మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ చాపో అరెస్టు | Mexican drug lord on FBI's 10 most wanted list arrested in shoot-out | Sakshi
Sakshi News home page

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ చాపో అరెస్టు

Nov 22 2026 4:42 AM | Updated on Nov 22 2026 4:42 AM

Mexican drug lord on FBI's 10 most wanted list arrested in shoot-out

హింసాకాండకు పాల్పడిన అనుచరులు  

కార్లు, గ్యాస్‌ స్టేషన్లు దహనం  

మెక్సికో సిటీ: మెక్సికోలో అత్యంత కరడుగట్టిన డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠా నాయకుడు ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోర్స్‌ అలియాస్‌ ఎల్‌ చాపో ఇసిడ్రోను అధికారులు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మెక్సికన్‌ రాష్ట్రమైన సినలోవాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విడుదల చేసిన టాప్‌–10 మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఎల్‌ చాసో ఇసిడ్రో పేరు కూడా ఉంది. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న ఇసిడ్రో అరెస్టు కావడం సంచలనాత్మకంగా మారింది. 

అరెస్టు నేపథ్యంలో మెక్సికోలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అమెరికా నుంచి అందిన నిఘా సమాచారం అతడిని పట్టుకోవడానికి దోహదపడినట్లు మెక్సికన్‌ ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికా, మెక్సికో అధికారుల మధ్య సమన్వయంతోనే ఇసిడ్రోను అరెస్టు చేయడం సాధ్యమైనట్లు తెలుస్తోంది. ‘బె్రల్టాన్‌ లేవా’అనే నేర సంస్థకు చెందిన ఒక అగ్రశ్రేణి ముఠా నాయకుడు ఇసిడ్రో. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినందుకు, చట్టవిరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్నందుకు అమెరికాలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.

 చాలా ఏళ్లుగా అతడి కోసం అమెరికా అధికారులు అన్వేషిస్తున్నారు. ఇసిడ్రోను అరెస్టు చేసినందుకు అతడి అనుచరులు రెచ్చిపోయారు. సినలోవాలోని గ్వాసావే నగరంలో హింసాకాండకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బేస్‌బాల్‌ ఆట కొనసాగుతుండగా కాల్పులు జరిగాయి. కేకలు వేస్తూ జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. దహనమవుతున్న కార్లు, గ్యాస్‌ స్టేషన్లు, కింద ఇళ్లపై కాల్పులు జరుపుతూ చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ల దృశ్యాలు కనిపించాయ. తమ నాయకులను పట్టుకున్న లేదా అంతం చేసిన తర్వాత మాదకద్రవ్యాల ముఠాలు ఇలా తమ బలాన్ని ప్రదర్శించడం సర్వసాధారణం. 

ఇసిడ్రోను బంధించడానికి తాము రహస్యంగా, ఆకస్మికంగా దాడి చేశామని, అతడు ఉన్న భవనం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని మెక్సికన్‌ అధికారులు తెలిపారు. అనంతరం సాయుధ దళాలు ఒక ఇంట్లోకి ప్రవేశించి అతడిని అరెస్టు చేశాయని వెల్లడించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా రోజులుగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇసిడ్రో అరెస్టు జరిగింది. షీన్‌బామ్‌ డ్రగ్స్‌ ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మెక్సికోలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement