ఓపెన్‌ఏఐలో గూఢచర్యం కలకలం.. సౌదీ ఇంజినీర్‌ అరెస్ట్‌! | openai employee abdul rahman alfozan arrested recording device | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ఏఐలో గూఢచర్యం కలకలం.. సౌదీ ఇంజినీర్‌ అరెస్ట్‌!

Oct 14 2026 7:06 AM | Updated on Oct 14 2026 7:19 AM

openai employee abdul rahman alfozan arrested recording device

చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐలో రహస్య రికార్డింగ్‌ పరికరం కలకలం రేపింది. కంపెనీ కీలక సమావేశాలు జరిగే గదిలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ పరికరాన్ని అమర్చాడు ఓ ఉద్యోగి.  ఈ వ్యవహారంలో మరో రికార్డింగ్‌ పరికరం కూడా బయటపడటం సంచలనం సృష్టించింది. ఓపెన్‌ఏఐ ఫిర్యాదుతో  నిందితుడ్ని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అరెస్ట్‌ చేసింది.  

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఓపెన్‌ఏఐ కార్యాలయంలో సెప్టెంబర్‌ 30న భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈ రహస్య పరికరం బయటపడింది. టాయిలెట్‌ పేపర్‌లో చుట్టిన ఓ యూఎస్‌బీ పరికరాన్ని కార్యనిర్వాహక ఉన్నతాధికారుల సమావేశాల గదిలోని టీవీ వెనుక యూఎస్‌బీ పోర్టుకు దాన్ని కనెక్ట్‌ చేసినట్లు గుర్తించారు. 

సదరు ఉద్యోగిని సౌదీ అరేబియాకు చెందిన ఇంజినీర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అల్ఫోజాన్‌గా నిర్ధారించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆడియోను రికార్డు చేయడంతోపాటు, సమాచారాన్ని బదిలీ చేసేందుకు వీలుగా పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. అయితే కీలక సమాచారం బయటకు పొక్కలేదని.. ఈ పరికరంలోని సమాచారం ఎన్‌క్రిప్షన్‌ ద్వారా రక్షించబడిందని అధికారులు అంటున్నారు. ఈ విషయం గుర్తించిన ఓపెన్‌ఏఐ వెంటనే ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.

కెమెరా ఫుటేజీతో అనుమానాలు!
35 ఏళ్ల అబ్దుల్‌ రెహమాన్‌ అల్ఫోజాన్‌ పేరు తెరపైకి వచ్చింది. అతడు 2025 జూలై నుంచి ఓపెన్‌ఏఐలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు, డివైస్‌ దొరికిన గది సమీపంలో అతడు పదే పదే కనిపించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆ గదిలో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అతడికి అనుమతి కూడా లేదని తెలుస్తోంది. 

అంతేకాదు.. సంస్థలోని చాంబర్‌ల వివరాలు, మీటింగ్‌ రూమ్‌ల సమాచారం, ఉన్నతాధికారుల కదలికలు, బయటి సంస్థలతో జరిగే సమావేశాల వివరాల కోసం అతడు అంతర్గత ప్రొడక్టివిటీ టూల్‌ను ఉపయోగించినట్లు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. అక్టోబర్‌ 5న అతడు అదే సమావేశాల గదిలోకి వెళ్లి, పరికరాన్ని అమర్చిన టీవీ వెనుక పరిశీలించినట్లు ఫుటేజీలో కనిపించిందని తెలుస్తోంది.

బ్యాగులో మరో రికార్డింగ్‌ పరికరం!
ఈ కేసులో మరో కీలక పరిణామం కూడా వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలోని మరో గదిలో అల్ఫోజాన్‌ వదిలి వెళ్లిన బ్యాగును భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా, అందులో అతడి గుర్తింపు పత్రాలతోపాటు మొదటి పరికరాన్ని పోలిన మరో రికార్డింగ్‌ పరికరం కనిపించినట్లు అధికారులు తెలిపారు. అంటే.. మొదటి పరికరం బయటపడటంతోనే వ్యవహారం ముగిసిపోలేదు. మరిన్ని పరికరాలను ఉపయోగించాలనే ఉద్దేశం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే, ఈ పరికరాల ద్వారా ఎలాంటి సంభాషణలు రికార్డయ్యాయి? అవి ఎవరికైనా చేరాయా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

చాట్‌బాట్‌ ప్రశ్నలూ దర్యాప్తులో కీలకం!
ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అల్ఫోజాన్‌ భార్యకు సంబంధం ఉన్న చాట్‌బాట్‌ ఖాతా నుంచి రహస్యంగా ఆడియో రికార్డు చేసే పరికరాన్ని తయారు చేయడం, వైఫై కనెక్టివిటీ, రిమోట్‌ యాక్సెస్‌, మెమరీ కార్డులోని సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు ఫెడరల్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 24 నుంచి 30 మధ్య నమోదైన ఈ ప్రశ్నలు, పరికరం ప్రత్యేక వివరాలకు సంబంధించిన సమాచారం.. దర్యాప్తులో భాగంగా పరిశీలనకు వచ్చాయి. 

సొంత ఏఐ మోడళ్లతో నిందితుడిని గుర్తించిన ఓపెన్‌ఏఐ!
ఈ కేసులో ఆసక్తికరమైన అంశం మరోటి ఉంది. తన కార్యాలయంలో రహస్య పరికరం బయటపడిన తర్వాత ఓపెన్‌ఏఐ సంస్థ తన సొంత ఏఐ మోడళ్లను ఉపయోగించి పరికరం స్వరూపం, దాని మూలాలను విశ్లేషించిందట. ఆ విశ్లేషణ, ఇతర ఆధారాల సాయంతో పరికరాన్ని అమర్చిన వ్యవహారాన్ని ఎఫ్‌బీఐకి నివేదించినట్లు తెలిపింది. మరోవైపు, తమ మోడల్‌ వెయిట్స్‌, సోర్స్‌ కోడ్‌, వినియోగదారుల డేటాను అల్ఫోజాన్‌ అనధికారికంగా యాక్సెస్‌ చేసినట్లు లేదంటే బయటకు తీసుకెళ్లినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.

శిక్ష ఎంతంటే.. 
రహస్యంగా సంభాషణలను రికార్డు చేసే పరికరాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు అల్ఫోజాన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో నేరం రుజువైతే గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. అక్టోబర్‌ 9న అరెస్టయిన అల్ఫోజాన్‌ అక్టోబర్‌ 13న తొలిసారి ఫెడరల్‌ కోర్టు ఎదుట హాజరయ్యాడు. తదుపరి విచారణ అక్టోబర్‌ 19న జరగనుంది.

ట్విటర్‌లోనూ ఇలాంటి కేసు
అమెరికా టెక్‌ సంస్థల్లో కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు కొత్తవి కావు. 2022లో ట్విటర్‌లో పనిచేసిన అహ్మద్‌ అబౌఅమ్మో అనే మాజీ ఉద్యోగి, సౌదీ అధికారులకు సహకరించి ఆన్‌లైన్‌ విమర్శకులను గుర్తించేందుకు సమాచారాన్ని అందించిన కేసులో దోషిగా తేలాడు. ఇప్పుడు ఓపెన్‌ఏఐలో రహస్య రికార్డింగ్‌ పరికరం వ్యవహారం వెలుగులోకి రావడంతో, ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉన్న కృత్రిమ మేధ రంగంలో సాంకేతిక రహస్యాలు, వ్యాపార వ్యూహాల భద్రతపై చర్చ మొదలైంది.

ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటనలో కీలక పరిణామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement