డెమాస్కస్/అమ్మాన్: చర్చి వద్ద జరిగిన కాల్పులకు ప్రతీకారంగా సిరియాపై జోర్డాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే, ఈ వివాదాన్ని మరింత పెరగనివ్వకుండా దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని సిరియా, జోర్డాన్ నిర్ణయించాయి. 2024 డిసెంబరులో సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతుడైన తర్వాత ఇరు దేశాల మధ్య తలెత్తిన అత్యంత తీవ్రమైన సంక్షోభంగా ఈ పరిణామాన్ని భావిస్తున్నారు. మరోవైపు, సిరియా పౌరుల మరణాలపై జోర్డాన్ విచారం వ్యక్తం చేసింది. దాడుల్లో 20 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ప్రకటించింది.
గత వారం దక్షిణ జోర్డాన్‌లోని కరాక్ గవర్నరేట్‌లో గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో అంత్యక్రియల ప్రార్థన జరుగుతుండగా సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా జోర్డాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ చర్యలకు సిరియాతో సమన్వయం చేసుకున్నామని జోర్డాన్ చెప్పగా, డమాస్కస్ ఆ వాదనను ఖండించింది. దాడుల్లో ఏడుగురు మరణించారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని సిరియా పౌర రక్షణ విభాగం వెల్లడించింది.
జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది, సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్ షైబానీ మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. సిరియా సార్వభౌమత్వాన్ని, భద్రతను జోర్డాన్ పూర్తిగా గౌరవిస్తోందని సఫాది స్పష్టం చేసినట్లు ఇరు దేశాల విదేశాంగ శాఖలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అమాయక పౌరులు మరణించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ స్థావరాలపై జరిగిన దాడుల అంశాన్ని కూడా ఇరువురు చర్చించారు. ఈ దాడుల్లో 20 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని, ఆ సంస్థకు చెందిన భారీ ఆయుధ నిల్వ కేంద్రం ధ్వంసమైందని జోర్డాన్ ప్రభుత్వ ప్రతినిధి మొహమ్మద్ అల్ మొమానీ తెలిపారు.
మరోవైపు, తమ గగనతలంలో ఎలాంటి ముందస్తు సమన్వయం లేకుండా దాడులు చేయడం సిరియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాల సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. సిరియాలోని దరా ప్రావిన్స్ అల్-తఫ్ గ్రామంలో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారని సిరియా తెలిపింది. దక్షిణ ప్రాంతంలోని మరోచోట ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జోర్డాన్ సరిహద్దులోని ప్రధాన నసీబ్ క్రాసింగ్‌ను సిరియా మూసివేసింది. దీంతో ప్రయాణికులు, వాణిజ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఇస్లామిక్ స్టేట్‌పై చర్యలపై చర్చించేందుకు ఇరు దేశాల సంయుక్త భద్రతా కమిటీ త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. బాధితులకు న్యాయం జరిగేలా దౌత్య, న్యాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని సిరియా అత్యవసర, విపత్తు నిర్వహణ మంత్రి రైద్ అల్ సాలెహ్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘వెనెజువెలా మా 51వ రాష్ట్రమే’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


