అదే దౌర్జన్యం.. అదే దుర్మార్గం | Police and officials fully cooperated with the tdp across the state in votes counting | Sakshi
Sakshi News home page

అదే దౌర్జన్యం.. అదే దుర్మార్గం

Nov 4 2026 4:48 AM | Updated on Nov 4 2026 4:48 AM

Police and officials fully cooperated with the tdp across the state in votes counting

వైఎస్సార్‌సీపీ గెలిచిన పలు చోట్ల అధికారులపై ఒత్తిడి 

టీడీపీ గెలిచినట్టు ఎన్నికల ఫలితాలు తారుమారు

పూర్తి మెజార్టీ వచ్చిన చోట ఫలితాలు ప్రకటించకుండా నాన్చుడు వైఖరి

రీ కౌంటింగ్‌ పేరుతో యథేచ్ఛగా అక్రమాలు 

కుప్పంలో అధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెంటివేత 

విశాఖలో రీ కౌంటింగ్‌ కోసమని సంతకం తీసుకొని ప్రత్యర్ధి గెలిచినట్టు ప్రకటన 

పలమనేరులో ఓ వార్డులో ఆరుసార్లు కౌంటింగ్‌  

వైఎస్సార్‌సీపీ గెలుపు దిశగా పయనించిన చోట ఉద్దేశ పూర్వకంగా కాలయాపన 

గొడవలు, ఆందోళన అనంతరం ఏకపక్షంగా ఫలితాల ప్రకటన 

డోన్‌లో లెక్కించిన ఓట్లలోంచి మళ్లీ 900 లెక్కించి టీడీపీ గెలిచినట్లు డిక్లరేషన్‌ 

పచ్చ కుతంత్రంతో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మకు 375 ఓట్ల స్వల్ప మెజారిటీ 

న్యాయ పోరాటం చేయనున్న వైఎస్సార్‌సీపీ 

పులివెందుల, జమ్మలమడుగులో ఓట్ల లెక్కింపు బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ 

కుప్పం, నగరి, నాయుడుపేటలో పచ్చ గూండాల దౌర్జన్యాలు 

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో పేట్రేగిన టీడీపీ గూండాలు 

రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ మూకలకు పూర్తిగా సహకరించిన పోలీసులు, అధికారులు  

సిగ్గు సిగ్గు.. 
నంద్యాల జిల్లా డోన్‌ మున్సిపాలిటీలో టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి కోట్ల సుజాతమ్మను గెలిపించేందుకు పచ్చ పార్టీ ఏజెంట్లు, పోలింగ్‌ అధికారులు కలిసి లెక్కించిన ఓట్లనే మళ్లీ లెక్కించి గెలిపించిన దౌర్భాగ్యం విస్తుపోయేలా చేసింది. డోన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దూదేకుల దస్తగిరి మూడో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 543 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు రెండు మూడు వందల్లోపే ఉండటంతో ఓటమి ఖాయమని తెలిసిన సుజాతమ్మ బెంబేలెత్తిపోయి ఎలాగైనా గెలిచేందుకు అక్రమాలకు తెర తీశారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు, పచ్చ నేతలు దాడికి తెగబడ్డారు. 

ఇదే సమయంలో టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు టీ బ్రేక్‌ ప్రకటించారు. ఇంతలో కరెంట్‌ పోయింది. పచ్చ గూండాలు అప్పటికే కౌంటింగ్‌ పూర్తయిన ఆరు టేబుళ్లలోని 900 ఓట్ల బండిల్స్‌ను కౌంటింగ్‌ చేయాల్సిన ఓట్లలో కలిపారు. ఒకరిద్దరు అధికారులు దీనిని ప్రశ్నించే ప్రయత్నం చేసినా, పచ్చ గూండాలు వారిని బెదిరించారు. టీ బ్రేక్‌ అనంతరం మిగిలిన ఓట్ల లెక్కింపు మొదలెట్టి కోట్ల సుజాతమ్మ 375 ఓట్లతో నెగ్గినట్లు అధికారులు ప్రకటించి డిక్లరేషన్‌ ఫాం అందజేశారు. రీ కౌంటింగ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పట్టుపట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ అన్యాయంపై వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. న్యాయ పోరాటం  చేయనుంది.

ఇటు రెండు తగ్గించి.. అటు రెండు పెంచి.. 
అమలాపురం మున్సిపాలిటీ 35వ వార్డు ఓట్ల లెక్కింపులో అధికార కూటమి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లలో రెండింటిని చెల్లనివిగా ప్రకటించి, జనసేన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ఈ వార్డులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కముజు లక్ష్మి, జనసేన అభ్యర్థి కొప్పిశెట్టి క్రాంతి కుమారికి సమానంగా 376 చొప్పున ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ ఇద్దరికీ చెరో ఓటు వచ్చింది. వీటితో కలిపితే మళ్లీ ఇద్దరికీ 377 ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో రీ కౌంటింగ్‌ పెట్టారు. ఆ తర్వాత డిటైల్డ్‌ కౌంటింగ్‌ అంటూ అధికార కూటమి నేతల తీవ్ర ఒత్తిడికి అధికారులు తలొగ్గారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండు ఇన్‌వాలిడ్‌ (స్వస్తిక్‌ గుర్తు సగమే ఉందని) అని ప్రకటించారు. దీంతో జనసేన అభ్యర్థికి 2 ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఆమె గెలుపొందారని ప్రకటించారు.  

చిత్తూరులో 6 వేల ఓట్లు అదనం  
చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ కుట్ర, కుతంత్రాలు బట్టబయలయ్యాయి. ఈ నెల 1వ తేదీన జరిగిన పోలింగ్‌లో చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 92,910 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. మేయర్‌ అభ్యర్థి ఓట్లను లెక్కిస్తుండగా అధికారులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లో 21 వేలు, రెండో రౌండ్‌లో 31 వేలు, మూడో రౌండ్‌లో 31 వేల ఓట్ల చొప్పున ఓట్లు లెక్కించి అధికారులు ఫలితాలు ఇచ్చారు. చివరి నాలుగో రౌండ్‌లో మిగిలిన 8,910 ఓట్ల ఫలితాలు ప్రకటించాలి. 

అయితే వీటికి  అదనంగా దాదాపు 6 వేల ఓట్లు బ్యాలెట్‌ బాక్సుల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో గంటన్నరసేపు అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియను ఆపేశారు. అప్పటికే ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా దావానంలా వ్యాపించింది. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు.. లెక్క జమ లేకుండా రిగ్గింగ్‌ చేశారనడానికి అదనంగా ప్రత్యక్ష్యమైన 6 వేల ఓట్లే నిదర్శనమని తేలింది. గంటన్నర తర్వాత 8,912 ఓట్లకు ఫలితాలు వెల్లడించారు. అంటే ఇక్కడ కూడా గతంలో అధికారులు ప్రకటించిన సంఖ్య కంటే రెండు ఓట్లు అదనంగా చూపించడం కొసమెరుపు.    

గెలిచినా ఓడించారు..
నాయుడుపేట మున్సిపాలిటీ 2వ వార్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థి సగుటూరు మాధవి మొదట 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, అధికార టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి రీకౌంటింగ్‌ జరిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 9 బ్యాలెట్‌ పత్రాలపై స్వస్తిక్‌ గుర్తులు సరిగా పడలేదని చెబుతూ ఆమె ఓడినట్టు చెబుతూ.. టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. 

ఆరుసార్లు కౌంటింగ్‌ అనంతరం ఎట్టకేలకు.. 
మొత్తం 36 వార్డులు ఉన్న పలమనేరు మున్సిపాలిటీలో 34వ వార్డుకు జరిగిన పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ షల్మా 15 ఓట్లతో గెలిచారు. అయితే, టీడీపీ అభ్యర్థి రీ కౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు రీ కౌంటింగ్‌ చేపట్టారు. వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లలో మూడు చెల్లనివి, ఒకటి నోటాగా రీ కౌంటింగ్‌లో తేల్చారు. అప్పటికీ 11 ఓట్ల మెజార్టీ ఉండడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించమని కోరినా అధికారులు ఆ పని చేయలేదు. టీడీపీ నేతల ఒత్తిడితో ఏకంగా ఆరు సార్లు కౌంటింగ్‌ చేశారు. 

ప్రతిసారీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మెజార్టీలో కొనసాగారు. అదే సమయంలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ షల్మాను బయటకు గెంటేశారు. గతంలో నాలుగుసార్లు వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన షల్మా.. లోపల జరిగిన దౌర్జన్యాన్ని మీడియాకు వివరించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఎట్టకేలకు షల్మా 2 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించాల్సి వచ్చింది.

సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్‌: ప్రజా తీర్పును సైతం అపహస్యం చేస్తూ చివరకు ఓట్ల లెక్కింపులోనూ అధికార తెలుగుదేశం పార్టీ గూండాలు దుర్మార్గాలు, దౌర్జన్యాలతో పలుచోట్ల ఫలితాలను తారుమారు చేశారు. కర్నూలు, డోన్, అనంతపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ తుది వరకు ముందంజలో ఉన్నప్పటికీ.. రీ పోలింగ్‌ పేరుతో మాయ చేశారు. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను అధికార బలంతో బెదిరించి కౌంటింగ్‌ కేంద్రాల్లోంచి బయటకు పంపి, ఆ తర్వాత ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట్ల కూడా రీ కౌంటింగ్‌ పేరిట అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫలితాలు తారుమారు చేశారని స్పష్టమవుతోంది. నామినేషన్ల దగ్గరి నుండి కౌంటింగ్‌ హాల్‌ దాకా సాగిన అధికార టీడీపీ కూటమి అరాచక పర్వం, చివరకు వారి ‘నైతిక ఓటమి’ని స్పష్టం చేస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే టీడీపీ గూండాల దౌర్జన్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనం తిరగబడి పలుచోట్ల ప్రతిపక్షానికి పట్టం కడుతుంటే, తట్టుకోలేక కౌంటింగ్‌ కేంద్రాల్లో దౌర్జన్యానికి దిగి, గెలవబోతున్న అభ్యర్థుల గొంతు నొక్కారు.   

సీఎం సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం 
కుప్పం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో టీడీపీ అధికార బలాన్ని ఉపయోగించి తమ పార్టీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలిచినట్లు ఫలితాలు విడుదల చేసుకుంది. 32 వార్డులకు గాను నామినేషన్ల సందర్భంగా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడి 13 ఏకగ్రీవం చేసుకున్న విషయం విదితమే. మిగిలిన 19 వార్డులు, చైర్మన్‌ పదవికి మాత్రమే ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపులో భాగంగా 3వ వార్డు, 7వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు హనుమంతు, సీపీ మనోహర్‌లకు స్పష్టమైన ఆధిక్యత లభించింది. దీన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్‌ హాల్‌ నుంచి మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను అధికారులు, పోలీసుల సమక్షంలోనే గెంటివేశారు. 

తమను ఎందుకు బయటికి పంపుతున్నారని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా, ఏకపక్షంగా వ్యవహరించి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి.. అధికార పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగించారు. 3వ వార్డులో 650 ఓట్ల ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హనుమంతు తుదకు 50 ఓట్లతో ఓడిపోయినట్లు ఫలితాలు విడుదల చేశారు. 7వ వార్డు అభ్యర్థి సీపీ మనోహర్‌కు 750 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు అధికారులు చెప్పినా, తుది ఫలితాల్లో 86 ఓట్లతో ఓడినట్లు ఫలితాలు విడుదల చేశారు. 12వ వార్డు లెక్కింపులోనూ తారుమారు చేసి.. 112 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలిచిట్లు ప్రకటించుకున్నారు. 

