రియాద్: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల దాడితో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు అప్రమత్తమై పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరిక జారీ చేశారు. సోమవారం రియాద్ వీధుల్లో వాహనాల రాకపోకలు సాధారణంగానే కనిపించినప్పటికీ భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాయి.
అరాంకో టవర్‌కు నష్టం
హౌతీల దాడిని అడ్డుకునేందుకు సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డుకున్న క్షిపణులు, డ్రోన్ల శకలాలు రియాద్ ఆర్థిక జిల్లాలోని అరాంకో టవర్‌పై పడ్డాయి. దీంతో భవనంలోని పలు అంతస్తుల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఆస్తినష్టం పరిమితంగానే ఉందని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. రియాద్‌పైకి వచ్చిన హౌతీల క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని సైనిక కూటమి ప్రకటించింది.
దాడికి హౌతీల బాధ్యత
ఆదివారం జరిగిన దాడికి తామే బాధ్యులమని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్ల దాడులను ఈ సంస్థ తీవ్రతరం చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు, చమురు సంబంధిత కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతున్న హౌతీల మధ్య జులైలో మరోసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ఇది మరో సమస్యగా మారింది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం విస్తృత యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సౌదీపై హౌతీల దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఇదీ చదవండి: హారిసన్‌కు బుకర్ ప్రైజ్.. సైన్స్ ఫిక్షన్‌కు అరుదైన గౌరవం!


