ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం జరిగిందన్న అనుమానాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోమ్ సోల్‌బర్గ్ దేశ భద్రతా సంస్థ షిన్ బెట్‌ను ఆదేశించారు. ఖతార్ నుంచి భారీగా నిధులు వచ్చి, అరబ్ ఓటర్ల ఓటింగ్‌పై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగి ఉండవచ్చని హిబ్రూ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
సోల్‌బర్గ్ బుధవారం షిన్ బెట్ చీఫ్ డేవిడ్ జినీకి రాసిన లేఖలో.. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే విదేశీ శక్తులు నిధుల ద్వారా ఎన్నికలను అనుచితంగా ప్రభావితం చేస్తున్నాయన్న తీవ్రమైన అనుమానాలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అనుమానాల వాస్తవికతను తాను ధ్రువీకరించలేనప్పటికీ, విదేశీ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని తెలిపారు. వారంలోగా దర్యాప్తు వివరాలను సమర్పించాలని కోరారు.
ఈ వ్యవహారంపై గత 2 వారాల్లోనే విశ్వసనీయ నిఘా సమాచారంతో దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ భద్రతా అధికారి కన్ వార్తా సంస్థకు తెలిపారు. సమస్యాత్మక అంశాలు ఉన్నట్లు గుర్తించామని, పూర్తి సమాచారాన్ని వెలికితీసేందుకు విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఖతార్ అరబ్ సంస్థలకు భారీగా నిధులు అందించి, ఓటర్లను పోలింగ్‌కు రప్పించడం లేదా వారి ఓటింగ్‌పై ప్రభావం చూపేందుకు ప్రయత్నించి ఉండవచ్చని కొన్ని హిబ్రూ మీడియా సంస్థలు భద్రతా వర్గాలను ఉటంకిస్తూ తెలిపాయి. ఈ నిధుల బదిలీకి ఉపయోగించిన మార్గాలు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు చేరవేసేందుకు ఉపయోగించిన పద్ధతులను పోలి ఉన్నాయని ఛానల్ 12 పేర్కొంది.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా?
ఇజ్రాయెల్ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటింగ్ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిటీ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ డీన్ లివ్నే ఖండించారు. ఎన్నికలు చట్టబద్ధంగా జరిగాయని, తమకు తెలిసినంతవరకు వ్యవస్థాగత అక్రమాలకు ఆధారాలు లేవని తెలిపారు. సోల్‌బర్గ్ కోరిన దర్యాప్తు రహస్య నిఘా సమాచారానికి సంబంధించినదని, దాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందని వివరించారు.
మరోవైపు, అరబ్ పార్టీల వల్ల ఎన్నికల చోరీ జరిగిదంటూ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఆరోపించింది. ఖతార్ పేరు ప్రస్తావించకుండా, విదేశీ శక్తులు ఇజ్రాయెల్ పార్లమెంటును తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాయని పేర్కొంది. అరబ్ పార్టీలతో ఏ జియోనిస్ట్ పార్టీ కూడా పొత్తు పెట్టుకోకూడదని వాదించింది.
అరబ్ ఓటర్లలో అధిక పోలింగ్ నమోదవడంతో రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలు కలిపి రికార్డు స్థాయిలో 19 స్థానాలు గెలుచుకునే అవకాశం ఏర్పడింది. 120 స్థానాలున్న పార్లమెంటులో నెతన్యాహు కూటమికి 53, జియోనిస్ట్ ప్రతిపక్షానికి 48 స్థానాలు వస్తాయని తుది దశకు చేరిన లెక్కలు సూచించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీలు కీలక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా
అయితే విదేశీ జోక్యం ఆరోపణలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి కొత్త పార్లమెంటు ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయకూడదని ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ హెచ్చరించారు. ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఫిర్యాదుపైనా దర్యాప్తు జరగాలని, అదే సమయంలో రాజకీయ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు నవంబర్ 10న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. షిన్ బెట్ దర్యాప్తులో వెలువడే వివరాలు ఎన్నికల ఫలితాలపై రాజకీయ వివాదాన్ని మరింత పెంచుతాయా, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపుతాయా అన్నది కీలకంగా మారింది.


