వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా భవిష్యత్తులో అమెరికాలో 51వ రాష్ట్రంగా మారే అవకాశం ఉందని అన్నారు. మంగళవారం టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీ నగరంలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా సంపన్న దేశంగా మారుతుందని, ఒకవేళ అది అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే అధ్యక్షుడికి బదులుగా గవర్నర్ ఎన్నిక జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.
వెనెజువెలా నుంచి అమెరికాకు వచ్చిన చమురు రవాణాను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెనెజువెలా తమకు 10 లక్షల బ్యారెళ్ల చమురును బహుమతిగా పంపిందని మంగళవారం ప్రకటించారు. టెక్సాస్‌లోని సభ సందర్భంగా చమురు నౌకను చూపిస్తూ, అందులో వెనెజువెలా నుంచి వచ్చిన చమురు ఉందని చెప్పారు. అమెరికా సాధించిన చమురు విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. విజయం సాధించినవారికే దాని ఫలాలు దక్కుతాయంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో వెనెజువెలాలో అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఆ చర్యతో అమెరికా చమురు సరఫరా పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద చమురు వనరులపై అమెరికాకు నియంత్రణ లభించిందని అన్నారు. వెనెజువెలా నుంచి వచ్చిన చమురును టెక్సాస్‌లోనే శుద్ధి చేస్తామని, కార్పస్ క్రిస్టీలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.
అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై ధరల పెరుగుదల ఒత్తిడి పెరుగుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ ధర 40 శాతం పెరిగిందని, డీజిల్ ధరలు దాదాపు 75 శాతం అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా చమురు సరఫరాను ప్రస్తావిస్తూ, ఇంధన రంగంలో అమెరికా విజయాలను ఓటర్లకు వివరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ లైంగిక నేరాల్లో ట్రంప్ పాత్ర?.. 50 పేజీల నివేదికతో ప్రకంపనలు


