ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడి 14 మంది మృతి | Russian drone attack on Ukrainian train station kills at least 14 | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడి 14 మంది మృతి

Oct 30 2026 4:17 AM | Updated on Oct 30 2026 4:17 AM

Russian drone attack on Ukrainian train station kills at least 14

ఖెర్సన్‌: ఉక్రెయిన్‌లోని నీప్రో రైల్వే స్టేషన్‌పై గురువారం ఉదయం రష్యా జరిపిన డ్రోన్‌ దాడిలో కనీసం 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 11 ఏళ్ల బాలుడు సహా మరో 14 మంది గాయపడ్డారని నీప్రోపెట్రోవిస్క్‌ ప్రాంత చీఫ్‌ ఒలెగ్జాండర్‌ హంజా చెప్పారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. జపొరిజియా వైపు వెళ్లే ఈ రైలు నీప్రో రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాం వద్ద నిలిచి ఉండగా జెట్‌ పవర్డ్‌ డ్రోన్‌ దాడి జరిగిందన్నారు. 

రష్యా దాడులకు పాల్పడే ప్రమాదముందంటూ ముందుగా హెచ్చరికలు చేసినప్పటికీ, ఘటన సమయంలో ప్లాట్‌ఫాంపై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వివరించారు. డ్రోన్‌ దాడి తీవ్రతకు రైలు బోగీ అద్దాలు పగిలిపోగా, భారీ గుంత ఏర్పడి, ఫ్లాట్‌ఫాం ధ్వంసమైంది. ప్రయాణికుల మృతదేహాలు ఛిద్రమై చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మందికి బాంబు శకలాలు తగలి గాయాలయ్యాయని, నలుగురికి అత్యవసర శస్త్రచికిత్స చేస్తున్నామని స్థానిక ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

రష్యా డ్రోన్‌ దాడి సమయంలో ఆ స్టేషన్‌లో రెండు ప్రయాణికుల రైళ్లు నిలిచి ఉండగా, సామాన్య ప్రయాణికులు ప్లాట్‌ఫాంలపై నిల్చుని ఉన్నారన్నారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర దాడులకు తెగబడుతున్న రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించాలని జీ7 దేశాలను జెలెన్‌స్కీ కోరారు. కాగా, తాము ఉక్రెయిన్‌ సైనికులు, మిలటరీ సామగ్రి రవాణా వనరులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని చెరి్నహివ్‌ ప్రాంతంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు 15 ఏళ్ల బాలికలు చనిపోగా, పలువురు చిన్నారులు సహా 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 

రైళ్లపై భారీగా పెరిగిన రష్యా దాడులు 
రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌లో రైలు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని దేశ రైల్వే శాఖ ఉక్ర్‌జలిజ్‌నిట్సియా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలయ్యాక రష్యా ఇప్పటి దాకా 521 రైళ్లపై దాడులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కనీసం 60 శాతం వరకు ఈ ఏడాదిలో జరిగినవే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement