అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సెల్‌ఫోన్ వెలుతురులోనే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్న దృశ్యం
అర్నబ్ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ
సరఫరా పునరుద్ధరణలో సర్కారు జాప్యం
రోజుల తరబడి కరెంటు లేక ప్రజల అగచాట్లు
తాగునీరు, సెల్‌ఫోన్ చార్జింగ్, చదువులకు ఆటంకం
ముందే హెచ్చరికలున్నా ప్రత్యామ్నాయంలో విఫలం
సమస్య తీవ్రమయ్యాక పొరుగు రాష్ట్రాల సాయం
తాజాగా మురసు తుపానుతో మరింత అస్తవ్యస్తం
1,367 గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: తుపాను వస్తుందని ముందే తెలుసు.. భారీవర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అయినా విద్యుత్ వ్యవస్థను కాపాడటంలో, దెబ్బతిన్న వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. అర్నబ్ తుఫాను తీరం దాటి వెళ్లినా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంటే ప్రభుత్వం మాత్రం సమీక్షలతో కాలక్షేపం చేస్తూ, పొరుగు రాష్ట్రాల సీఎంల సాయం కోసం చేతులు చాస్తూ కూర్చుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేటికీ అంధకారమే
అక్టోబర్ చివరిలో వచ్చిన అర్నబ్ తుపాను విద్యుత్ వ్యవస్థకు భారీనష్టం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని 5,753 గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని 915 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఇంకా 42 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఏపీఈపీడీసీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 915 ప్రభావిత గ్రామాల్లో 80 గ్రామాల్లో పనులు చేసూ్తనే ఉన్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవంగా చూస్తే ఇంకా వందలాది గ్రామాల్లో విద్యుత్ లేక చీకట్లు అలుముకుని ఉన్నాయి.
కరెంటు లేక కకావికలం
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాత్రిళ్లు చీకట్లోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. దోమల బెడదతో నిద్ర కరువవుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బోర్లు, మోటార్లు పనిచేయక తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో నీటి ట్యాంకులకు సరఫరా నిలిచిపోవడంతో బిందెలతో నీటికోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్ అంతరాయం అదనపు భారంగా మారింది.
విద్యుత్ లేక సెల్‌ఫోన్లు చార్జింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో అత్యవసర సమయంలో కుటుంబసభ్యులకు కూడా ఫోన్ చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా దెబ్బతినడంతో బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తమ వారు, ఇళ్లు, పంటలు, పశువుల పరిస్థితి తెలుసుకోవాలనుకునే వారు సైతం సమాచార లోపంతో ఆందోళన చెందుతున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. ఆన్‌లైన్ తరగతులు, డిజిటల్ సేవలు దూరమయ్యాయి. చిన్న దుకాణాలు, వెల్డింగ్ షాపులు, మిల్లులు, ఇతర చిరు పరిశ్రమలు విద్యుత్ లేక మూతపడుతున్నాయి. రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిరు వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు.
మాటలు తప్ప చేతలు శూన్యం
తుపాను ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 31 వేల విద్యుత్ స్తంభాలను శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమస్య తీవ్రమయ్యే వరకూ నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వం.. తీరిగ్గా పొరుగు రాష్ట్రాల సాయాన్ని అభ్యర్థించింది ప్రభుత్వం. చెన్నై, తెలంగాణ, కర్ణాటక నుంచి విద్యుత్ సిబ్బందిని పంపించేందుకు ఆ రాష్ట్రాలు ముందుకొచ్చాయని తెలిపింది. ఇన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపై స్పష్టత లేదు.
తుపాను ప్రభావిత గ్రామాలకు నిరంతర విద్యుత్ అందించడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ముందుగానే సిబ్బంది, పరికరాలను సిద్ధం చేసినప్పుడు ప్రజలు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? గ్రామాల వారీగా పునరుద్ధరణ గడువును ఎందుకు ప్రకటించడం లేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ముందస్తు ప్రణాళిక, నష్టం జరిగిన వెంటనే స్పందించడం, విద్యుత్ వంటి అత్యవసర సేవలను త్వరగా పునరుద్ధరించడం ప్రభుత్వ బాధ్యత.
తాగునీరు, వైద్యం, సమాచారవ్యవస్థ, విద్య, ఉపాధి.. ఇలా ప్రతి రంగానికి విద్యుత్ అత్యవసరం. అలాంటి కీలకసేవల పునరుద్ధరణలో జాప్యం జరిగితే మూల్యం చెల్లించాల్సింది సామాన్య ప్రజలే. అధికారుల సమీక్షలు, ప్రకటనలు ప్రజల కష్టాలను తీర్చలేవు. చీకట్లో ఉన్న గ్రామాలకు వెలుగులు తీసుకురావాలి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు స్పష్టమైన గడువు ప్రకటించాలి. తాగునీరు, ఆస్పత్రులు, అత్యవసర సేవలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు చేయాలి. కానీ అలాంటి చర్యలేవీ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మురసు తుపాను దెబ్బ
అర్నబ్ తుపాను మిగిల్చిన చీకట్లు తొలగకముందే మురసు తుపాను వచ్చి పడింది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మురసు తుపాను దెబ్బకు ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మంగళవారం నాటికి ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 2,750 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
211 సబ్‌స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లు 106,.. 11 కేవీ ఫీడర్లు 825 దెబ్బతిన్నాయి. చిలకలూరిపేట పరిధిలో 32 సబ్‌స్టేషన్లు ప్రభావితం కాగా 13 పునరుద్ధరించారు. మిగిలినవాటిలో పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 1,367 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ఇప్పటివరకు 597 గ్రామాలకు పునరుద్ధరించామని అధికారులు చెబుతున్నారు. ఇంకా 770 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. అంటే మరమ్మతులు చేపట్టాల్సిన పనులు భారీగానే మిగిలి ఉన్నాయి.


