పన్ను చెల్లింపుదారులకు నిబంధనల పాటింపును సులభతరం చేయడంతో పాటు, జీఎస్టీ వివాదాలు, వ్యాజ్యాలను తగ్గించే దిశగా 57వ జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీఎస్టీ చట్టంలోని నేరాలు, నోటీసులు, రీఫండ్లు, రిజిస్ట్రేషన్, చిన్న పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులకు ఆమోదం లభించింది.
అరెస్టు అధికారం తొలగింపు
జీఎస్టీ కింద పన్ను చెల్లింపుదారులను అరెస్టు చేసే అధికారాన్ని తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అదే సమయంలో ప్రాసిక్యూషన్‌కు వర్తించే పన్ను ఎగవేత పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది. నేరాలకు సంబంధించి తప్పనిసరిగా విధించాల్సిన కనీస శిక్షను కూడా తొలగించింది. ఇక జరిమానా, జైలు శిక్ష లేదా రెండింటిలో ఏది విధించాలన్నది కేసు పరిస్థితులను బట్టి న్యాయవ్యవస్థ నిర్ణయించనుంది. నిర్దిష్ట జరిమానా లేని సందర్భాల్లో విధించే సాధారణ జరిమానాను రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించింది.
రూ.10 వేల లోపు పన్నుపై నోటీసు ఉండదు
రూ.10,000 కంటే తక్కువ మొత్తానికి సంబంధించిన పన్ను వివాదాల్లో షోకాజ్ నోటీసులు జారీ చేయకూడదని కౌన్సిల్ నిర్ణయించింది. నోటీసులు జారీ చేయడం, అందించడం, ముందస్తు నోటీసు సమాచారం, మోసం ఆరోపణలు, విచారణలు నిర్వహించడం, ఉత్తర్వులు జారీ చేయడం వంటి ప్రక్రియలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలను తీసుకురావడానికి కూడా ఆమోదం తెలిపింది.
అలాగే ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం, తప్పులు చేయడం లేదా పన్ను చెల్లింపుల్లో జాప్యం వంటి సందర్భాల్లో పన్ను రికవరీ, వర్తించే వడ్డీ, నిబంధనల ప్రకారం దామాషా జరిమానాతో వ్యవహరించాలని నిర్ణయించింది. వీటికి మించి అనవసరమైన చర్యలను తగ్గించే ఉద్దేశంతో ఈ మార్పులు ప్రతిపాదించింది.
ఇక వేగంగా జీఎస్టీ రీఫండ్లు
జీఎస్టీ రీఫండ్ క్లెయిమ్‌ను స్వీకరించినట్లు తెలియజేసే ఎక్‌నాలెడ్జ్‌మెంట్ లేదా లోపాల మెమో జారీ చేసే గడువును 15 రోజుల నుంచి 10 రోజులకు కౌన్సిల్ తగ్గించింది. ఈ 10 రోజుల్లో ఎక్‌నాలెడ్జ్‌మెంట్ లేదా లోపాల మెమో జారీ చేయకపోతే, ఆ క్లెయిమ్‌ను ఎక్‌నాలెడ్జ్ చేసినట్లుగా పరిగణిస్తారు.
రిస్క్ అసెస్‌మెంట్ ఆధారంగా 90 శాతం వరకు రీఫండ్ క్లెయిమ్‌ను వేగంగా మంజూరు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఎక్‌నాలెడ్జ్‌మెంట్ జారీ చేసిన మూడు పని దినాల్లోనే ఆర్డర్ ఇవ్వడానికి వీలు కల్పించనున్నారు. క్యాష్ లెడ్జర్‌లోని అదనపు బ్యాలెన్స్ రీఫండ్‌ను కూడా అధికారి ప్రమేయం లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో చేపట్టాలని నిర్ణయించారు.
మూడు రోజుల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్
తక్కువ రిస్క్ ఉన్న దరఖాస్తుదారులకు ఆటోమేటెడ్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. నమోదిత వ్యక్తులకు సరఫరాలపై నెలకు చెల్లించాల్సిన అవుట్‌పుట్ పన్ను రూ.2.5 లక్షలకు మించని దరఖాస్తుదారులకు మూడు పని దినాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ఈ విధానం కొనసాగుతుంది. ప్రస్తుతం మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో సుమారు 61 శాతం ఆటోమేటెడ్ మార్గంలోనే జరుగుతున్నాయని కౌన్సిల్ తెలిపింది. మిగిలిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు.
చిన్న పన్ను చెల్లింపుదారులకు కొత్త ఆప్షన్
వినియోగదారులకు మాత్రమే సరఫరాలు చేసే, వార్షిక టర్నోవర్ రూ.5 కోట్ల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు కొత్త ఐచ్ఛిక విధానాన్ని తీసుకురావడానికి కౌన్సిల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీని ప్రకారం సంవత్సరానికి ఒకసారి రిటర్నులు దాఖలు చేస్తూ, ప్రతి త్రైమాసికానికి పన్ను చెల్లించే అవకాశం కల్పించనున్నారు. ఈ విధానానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అవసరమైన చట్ట సవరణలను తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
రిజిస్ట్రేషన్ మూసివేత కూడా ఆటోమేటిక్
చిన్న పన్ను చెల్లింపుదారులతో ప్రారంభించి, జీఎస్టీ రిజిస్ట్రేషన్ మూసివేత ప్రక్రియను దశలవారీగా ఆటోమేట్ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. తుది రిటర్నును విడిగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ మూసివేత దరఖాస్తులోనే దాన్ని భాగం చేయనున్నారు.


