు లేవని, చట్టం దృష్టిలో క్రిమినల్‌ బాధ్యతను ఒక్కొక్కరిపై వేర్వేరుగా నిర్ధారించాల్సి ఉంటుందని తెలుపుతూ ఆమెపై కేసును సైతం కొట్టివేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పులో వెల్లడించింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 
ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు ఏపీ హైకోర్టును ఆశ్ర­యించగా, 2019 జూలై 8న వారి పిటి­షన్లను తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విదేశీ కోర్టు ఇచ్చిన తీర్పులు సీపీసీ సెక్షన్‌ 13, 14 నిబంధన­లకు లోబడి ఉండాలని పేర్కొంది. 

హిందూ చట్టం ప్రకారం పెళ్లి జరిగినప్పు­డు, ఆ చట్టంలో లేని కారణాలను చూపి విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీలు భారత్‌లో చెల్లవని వై. నరసింహారావు కేసును ఉటంకిస్తూ స్పష్టం చేసింది. పౌరసత్వం మారి­నంత మాత్రాన తొలి వివాహ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోలేరని, బహుభా­ర్యత్వం అనేది నిరంతర నేరమని తేల్చిచె­ప్పింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశా­ల్లో విడాకులు తీసుకున్న డాక్టర్‌కు విదేశీ డిక్రీ రక్షణ కవచంగా మారబోదని, అత­నిపై పల్నాడులోని కోర్టులో విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేస్తూ అప్పీల్‌ను కొట్టివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement