అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సైబర్ భద్రతా వ్యవస్థలపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నేర పరిశోధనలు, అరెస్టు వారెంట్లు, నిందితుల గుర్తింపు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరిచే ఎఫ్‌బీఐ కీలక విభాగం ‘నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ (ఎన్‌సీఐసీ)లోకి హ్యాకర్లు చొరబడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఉద్యోగ నియామకాల పోర్టల్‌పై జరిగిన దాడి తర్వాత, తాజాగా కీలక డేటాబేస్ లక్ష్యంగా మారడం అమెరికా ప్రభుత్వ డిజిటల్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పోలీసు వ్యవస్థకు కీలకంగా ఎన్‌సీఐసీ
1967లో ఏర్పాటైన ఎన్‌సీఐసీని ఎఫ్‌బీఐలోని క్రిమినల్ జస్టిస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (సీజేఐఎస్) విభాగం నిర్వహిస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాలు, సమాఖ్య, స్థానిక, చట్ట అమలు సంస్థలతో పాటు అనుమతి పొందిన కొన్ని విదేశీ ఏజెన్సీలు దీన్ని వినియోగిస్తాయి. పెండింగ్ అరెస్టు వారెంట్లు, పరారీలో ఉన్న నేరస్థులు, అదృశ్యమైన వ్యక్తులు, దొంగిలించిన వాహనాలు, ఆయుధాల రికార్డులతో పాటు ఉగ్రవాద ముప్పుల గుర్తింపునకు ఇది కీలక ఆధారం. ఈ డేటాబేస్‌లోకి అనధికారికంగా ప్రవేశిస్తే నేర పరిశోధనల గోప్యత, క్షేత్రస్థాయి పోలీసు కార్యకలాపాల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
సెప్టెంబరు ఘటన.. తాజా దర్యాప్తు
గత సెప్టెంబరు 23న ఎఫ్‌బీఐకి చెందిన fbijobs.gov పోర్టల్‌పై సైబర్ దాడి జరిగినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. అందులో దరఖాస్తుదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడినట్లు అప్పట్లో ప్రకటించింది. అయితే, సెప్టెంబరు ఘటనకు, తాజా ఎన్‌సీఐసీ దాడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ లేదు. సీఎన్‌ఎన్, రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం ఎఫ్‌బీఐ ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు ముమ్మరం చేసింది. అయితే, ఈ ఘటనపై ఎఫ్‌బీఐ నుంచి ఇంకా అధికారిక బహిరంగ ప్రకటన వెలువడలేదు. హ్యాకర్లు వ్యవస్థలోకి ఏ మేరకు చొరబడ్డారు? డేటాను తస్కరించారా? పోలీసు సేవలకు అంతరాయం కలిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో యాప్.. వెబ్‌సైట్.. ఏది బెటర్?


