ఇన్నోవేషన్
విత్ అవుట్ విద్యుత్తు ఏసీ ఉండదు. వీసమెత్తు విద్యుత్ అవసరం లేకుండా ఏసీ వీలవుతుందా? ‘యస్’ అంటున్నారు శాస్త్రవేత్తలు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది రసాయనిక చర్యను ఉపయోగించి నీటిని వేగంగా చల్లబరుస్తుంది. ఆ తర్వాత సూర్మరశ్మిని మాత్రమే ఉపయోగించి తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుంది. దీనికి నెస్‌కోడ్ (నో ఎలక్రిటిసిటీ అండ్ సస్టైనబుల్ కూలింగ్ ఆన్ డిమాండ్) అని పేరు పెట్టారు.
ఈ ప్రయోగాలలో సాధారణ ఉప్పు కీలకపాత్ర పోషించడం విశేషం. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు, పాలీస్టైరిన్ ఫోమ్ ఇన్స్‌లేషన్ బాక్స్‌లోని లోహపు కప్పులో ఉప్పు ద్రావణాన్ని ఉంచారు. ఉప్పు క్రమంగా కరుగుతుండగా కప్పులోని ఉష్ణోగ్రత వేగంగా పడిపోయింది.
విద్యుత్ సరఫరా అస్తవ్యస్త్యంగా ఉన్న, విద్యుత్ అందుబాటులో లేని ప్రదేశాలలో ఆహారం, సున్నితమైన పదార్థాలను నిల్వ చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తల చెబుతున్నారు.
‘గ్రిడ్ ఎలక్ట్రిసిటీకి బదులుగా ప్రత్యక్ష సూర్యరశ్మిని ఉపయోగించడం వల్ల అభివృద్ధి చెందని, మారుమూల ప్రాంతాలలో, మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాలలో ఈ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది’ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలలో ఒకరైన వెన్సింగ్ వాంగ్.
శాస్త్రవేత్తల పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉంది. క్షేత్రస్థాయిలో ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ చిన్నటి ఆశారేఖ కనిపిస్తుంది.
విద్యుత్ అవసరం లేకుండా ఏసీ సాధ్యమేనని!


