వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఇరాన్‌పై మరోసారి రెచ్చిపోయి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో దాడులు చేసేందుకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయని సీఎన్‌ఎన్ (CNN) సంచలన కథనం ప్రచురించింది. ఈ వివరాల్ని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
సీఎన్‌ఎన్ కథనం ప్రకారం.. ఇరాన్‌పై దాడులు నిర్వహించడానికి అవసరమైన స్థాయిలో అమెరికా సైనిక బలగాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించి ఉన్నాయని . అయితే, ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించాలా వద్దా అనే విషయంపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నట్లు కథనం ప్రచురించింది. ట్రంప్ ఆదేశాలిచ్చిన మరుక్షణం పెద్దఎత్తున దాడులకు తెగబడనున్నట్లు పేర్కొంది.
అయితే ఇరాన్‌పై ఈ సారి పరిమిత స్థాయిలో దాడులు నిర్వహించడంతోనే అమెరికా ఆగిపోకపోవచ్చని తాజా సమాచారం . ఇరాన్‌కు చెందిన రాడార్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇతర సైనిక ఆస్తులపై దాడులతో పాటు మరింత విస్తృతమైన లక్ష్యాలపై విరుచుకపడేందుకు అమెరికా సైనికాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా సెంట్రల్ కమాండ్, పెంటగాన్ అధికారులు కలిసి దాడులకు సంబంధించిన లక్ష్యాల జాబితాను విస్తరిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇందులో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.
మధ్యంతర ఎన్నికల తర్వాతే దాడులకు ఆమోదం?
ఇరాన్‌పై కొత్తగా దాడులు నిర్వహించాలనే నిర్ణయం ఈ ఏడాది చివరిలోపు వెలువడవచ్చని అమెరికా సైనిక ప్రణాళికలపై అవగాహన ఉన్న ప్రస్తుత, మాజీ అధికారులు అభిప్రాయ పడుతున్నట్లు సీఎన్‌ఎన్ వెల్లడించింది. అయితే, అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత దాడులకు ఆమోదం లభించే అవకాశాన్ని వారు ఎక్కువగా ప్రస్తావించినట్లు తెలిపింది.
ట్రంప్ గతంలోనూ కొన్ని సైనిక చర్యలకు అనుకూలంగా కనిపించినప్పటికీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయని అధికారులు గుర్తుచేసినట్లు నివేదిక పేర్కొంది. అందువల్ల సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, దాడులు తప్పకుండా జరుగుతాయని చెప్పలేని పరిస్థితి ఉందని విశ్లేషణల ద్వారా అర్థమవుతోంది.
ఈ అంశంపై పెంటగాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పందిస్తూ, రక్షణ శాఖ పని సైనిక ప్రణాళికలను రూపొందించడం, అధ్యక్షుడు ఆదేశించిన సైనిక చర్యలను అమలు చేయడం అని పేర్కొన్నారు. అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా వివిధ సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడం తమ బాధ్యత అని ఆయన వివరించినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఆకలి కేకల ముంగిట


