వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపేమో అమెరికాపై కయ్యానికి కాలు దువ్వుతుంటే.. మరోవైపు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టెహ్రాన్‌తో శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన కఠిన వైఖరి కలిగిన నేతల్లో ఒకరైన మొహ్సెన్ రెజాయీతో నేరుగా సంప్రదింపులు ప్రారంభించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ఓ కథనంలో వెల్లడించింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి, గతంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్‌గా పనిచేసిన మొహ్సెన్ రెజాయీకి వాన్స్ ఓ లేఖ పంపినట్లు సమాచారం. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలకు ఓ ప్రాథమిక రూపురేఖలపై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా అనే విషయాన్ని పరీక్షించడమే ఈ లేఖ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ వ్యక్తిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలను ప్రచురించింది. ట్రంప్ ఆదేశాల మేరకే వాన్స్ ఈ లేఖ పంపినట్లు, ఈ ప్రయత్నం గురించి అధ్యక్షుడికి కూడా పూర్తి అవగాహన ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది.
వచ్చే వారం అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై స్వల్పకాలికమైనా తీవ్రస్థాయి సైనిక దాడులు చేపట్టాలా అనే అంశంపై ట్రంప్ ఆలోచిస్తున్న సమయంలో వాన్స్ ఈ దౌత్య ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. మరోసారి యుద్ధం చెలరేగకుండా దౌత్య మార్గంలో పరిష్కారం సాధించేందుకు అవకాశం ఉందా అనే విషయాన్ని వాన్స్ పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సంప్రదింపుల ద్వారా ఇప్పటివరకు సమగ్రమైన శాంతి ప్రతిపాదన ఏదీ సిద్ధం కాలేదు. మరోవైపు, తమ ప్రధాన డిమాండ్లను అమెరికా అంగీకరించేంత వరకు వాషింగ్టన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రెజాయీ గత వారం స్పష్టం చేశారు.
యుద్ధానికి వాన్స్ బహిరంగంగా మద్దతు ప్రకటించినప్పటికీ, దాన్ని మరింత కాలం కొనసాగించడంపై ఆయనకు వ్యక్తిగతంగా అభ్యంతరాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ట్రంప్ విధానానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉండగా, మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఫిబ్రవరిలో ట్రంప్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించడానికి ముందే వాన్స్ మరింత బలమైన దౌత్య ప్రయత్నాలు చేపట్టాలని వాదించారు. ఆ తర్వాత ట్రంప్ ఆయనను ప్రధాన చర్చల ప్రతినిధిగా నియమించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఘర్షణకు ముగింపు పలికే లక్ష్యంతో వాన్స్ రెండుసార్లు విదేశీ పర్యటనలు చేపట్టి, ఇరాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ ప్రయత్నాల్లో భాగంగా జూన్‌లో ఇరు పక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, ఆ ఒప్పందంపై సంతకాలు జరిగిన రెండు వారాలకే అది విఫలమైంది. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానాన్ని తిరిగి ఎలా సాధారణ స్థితికి తీసుకురావాలనే అంశంపై ఇరు పక్షాలు భిన్నమైన అర్థాలు చేసుకోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అనంతరం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్ఠంభన తొలగలేదు. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి ముందుగానే రాయితీలు ఇవ్వాలని అమెరికా కోరుతుండగా, తమకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కల్పించాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.
ఇప్పుడు రెజాయీ కీలక సంప్రదింపుల భాగస్వామిగా తెరపైకి రావడం వల్ల దౌత్య ప్రక్రియలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వంటి నేతల పాత్ర తగ్గే అవకాశముందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇరాన్-ఇరాక్ మధ్య 1980వ దశకంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉన్న రెజాయీ, అనేక సంవత్సరాల పాటు ఐఆర్‌జీసీకి నాయకత్వం వహించారు. అమెరికా మరోసారి దాడులు చేసే ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇరాన్‌లో ప్రభావవంతమైన స్వరంగా ఎదిగారు.
ఈ నెల ప్రారంభంలో రెజాయీ చేసిన హెచ్చరికలు కూడా ప్రాంతీయంగా ఆందోళన కలిగించాయి. ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై దాడులు చేయగలదని, అలాగే ప్రాంతంలోని డేటా సెంటర్లు, ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఆదివారం ఆయన టెహ్రాన్‌లో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలకు చెందిన భద్రతా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ స్థాయిలో జరిగిన అరుదైన సమావేశంలో, ఘర్షణ మరింత విస్తరించకుండా నిరోధించేందుకు ప్రాంతీయ దేశాలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తూనే, అవసరమైతే ఆ దేశంపై తీవ్రస్థాయి బాంబు దాడులు జరుపుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం తన రెండో అధ్యక్ష పదవీకాలంలో జాతీయ భద్రతకు సంబంధించిన ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటని ఆయన చెబుతున్నారు. గత వారం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరగడం లేదని ట్రంప్ ప్రకటించడంతో పాటు, సైనిక చర్య త్వరలోనే ఉండవచ్చనే సంకేతాలు ఇచ్చారు. మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉండటం వల్ల ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా హెచ్చరించారు.
ఇదీ చదవండి: అమెరికా బిగ్ ప్లాన్


