పాలసీలే తప్ప పెట్టుబడులెక్కడ! | AP Semiconductor Policy released two years ago | Sakshi
Sakshi News home page

పాలసీలే తప్ప పెట్టుబడులెక్కడ!

Nov 19 2026 5:35 AM | Updated on Nov 19 2026 5:35 AM

AP Semiconductor Policy released two years ago

రెండేళ్ల క్రితం ఏపీ సెమీకండక్టర్‌ పాలసీ విడుదల

పాత పాలసీనే కొత్త పాలసీగా ప్రచారం

ఇప్పటివరకు భారీ ప్రాజెక్టును ఆకర్షించలేకపోయిన ఏపీ

కీలక ప్రాజెక్టులు తన్నుకుపోయిన గుజరాత్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌

ఇండీచిప్‌ రూ.22,976 కోట్ల పెట్టుబడి అంటూ ప్రచారమే తప్ప వాస్తవం రూపం దాల్చని ప్రకటన

దీంతో పాత ఫ్యాబ్‌ పాలసీకి సవరణ చేస్తూ ఉత్తర్వులు

సరికొత్త ఫ్యాబ్‌ పాలసీ అంటూ మంత్రి లోకేశ్‌ ప్రచారం

ఇప్పటికే 34 పాలసీలు విడుదల చేసిన చంద్రబాబు సర్కారు 

తాజాగా ఐటీ సెక్టార్‌లో మరో రెండు పాలసీలు విడుదల 

సాక్షి, అమరావతి: ఏపీ సెమీకండక్టర్‌ అండ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ వచ్చి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో సెమీకండక్టర్‌ రంగంలో ఒక్క భారీ ప్రాజెక్టును కూడా రాష్ట్రం దక్కించుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కీలక సెమీకండక్టర్‌ ప్రాజెక్టులన్నీ గుజరాత్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు తన్నుకుపోతున్నా చంద్రబాబు సర్కారు నోరుమెదపకుండా కూర్చుంది. రెండేళ్లు గడిచిన తర్వాత తీరిగ్గా ఆ పాలసీలో కొన్ని సవరణలు చేస్తే.. కొత్త పాలసీ ప్రవేశపెట్టినట్టు ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం చూసి అధికారులు విస్తుపోతున్నారు. ఫ్లాప్‌ అయిన సినిమాకు అదనపు సీన్లు జోడించి కొత్త సినిమా విడుదల చేసి అదే తమ ఘనత అన్నట్టుగా ప్రచారం చేసుకోవడంలో లోకేశ్‌ తన తండ్రి చంద్రబాబును మించిపోయాడంటున్నారు.

ఘోర వైఫల్యానికి తార్కాణం
చిప్‌ల కోసం వియత్నాం, తైవాన్‌ వంటి దేశాలపై ఆధారపడకుండా సొంతంగా దేశంలోనే సెమీకండక్టర్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్ల రాయితీలతో ఐఎస్‌ఎంను ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర కేబినెట్‌ రూ.1,55,606 కోట్ల విలువైన ఆరు కీలక చిప్‌ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపితే.. అందులో ఏ ఒక్కటి కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాకపోవడం చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యానికి తార్కాణం. పోనీ.. సొంతంగా ఏమైనా సెమీకండక్టర్స్‌ ప్రాజెక్టులను దక్కించుకుందా అంటే అదీ లేదు. సెమీకండక్టర్‌ పాలసీ విడుదల చేయగానే అప్పుడే పుట్టిన కంపెనీ ఇండీచిప్‌ సుమారు రూ.22,976 కోట్లతో అనంతపురం జిల్లాలో భారీ సెమీకండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి గతేడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నా ఇంతవరకు పట్టాలెక్కింది లేదు.

పాలసీలు ఘనం.. పెట్టుబడులు శూన్యం
కొత్త పారిశ్రామిక పాలసీల విడుదల్లో చంద్రబాబు సర్కారు రికార్డులు సృష్టిస్తోంది. కొత్త పెట్టుబడులు ఆకర్షణలో విఫలమైనా కొత్త కొత్త పాలసీలను సృష్టించి విడుదల చేయడంలో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఏకంగా 34 పారిశ్రామిక పాలసీలను విడుదల చేసింది. ఒక్క ఐటీ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనే ఇప్పటికే 10 పాలసీలను ప్రకటించిన లోకేశ్‌ తాజాగా మరో రెండు పాలసీలను విడుదల చేశారు. 

క్వాంటమ్, డేటా సెంటర్స్‌తో పాటు ఐటీ, స్టార్టప్స్, ఎలక్ట్రానిక్స్, జీసీసీ, నైబర్‌హుడ్‌ వర్క్‌ ప్లేస్, డ్రోన్‌ పేరుతో ఇలా అనేక పాలసీలు ప్రవేశపెట్టగా ఇప్పుడు ఏపీ రోబోటిక్స్‌ అండ్‌ ఫిజికల్‌ ఏఐ పాలసీ (2026–36), యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్‌ అండ్‌ ఎక్సటెండెడ్‌ రియాల్టీ (ఏవీజీసీ–ఎక్స్‌ఆర్‌) పేరిట పాలసీలను ప్రవేశపెట్టడంతో అధికారులు విస్తుపోతున్నారు. అంతేకాదు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లాజిసిŠట్‌ పాలసీ రూపకల్పన చేయడానికి ఇప్పుడు కన్సల్టెన్సీని నియమించుకోవడం కోసం టెండర్లను పిలిచింది. ఈ విధంగా పాలసీల్లో సబ్‌ పాలసీలను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి పాలసీలు సరే కానీ పెట్టుబడులు ఎక్కడంటూ రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement