మధ్యంతర ఎన్నికలు ముగియగానే అమెరికా.. ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడనుందనే వార్తల నేపథ్యంలో.. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే ముందు దౌత్యపరమైన చర్చలకు మరో అవకాశం ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సౌదీ అరేబియా కోరింది. ఇరాన్‌పై సైనిక దాడి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు సంయమనం పాటించాలని, దౌత్యానికి మరికొంత సమయం ఇవ్వాలని ట్రంప్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ట్రంప్ యంత్రాంగంలోని ఉన్నతాధికారులను సౌదీ అరేబియా సీనియర్ అధికారులు మరింత సమయం కోరినట్లు సమాచారం. అమెరికా.. ఇరాన్‌పై దాడికి ఆదేశిస్తే.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), ఆ దేశ సైన్యం ప్రతీకార దాడులకు దిగవచ్చని రియాద్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని నీటి సరఫరా, విద్యుత్ మౌలిక సదుపాయాలతో పాటు చమురు, ఇంధన రంగానికి సంబంధించిన కీలక కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని భావిస్తోంది.
కొద్ది రోజుల క్రితం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగమైన టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్‌లతో సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి బృందంలో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కూడా ఉన్నారు.
ఈ సమావేశాల్లో ఇరాన్‌కు సౌదీ అరేబియా ఓ కీలక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఘర్షణలు ప్రారంభమైతే.. సౌదీలోని కీలక చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేయొద్దని కోరినట్లు తెలిపాయి. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి హామీ ఇచ్చేందుకు ఇరాన్ నిరాకరించింది.
మార్చిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ సమయంలో ఇరాన్ సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, ఒక దశలో రియాద్ నుంచి వచ్చిన హెచ్చరికలతో ఇరాన్ దాడులను తగ్గించి.. చివరకు నిలిపివేసింది. దాడులు కొనసాగిస్తే అది తమ గీతను దాటడమేనని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్‌పై తాము కూడా దాడులు చేయాల్సి వస్తుందని సౌదీ అరేబియా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హంగ్.. నెతన్యాహూకు కలిసొచ్చేవి ఇవేనా?