తిరుపతి కౌంటింగ్‌ కేంద్రంలో రౌడీయిజం 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఏజెంట్‌పై భౌతిక దాడి 
తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల లెక్కింపు కేంద్రంలో అధికార టీడీపీ కూటమి నేతలు బరితెగించారు. కార్పొరేషన్‌ పరిధిలోని 33వ డివిజన్‌ లెక్కింపులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పునీత 53 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఈ ఓటమిని జీర్ణించుకోలేని శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు, టీడీపీ నేత జేబీ శ్రీనివాస్‌ తమ అనుచరులతో కలిసి కౌంటింగ్‌ హాల్‌లోకి దూసుకొచ్చారు. గెలిచిన అభ్యర్థి పునీతతో పాటు ఆమె కౌంటింగ్‌ ఏజెంట్‌ శివపై దురుసుగా ప్రవర్తించి, బలవంతంగా బయటకు గెంటివేశారు. విజయం సాధించిన అభ్యర్థిని హాల్‌ నుండి పంపించేసి.. అక్కడ ఏకపక్షంగా ‘రీ కౌంటింగ్‌’ జరపాలని టీడీపీ నేతలు పట్టుబడుతూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అల్లరి మూకల గెంటివేతతో బయటకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లోపల జరిగిన దౌర్జన్యం గురించి మీడియాకు వెల్లడించడంతో గత్యంతరం లేక అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు.  

రీ కౌంటింగ్‌ పేరిట నాలుగు గంటలు ఉత్కంఠ 
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాలుగో వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆరుమర్ల సతీష్‌ 11 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ అభ్యర్థి రామిశెట్టి కేతన్, ఇతర కూటమి నేతలు రీ కౌంటింగ్‌ కోరారు. అనంతరం మెజారిటీ 7 ఓట్లకు తగ్గినట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు మరోసారి రీకౌంటింగ్‌ కోరడంతో మళ్లీ లెక్కించారు. ఈ దఫా మరో రెండు ఓట్లు చెల్లనివిగా తేల్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సతీష్‌కు మూడు ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు తేలినప్పటికీ ఫలితాన్ని వెంటనే ప్రకటించలేదు. ఫలితాన్ని ప్రకటించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అభ్యర్థి స్పష్టం చేయడంతో అధికారులు దాదాపు నాలుగు గంటల తాత్సారం తర్వాత ఆయన విజయం సాధించినట్లు ప్రకటించారు.  

ఆఖరి వరకు ఉత్కం‘టై’.. 
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికలో 35వ వార్డు ఫలితం చివరి వరకు ఉత్కంఠ మధ్య కొనసాగింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులకు ఆఖరి వరకు ఓట్లు సమానంగా రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ వార్డులో మొత్తం 680 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్పు అరుణ, టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణికి చెరి సమానంగా 340 ఓట్లు పడ్డాయి. దీంతో అధికారులు టాస్‌ వేయగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్పు అరుణను అదృష్టం వరించి విజేతగా నిలిచింది.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో చైర్మన్‌ ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్ల సంఖ్య కన్నా 18 ఓట్లు ఎక్కువ లెక్కింపునకు ఎలా వచ్చాయని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు.

ఆధిక్యంలో ఉన్నారని ఆగిన కౌంటింగ్‌  
నంద్యాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు సమయంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై ఘర్షణకు దిగడంతో కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. అదే సమయంలో కౌంటింగ్‌ కేంద్రంలో కరెంటు తీసేశారు. రాత్రి 10.30 గంటలకు ఓట్ల లెక్కింపు ఆగిపోగా, రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్‌ చౌదరి ఆ సమయంలో అక్కడకు చేరుకున్నారు. అర్థరాత్రి దాటినా కౌంటింగ్‌పై వివాదం కొనసాగుతూనే ఉంది. 

భారీ ఆధిక్యంలో ‘అనంత’ మేయర్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 4,391 ఓట్ల మెజారిటీ
అనంతపురం : అనంతపురం మేయర్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన చిట్లూరు రమేష్‌గౌడ్‌ భారీ ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీఅభ్యర్థి కె.అజేష్‌ బాబుపై ఘన విజయం సాధించే దిశగా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి రమేష్‌ గౌడ్‌ 4,391 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారని అధికారికంగానే ప్రకటించారు. ఈయన మొదటి రౌండ్‌ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లెక్కించిన ఓట్లలో రమేష్‌గౌడ్‌కు 45,240 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె.అజేష్‌ బాబుకు 40,849 ఓట్లు పడ్డాయి. 

అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి షాలీ దాదా గాంధీకి 3,426 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి గుత్తి జీలాన్‌ బాషాకు 288 ఓట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి చిడిగె నాగరాజుకు 108 ఓట్లు పోలయ్యాయి. కాగా, వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం పెరుగుతున్నకొద్దీ టీడీపీ కూటమి శ్రేణులు అడ్డంకులు సృష్టిస్తుండటంతో అర్ధరాత్రి కొంత సేపు ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. అర్ధరాత్రి 1.30 గంటలకు తిరిగి లెక్కింపు ప్రారంభమైంది. ఇదిలా ఉండగా కడపటి వార్తలందేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంతో గెలుపు వాకిట నిలిచినట్లు సమాచారం. అయితే డిక్లరేషన్‌ ఫాం ఇవ్వకూడదని కూటమి శ్రేణులు అడ్డుకోనున్నట్లు తెలిసింది. 

కడప 33వ వార్డులో మూడు గంటలు కౌంటింగ్‌ నిలిపివేత  
కడప నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల లెక్కింపు కేంద్రంలో అధికార పక్షం ఒత్తిళ్లతో అధికారులు బరితెగించారు. 33వ వార్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుండటాన్ని జీర్ణించుకోలేక, ఏకంగా మూడు గంటలపాటు కౌంటింగ్‌ను నిలిపి వేసి హైడ్రామా సృష్టించారు. మొదటి రౌండ్‌ లెక్కింపు పూర్తి అయ్యే సరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మద్దిక సంధ్యారాణి 167 ఓట్ల స్పష్టమైన మెజారిటీలో ఉన్నట్లు తేలింది. దీంతో టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు లెక్కింపు ప్రక్రియను మూడు గంటల పాటు నిలిపివేశారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కొనసాగించాలని పట్టుబట్టడంతో తిరిగి లెక్కింపు చేపట్టారు. తుదకు అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 139 ఓట్ల మెజార్టీ దక్కింది. నాలుగు గంటల అనంతరం అధికారికంగా ప్రకటించారు. 1930 ఓట్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు లెక్కించారా.. అని వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  

              కడపలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ గూండాల దాడి   

ఆ 6 ఓట్లు ఏమయ్యాయి? 
విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో గాజువాక జోన్‌ పరిధిలోని 91వ వార్డు కౌంటింగ్‌లో గోల్‌మాల్‌ జరిగింది. 6 ఓట్లు తేడా వచ్చినా.. రీకౌంటింగ్‌ పేరుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నమ్మించి, బలవంతంగా సంతకాలు చేయించుకుని టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్‌ ఫారం ఇచ్చేశారు. గాజువాక జోన్‌లో 91వ వార్డులో మొత్తం 8443 (8,431 ఓట్లు, బ్యాలెట్‌ ఓట్లు 12) పోలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావుకు 1,975 ఓట్లు, టీడీపీ అభ్యర్థి బొడ్డు నర్సింహపాత్రుడు (కేబుల్‌ మూర్తి)కు 1,980 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డికి 1,880, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు రెయ్యి రత్నకు 1,319, బొట్ట నరసింహారెడ్డికి 19, పెంటకోట సన్యాసిరావుకు 2, సనపల దిల్లేశ్వరరావుకు 702, మల్లాది హేమలతకు 27, కశిరెడ్డి సత్యనారాయణకు 106 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లలో 375 రిజెక్ట్‌ కాగా, 52 ఓట్లు నోటాకు పడ్డాయి. 

ఇవన్నీ పోగా ఇంకా 7 ఓట్లు మాయం అయ్యాయి. మొత్తం లెక్కింపులో 7 ఓట్లకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావు ’ఆ 7 ఓట్లు ఏమయ్యాయి?’ అని నిలదీసి రీకౌంటింగ్‌ కోరారు. అయితే, టీడీపీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో ఆర్‌ఓ మరియు సిబ్బంది తెరవెనుక నాటకానికి తెరలేపారు. రీకౌంటింగ్‌కు అంగీకరిస్తున్నట్లు సంతకం పెట్టమని చెప్పి, దాన్ని కాస్తా ’టీడీపీ అభ్యర్థి గెలుపును అంగీకరిస్తున్నట్లు’ చిత్రీకరించి మోసపూరితంగా సంతకం చేయించుకున్నారు. ఆ వెంటనే హడావుడిగా టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్‌ ఫారం అందజేసేశారు. ఈ అక్రమాలపై బాధితులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు సాయంత్రం 4:49 గంటలకు రాష్ట్ర ఎన్నికల అధికారికి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ, అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అంతా మా ఇష్టం
» మంగళవారం నిర్వహించిన కార్పొరేషన్, మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు బరితెగించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలోని 3, 7 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను బయటకు గెంటివేశారు. అనంతరం ఎన్నికల అధికారులపై ఒత్తిడిచేసి టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆందోళనకు దిగితే.. వారిపై పోలీసులు ప్రతాపం చూపించారు.  

» నగరి 18, 38వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రెండింటిలోనూ టీడీపీ రీ కౌంటింగ్‌కి డిమాండ్‌ చేసినా ప్రయోజనం లేకపోవటంతో టీడీపీ దౌర్జన్యాలకు దిగారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ చైర్మెన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మతో పాటు.. 13 మంది వైఎస్సార్‌సీపీ వార్డు అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని పోలీసులు, టీడీపీ మూకలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు.  

» నాయుడుపేట మున్సిపాలిటీ 2వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాధవి 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల అధికారి కూడా ప్రకటించారు కూడా. అయితే టీడీపీ అభ్యర్థి పసల వాణి భర్త ఎన్నికల అధికారులను బెదిరించి రీ కౌంటింగ్‌కి డిమాండ్‌ చేశారు. ఆ రీకౌంటింగ్‌లో 9 ఓట్లు చెల్లనివిగా చూపించి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. టీడీపీ అక్రమాల గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. డీఎస్పీ, సీఐ తమ బృందంతో మాజీ ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ గూండాలు చుట్టుముట్టి ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. మాజీ ఎమ్మెల్యేని తోసుకుంటూ వెళ్లి బలవంతంగా పోలీసు జీపులోకి నెట్టేసి.. దొరవారిసత్రం స్టేషన్‌కు తరలించి నిర్భంధించారు. 

»  తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఐ తురక వెంకటరమణ వైఎస్సార్‌సీపీ నాయకులపైన, విలేకరుల మీద నానా దుర్భాషలాడి దురుసుగా వ్యవహరించారు. కౌంటింగ్‌ కార్యక్రమంలో భాగంగా విలేకరులకు ఒక గదిని కేటాయించారు. అయితే ఎవరో కిటికీ తలుపు తెరిచారని అమాంతంగా విలేకరులను బూతులు తిడుతూ రెచ్చిపోయి దూషించారు. ఆయన మాట్లాడిన భాషను తట్టుకోలేక ఓ రిపోర్టర్‌ ప్రశ్నించడంతో పైపైకి దూసుకు వచ్చి ఏకవచనంతో మాట్లాడడమే కాకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

» తిరుపతిలో 33వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎన్‌ పునీత 58 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపుని ప్రకటించటానికి వీల్లేదంటూ.. అభ్యర్థి, ఏజెంట్‌ని బయటకు పంపించివేశారు. ఈ విషయాన్ని బయటకు వచ్చిన ఏజెంట్‌ శివకుమార్‌ కౌంటింగ్‌ కేంద్రంలో జరిగిన టీడీపీ అక్రమాలను బయటపెట్టారు. ఏజెంట్‌ వీడియో వైరల్‌ కావటంతో టీడీపీ నేతలు యూటర్న్‌ తీసుకోవడంతో సాయంత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు.  

» నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఓట్ల లెక్కింపులో ఇంకా 1,300 ఓట్లు కౌంటింగ్‌ చేయాల్సి ఉన్న సమయంలో అప్పటికి జరిగిన ఓట్ల లెక్కింపులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మకు 1,473 ఓట్ల మెజారిటీ ఉంది. ఈ విషయాన్ని సీఐ తురక వెంకటరమణ బయట ఉన్న టీడీపీ నాయకులకు చేరవేశారు. దీంతో టీడీపీ నేతలు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించారు. కౌంటింగ్‌ çకేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని కౌంటింగ్‌ కేంద్రం వద్ద దౌర్జన్యం చేశారు.  

కౌంటింగ్‌లోనూ కూటమి కుతంత్రాలే  
వైఎస్సార్‌ కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థులు చైర్మన్లుగా, మేయర్‌గా విజయం వరించినా నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీ దేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కడప కార్పొరేషన్‌ పరిధిలో 361 పోలింగ్‌ బూత్‌లుంటే 350 పోలింగ్‌ కేంద్రాలల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా పోలీసులను ముందు పెట్టి తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. 18 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు సుప్రీంకోర్డును ఆశ్రయించి నామినేషన్లకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్లు స్వీకరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 11 డివిజన్లలో మాత్రమే ఎస్‌ఈసీ రీ నామినేషన్లకు అవకాశం కల్పించింది. మొత్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు.

 పోలింగ్‌ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లును అనుమతించలేదు. పోలింగ్‌ ఏకపక్షం అయినప్పటికీ 6 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు ముందంజలోకి వచ్చారు. వారిలో ప్రధానంగా 33వ డివిజన్‌ సంధ్యారాణి, 46వ డివిజన్‌ జమీల్‌ ముందంజలోకి రాగానే, కౌంటింగ్‌ ప్రక్రియ 3 గంటల సేపు నిలిపేశారు. తర్వాత కౌంటింగ్‌లోను కూటమి నేతలు కుయుక్తులు పన్నారు. దగ్గరుండి మరీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓట్లను ఇన్‌వ్యాలిడ్‌గా అని చెప్పి పక్కన పెట్టేశారు. పులివెందులలో పోలింగ్‌ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం, ప్రత్యక్ష హింసాత్మక చర్యలకు పాల్పడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు, గూండాలతో ఓట్లు వేయించిన పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ప్రక్రియను బహిష్కరించింది. 

జమ్మలమడుగులో సైతం కౌంటింగ్‌ ప్రక్రియను బహిష్కరించారు. కడప కౌంటింగ్‌ కేంద్రంలో 46వ డివిజన్‌ కౌంటింగ్‌ ఏజెంటు అప్రోజ్‌పై టీడీపీ అభ్యర్థి హానీఫ్‌తోపాటు మరో ముగ్గురు కౌంటింగ్‌ కేంద్రం ప్రాంగణంలో ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. 33వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంధ్యారాణి భర్త దేవిరెడ్డి ఆదిత్యను పోలీసులు వాహనంలో ఎక్కించుకెళ్లారు.  

హిందూపురంలో పచ్చనేతల ఆరాచకం 
మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రౌడీల్లా వ్యవహరించారు. హిందూపురం 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాబా 10 ఓట్లతో విజయం సాధించడంతో టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో అధికారులు మరోసారి లెక్కించగా 6 ఓట్లతో బాబా విజయం సాధించారు. అయినా మళ్లీ రీ కౌంటింగ్‌కు ‘పచ్చ’నేతలు డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు మరోసారి ఓట్లు లెక్కించగా బాబా ఒక్క ఓటుతో విజయం సాధించారు. 

ఇక హిందూపురం 41వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ 18 ఓట్లతో విజయం సాధించగా, అధికారులు డిక్లరేషన్‌ ఫారం కూడా అందించారు. అదే వార్డుకు చెందిన టీడీపీ నేత చంద్రమోహన్‌ యాదవ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని చించివేశారు. రీ కౌంటింగ్‌ నిర్వహించాలంటూ పట్టుట్టారు. డిక్లరేషన్‌ తర్వాత రీకౌంటింగ్‌ అనుమతించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచింది. చివరకు విలేకరులు అక్కడకు చేరుకోగా అధికారులు 41 వార్డుకు సంబంధించి డిక్లరేషన్‌ ఫారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement