నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కలకలం రేపుతున్నాయి. డ్రోన్ దాడి కారణంగా లైబీరియా జెండా కలిగిన సరుకు ఓడ బల్గేరియా తీరానికి సమీపంలో మునిగిపోయింది. తీరానికి 21 నాటికల్ మైళ్ల దూరంలో కాంట్‌షిప్ జెట్ అనే ఈ నౌకను మూడు సముద్ర డ్రోన్లు ఢీకొట్టాయని స్థానిక అధికారులు వివరించారు. గ్రీసు సంస్థకు చెందిన ఈ సరుకు నౌక ఇజ్రాయెల్‌లోని హైఫా నౌకాశ్రయం నుంచి రొమేనియాలోని కొన్‌స్టానాకు వస్తోంది.
ఇందులో 18 మంది సిబ్బందికిగాను, 14 మంది ఫిలిప్పీన్స్‌కు, నలుగురు ఉక్రెయిన్‌కు చెందినవారని సమాచారం. వీరందరినీ బల్గేరియా నేవీ కాపాడి, తీర నగరం వర్నాకు తరలించింది. ఈ ఓడలో లిథియం–అయాన్ బ్యాటరీలు, మండే స్వభావం కలిగిన రసాయనాలు, ఇతర ప్రమాదకర పదార్థాలున్న 421 కంటెయినర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ దాడి గురించి తమకు ముందస్తు సమాచారం అందినట్లు బల్గేరియా ప్రభుత్వం తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఈ ఘటనకు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. దాడిని అడ్డుకోలేకపోయామని పేర్కొంది. బల్గేరియాకు చెందిన ఓ వార్తా వెబ్‌సైట్ ప్రచురించిన వీడియోలో సముద్ర డ్రోన్ కంటైనర్ నౌకను ఢీకొనే ముందు దాని వైపు దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దాడి కారణంగా నౌకకు తీవ్ర నష్టం వాటిల్లడంతో అది సముద్రంలో మునిగిపోయింది.
ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇజ్రాయెల్‌తో నౌకకు ఉన్న సంబంధం కారణంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక అంచనాలు సూచించడం లేదని సమాచారం. అయితే దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నల్ల సముద్రం పశ్చిమ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఈ ఘటన ఆందోళన పెంచుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గగనతల, సముద్ర డ్రోన్లతో దాడులు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే బల్గేరియా తీరానికి సమీపంలో కనీసం ఆరు నౌకలపై వైమానిక లేదా సముద్ర డ్రోన్లతో దాడులు జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనల్లో సుమారు 25 మంది మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రభావం ప్రత్యక్ష పోరాట ప్రాంతాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకూ విస్తరిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా కళ్లుగప్పి ఇరాన్ భారీ స్కెచ్!


