ఫలితాలు, క్రూడ్, జియో ఐపీఓపై ఫోకస్‌! | Jio Platforms IPO, Q2 Earnings, Crude Oil to Dictate Market Trend | Sakshi
Sakshi News home page

ఫలితాలు, క్రూడ్, జియో ఐపీఓపై ఫోకస్‌!

Oct 19 2026 5:07 AM | Updated on Oct 19 2026 5:07 AM

Jio Platforms IPO, Q2 Earnings, Crude Oil to Dictate Market Trend

పశ్చిమాసియా పరిణామాలూ కీలకం 

రూపాయి, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలపైనా దృష్టి 

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం 

దసరా సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు

కార్పొరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్‌ ధరలు భగ్గుమనడం... దేశీ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా 
రికార్డులకెక్కనున్న జియో ప్లాట్‌ఫామ్‌ పబ్లిక్‌ ఆఫర్‌పై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయనున్నారు. మరోపక్క, దసరా సందర్భంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు నేపథ్యంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది.

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల జోష్‌తో గత వారం బుల్‌ మళ్లీ రంకెలేసింది. బలమైన రికవరీతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ వారం పలు కీలక పరిణామాల నేపథ్యంలో తాజా జోష్‌ కొనసాగుతుందా.. లేదంటే క్రూడ్‌ ధరల మంట, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో బేర్స్‌ తిరిగి ఎటాక్‌ చేస్తాయా? అనేది మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ కార్యకలాపాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

 ‘వరుసగా రెండో వారం కూడా మార్కెట్‌ సానుకూలంగా ముగిసింది. ఐటీ స్టాక్స్‌ రికవరీతో గతవారం మార్కెట్‌ భారీగా పుంజుకుంది. అయితే, అధిక క్రూడ్‌ ధరలు, భౌగోళిక రాజకీక పరిణామాలు, గ్లోబల్‌ బాండ్‌ మార్కెట్‌ కదలికల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణి కొనసాగే అవకాశం ఉంది’ అని ఎన్రిచ్‌ మనీ సీఈఓ పోన్ముడి ఆర్‌ అభిప్రాయపడ్డారు. తాజా ర్యాలీ ఐటీ షేర్లకు మించి విస్తృతమవుతుందా, సూచీలు తక్షణ నిరోధ స్థాయిలను అధిగమించి నిలదొక్కుకుంటాయా అనే దానిపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిపెడతారని ఆయన వ్యాఖ్యానించారు. 

జోరుందుకోనున్న పలితాలు... 
గత వారాంతంలో కీలకమైన ప్రైవేటు బ్యాంకుల ఫలితాలన్నీ వెలువడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 22.28%, యాక్సిస్‌ బ్యాంక్‌ 39.4% చొప్పున లాభాల వృద్ధితో మెప్పించాయి. ఈ నేపథ్యంలో ఈ వారం బ్యాంకింగ్‌ షేర్లు వెలుగులో నిలిచే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాస్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ (వెల్త్‌ మేనేజ్‌మెంట్‌) సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. కాగా, క్యూ2 ఫలితాల సీజన్‌ ఈ వారం జోరందుకోనుంది. ముఖ్యంగా బజాజ్‌ ఫైనాన్స్, అ్రల్టాటెక్‌ సిమెంట్, హిందుస్థాన్‌ జింక్, యూనియన్‌ బ్యాంక్, ఇరెడా, ఇన్ఫోనిస్, కోఫోర్జ్, క్రిసిల్, స్విగ్గీ వంటి పలు కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. 

పశ్చిమాసియా, క్రూడ్‌ సెగలు.. 
పశ్చమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. సౌదీపై హౌతీల దాడులు.. హార్మూజ్‌ జలసంధిలో నౌకల మునకతో క్రూడ్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గతవారం బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లను దాటింది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్, క్రూడ్, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఆర్‌బీఐ మద్దతు చర్యలతో డాలరుతో రూపాయి మారకం విలువ ఆరు రోజుల్లో 200 పైసలకు పైగా పుంజుకుని 94.85కు బలపడింది. అయితే, మళ్లీ వారాంతంలో క్రూడ్‌ మంటల నేపథ్యంలో దేశీ కరెన్సీ నిలదొక్కుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

గతవారమిలా... 
ఐటీ, బ్లూచిప్‌ షేర్ల దన్నుతో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీగా బౌన్స్‌ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,257 పాయింట్లు (3.11 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 626 పాయింట్లు (2.77 శాతం) చొప్పున ఎగబాకాయి. వరుసగా రెండో వారం కూడా సూచీలు లాభాల్లో ముగియడం విశేషం.

సాంకేతికంగా చూస్తే...  
మార్కెట్లో జోరు కొనసాగితే ఈ వారం నిఫ్టీకి 23,200–23,300 మధ్య బలమైన నిరోధం ఎదురుకావచ్చు. దీన్ని బ్రేకవుట్‌ చేసి నిలదొక్కుకుంటే 23,500–23,600 పాయంట్లకు.. తదుపరి 24,000 వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందనేది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. ఒకవేళ మార్కెట్‌ పడితే, నిఫ్టీకి 22,800–22,600 మధ్య కీలకమైన మద్దతు లభిస్తుందని.. ఆ దిగువన 22,500 వరకూ 
క్షీణించవచ్చని పేర్కొన్నారు.

కళ్లన్నీ జియో మెగా ఐపీఓపైనే...
ఈ వారం స్టాక్‌ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ సందడి చేయనుంది. రూ.30,213 కోట్ల జియో మెగా పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభమై.. 23న ముగియనుంది. దీనికి షేరు ధరల శ్రేణి రూ.1,065–1,119గా కంపెనీ ఖరారు చేసింది. రూ. 10 ముఖ విలువగల 27 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. దీంతో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా నిలుస్తున్న హ్యుందాయ్‌ మోటార్స్‌ను (రూ.27,879 కోట్లు) అధిగమించి దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10.5 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 కాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లోని అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ. 54 డిస్కౌంట్‌ అందిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవడానికి కనీస లాట్‌ 12 షేర్లు. ఇష్యూ పరిమాణంలో రిలయన్స్‌ వాటాదారులకు రూ. 2,500 కోట్లు, జియో ఉద్యోగులకు రూ. 500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్‌ చేసింది. నేడు (19న) యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌లో షేర్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిస్టింగ్‌ను ఈ నెల 28న చేపట్టనున్నారు. జియో భారీ ఐపీఓ నేపథ్యంలో మార్కెట్లో లిక్విడిటీపై ప్రభావం... ఇన్వెస్టర్లకు కేటాయింపు వంటి వాటిపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

రివర్స్‌ గేర్‌లోనే విదేశీ ఇన్వెస్టర్లు... 
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) రివర్స్‌ గేర్‌ కొనసాగుతోంది. అక్టోబర్‌ 16న ఒక్కరోజు మాత్రమే నికర కొనుగోలుదారుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.52,100 కోట్ల విలువైన షేర్లను దేశీ మార్కెట్లో విక్రయించారు. క్రూడ్‌ సెగలు, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ జోరు, డాలరు బలోపేతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభా వితం చేస్తున్నాయి. సెపె్టంబర్‌లో కూడా ఎఫ్‌పీఐలు నికరంగా రూ.35,861 కోట్లను దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది నికర విక్రయాలు రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది  రూ.1.66 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement