ఇజ్రాయెల్‌లో సంకీర్ణమే! | No clear winner emerges from Israel parliamentary elections | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో సంకీర్ణమే!

Oct 29 2026 5:20 AM | Updated on Oct 29 2026 5:20 AM

No clear winner emerges from Israel parliamentary elections

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీకి దూరంగా ప్రధాన కూటములు  

అధికార కూటమికి 54, విపక్ష కూటమికి 48 సీట్లు   

18 సీట్లు దక్కించుకున్న అరబ్‌ పార్టీలు  

అరబ్బులతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్న నెతన్యాహు  

కొన్ని షరతులతో పొత్తుకు సై అంటున్న విపక్ష నేత ఐసెన్‌కోట్‌ 

జెరూసలేం: ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. బుధవారం కల్లా 93 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో 85.6 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమి 54 స్థానాలు గెలుచుకుంది. మాజీ మిలటరీ చీఫ్‌ ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని విపక్ష కూటమికి 48 సీట్లు, అరబ్‌ పార్టీలకు 18 సీట్లు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మొత్తం సీట్ల సంఖ్య 120. ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం. నెతన్యాహు కూటమి ఇంకా ఏడు సీట్ల దూరంలో నిలిచింది. రెండు ప్రధాన కూటముల్లో ఏ ఒక్కదానికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అరబ్‌ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను సెంట్రల్‌ ఎలక్షన్స్‌ కమిటీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఈసారి 77.7 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ ఎన్నికల్లో అధికార కూటమికి 50 నుంచి 52, విపక్ష కూటమికి 51 నుంచి 53 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఇప్పటిదాకా లెక్కించిన ఓట్లలో నెతన్యాహుకు చెందిన లికుడ్‌ పార్టీ 20.8 శాతం, ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని యాషార్‌ పార్టీ 16.1 శాతం ఓట్లను సాధించాయి. అరబ్బుల నాయకత్వంలోని పార్టీలకు 14.9 శాతం ఓట్లు లభించాయి. ఇజ్రాయెల్‌ జనాభాలో 20 శాతం మంది అరబ్బులు ఉన్నారు. 

అరబ్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చిచెప్పారు. వారితో కలిసి పనిచేయబోనని పేర్కొన్నారు. అరబ్బుల భాగస్వామ్యంతో వచ్చే ప్రభుత్వం ‘ప్రమాదకరమైన ప్రభుత్వం’ అవుతుందని హెచ్చరించారు. మరోవైపు అరబ్బులు సైతం నెతన్యాహుతో చేతులు కలిపే అవకాశాన్ని తోసిపుచ్చారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌ కొన్ని షరతులకు లోబడి అరబ్‌ పార్టీలతో భాగస్వామ్యానికి తలుపులు తెరిచి ఉంచారు. ఇజ్రాయెల్‌ను ఒక యూదు రాజ్యంగా, పాలస్తీనాకు చెందిన హమాస్‌ను ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement