న్యూఢిల్లీ: విమానయానానికి సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 స్థానంలో ఇవి 2027 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. భారతీయ వాయుయాన్ నియమ్ 2026 ప్రకారం ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే క్యాన్సిలేషన్ ఫీజులు సహా వివిధ రకాల చార్జీల గురించి విమానయాన సంస్థలు తెలియజేయాలి.
అసలు చార్జీ, పన్ను, ఫీజులు, క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ షరతులు, ఇతరత్రా చార్జీల వివరాలన్నీ బుకింగ్ వెబ్‌సైట్‌లో, బుక్ చేసుకున్న టికెట్‌పైన ఉండాలి. ఎయిర్‌లైన్స్ నిర్ణయించే టారిఫ్‌లను పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ఏదైనా అసాధారణ పరిస్థితి నెలకొందని భావించినప్పుడు ప్రజా ప్రయోజనార్ధం చార్జీలను నియంత్రించేందుకు పౌర విమానయాన శాఖ కలగజేసుకోవచ్చు. అయితే, ’అసాధారణ పరిస్థితులు’ ఏమిటనేది నిర్దిష్టంగా నిర్వచించలేదు.


