నిఫ్టీ లక్ష్యం @ 26,000 | FPI Flows, Crude Oil, Global Trends To Dictate Trend on Stock Markets This Week: | Sakshi
Sakshi News home page

నిఫ్టీ లక్ష్యం @ 26,000

Nov 23 2026 3:14 AM | Updated on Nov 23 2026 3:14 AM

FPI Flows, Crude Oil, Global Trends To Dictate Trend on Stock Markets This Week:

విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కీలకం 

ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం 

వడ్డీ రేట్ల పెంపు అంచనాలపై దృష్టి 

అంతర్జాతీయ పరిణామాలపైనా కన్ను  

ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో వారమూ లాభాలను నమోదు చేయడంతో.. ఇప్పుడు నిఫ్టీ 26,000 కీలక మైలురాయిని అధిగమించే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ద్రవ్యోల్బణ గణాంకాలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. 

‘‘ఇటీవలి మార్కెట్‌ ర్యాలీలో బ్యాంకింగ్‌ షేర్లు కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ 26,000 స్థాయికి చేరువవుతున్న తరుణంలో బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతుందా? ఇతర రంగాల షేర్ల భాగస్వామ్యమూ ఉంటుందా? అనేది కీలకం. మరోవైపు సూచీలు భారీగా పెరగడంతో వాల్యుయేషన్లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. దీంతో మార్కెట్‌ కొంతకాలం కన్సాలిడేషన్‌కు లోనయ్యే వీలుండొచ్చు’’ అని ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్ముడి ఆర్‌ తెలిపారు. 

నేడు ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ... రేపు సెలవు.!  
నవంబర్‌ నెలవారీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) కాంట్రాక్టుల ముగింపు (ఎక్స్‌పైరీ) నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశం ఉంది. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం ఎక్సే్ఛంజీలకు సెలవు. ఈక్విటీ, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. అయితే ఎంసీఎక్స్‌లో సాయంత్రం సెషన్‌ ట్రేడింగ్‌ కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు తిరిగి యథావిధిగా ప్రారంభమవుతాయి. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది.  

ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కొనసాగేనా..? 
ఇటీవలి మార్కెట్‌ ర్యాలీకి విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐల) పెట్టుబడుల ప్రవాహం ప్రధాన మద్దతుగా నిలుస్తోంది. ఈ నవంబర్‌లో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు నికరంగా సుమారు రూ.1,11,950 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2020 నవంబర్‌ తర్వాత ఇదే అత్యధిక నెలవారీ విదేశీ పెట్టుబడుల ప్రవాహం కావడం విశేషం. ‘‘మెరుగుపడుతున్న కార్పొరేట్‌ ఆదాయ అంచనాలు, రూపాయి బలోపేతం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు, బాండ్లపై రాబడులు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య విధానంపై అంచనాలు రానున్న రోజుల్లో  విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందా లేదా అన్నది నిర్ణయించనున్నాయి’’ అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఆర్‌బీఐ రేట్ల అంచనాలపై దృష్టి  
రిటైల్‌ ద్రవ్యల్బోణం(సీపీఐ) అక్టోబర్‌లో ఆర్‌బీఐ నిర్ధేశిత లక్ష్య స్థాయిని అధిగమించి 6.09%కి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం 8.94%గా నమోదైంది. ఈ పరిణామం మార్కెట్‌ వర్గాలను కలవరపెడుతోంది.ధరల ఒత్తిళ్లు కొనసాగితే డిసెంబర్‌ సమీక్షలో ఆర్‌బీఐ మరో విడత వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లలోనే పెట్టుబడులు పెట్టవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధి త ఆటోమొబైల్, రియల్టీ, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రంగాల షేర్లలో మూమెంటమ్‌ అధికంగా ఉంటుంది. 

ముడి చమురు ధరలు.. రూపాయి కదలికలు 
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు రావడం దేశీ మార్కెట్‌కు ఊరటనిస్తోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 92.62 స్థాయికి బలోపేతం కావడం కూడా మద్దతుగా నిలుస్తోంది. క్రూడ్‌ ధరలు తగ్గడం వల్ల దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు దిగొచ్చే చాన్సుంది. ఈ అనుకూల పరిస్థితులు కొనసాగితే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలు 
అధిక వాల్యుయేషన్లు, ఏఐ పెట్టుబడుల నుంచి ఆశించిన స్థాయిలో రాబడులపై సందేహాలు, భారీ మూలధన వ్యయాల ఆందోళనలతో అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో విక్రయాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లు, దేశీయ ఐటీ రంగంపై ఎంతమేరకు ఉంటుందో ఇన్వెస్టర్లు గమనించనున్నారు. ఈఈ వారం విడుదలయ్యే అమెరికా పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలు (బుధవారం), మూడో త్రైమాసిక జీడీపీ రెండో అంచనా, నవంబర్‌ ప్రాథమిక పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) వివరాలు అంతర్జాతీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి.

నాలుగో వారమూ లాభాలు
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో వారమూ లాభాలను నమోదు చేసింది. విదేశీ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల జోరు దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయి. గత వారంలో సెన్సెక్స్‌ 2,327 పాయింట్లు (2.85 శాతం), నిఫ్టీ 656 పాయింట్లు (2.61 శాతం) చొప్పున లాభపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లతో బ్యాంక్‌ నిఫ్టీ ఏకంగా 5.6 శాతం ఎగసి సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆటో, కన్జూమర్‌ డ్యూరబుల్స్, ఫైనాన్సియల్‌ సర్వీసెస్, రియల్టీ రంగాల షేర్లూ రాణించాయి. అయితే, అంతర్జాతీయంగా ఏఐ షేర్ల అధిక వాల్యుయేషన్లపై ఆందోళనలతో ఐటీ షేర్లు ఒడుదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్‌ ర్యాలీలో చిన్న కంపెనీల షేర్ల భాగస్వామ్యం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ వారంలో 1.09 శాతం నష్టపోయింది.

సాంకేతికంగా చూస్తే... 
వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ‘‘25,500 నిరోధక స్థాయిని విజయవంతంగా చేధించింది. కొనుగోళ్ల కొనసాగితే నిఫ్టీ వచ్చే 1–2 వారాల్లో 26,000, ఆ తర్వాత 26,350 స్థాయిల వైపు దూసుకెళ్లే అవకాశం ఉంది. లాభాల స్వీకరణ లేదా దిద్దుబాటు చోటుచేసుకుంటే 25,500 వద్ద బలమైన మద్దతు లభిస్తుంది. ఇక గతవారంలో రోజుకో రికార్డు స్థాయిని నమోదు చేస్తున్న బ్యాంక్‌ నిఫ్టీకి 65,000 వద్ద తక్షణ నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 64,000 స్థాయిని సమీప మద్దతుగా ఉంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి విశ్లేíÙంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌ పడిపోయినప్పుడు నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించాలని, దీర్ఘకాలంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రంగాలపై దృష్టి పెట్టాలని నాగరాజ్‌ సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement