‘ప్రకాశం’లో భారీ అగ్ని ప్రమాదం | Major fire in buildings used to store hunting equipment | Sakshi
Sakshi News home page

‘ప్రకాశం’లో భారీ అగ్ని ప్రమాదం

Nov 19 2026 5:29 AM | Updated on Nov 19 2026 5:29 AM

Major fire in buildings used to store hunting equipment

వేట సామగ్రి భద్రపరిచే భవనాల్లో ఎగసిన అగ్నికీలలు 

ఓ భవనంలో ప్రారంభమై రెండవ భవనంలోకి వ్యాపించిన మంటలు 

మత్స్యకారుల 60 బోట్లు, ఇంజిన్లు, వలలు, ఇతరసామగ్రి దగ్ధం 

మంటల ధాటికి కూలిన రెండు భవనాలు 

రూ.ఐదుకోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా 

కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం తీరంలో దుర్ఘటన 

విషాదంలో మత్స్యకార కుటుంబాలు

కొత్తపట్నం: అకస్మాత్తుగా వ్యాపించిన అగ్నికీలలకు మత్స్యకారుల బోట్లు, వలలు దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం తీరంలో వేట సామగ్రి భద్రపరుచుకునే రెండు భవనాల్లో మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట ఓ భవనంలోని వలలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ నుంచి విపరీతమైన గాలులకు రెండో భవనానికి మంటలు వ్యాపించాయి..అందులో బోట్లు, వలలు లాగే ఇంజిన్లలో డీజిల్‌ ఉండటంతో మంటల తీవ్రత పెరిగింది. 

అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అంటుకున్న రెండు గంటల్లో భవనాల్లో ఉన్న 60 బోట్లు, వలలు, వేటసామగ్రి మొత్తం ఆహుతయ్యాయి. మంటల ధాటికి రెండు భవనాలు కూలిపోయాయి. మొత్తం రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మత్స్యకార మహిళల రోదనలతో ఆ ప్రాంతం అంతా శోకసంద్రంగా మారింది. దాదాపు 360 మత్స్యకార కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. అప్పులు తెచ్చి వలలు తయారు చేశామని అప్పు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు.  

కాల్చిన చుట్ట వేయడం వల్లే..? 
నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, స్థానికుల సమాచారం మేరకు గుర్తు తెలియని వ్యక్తి కాల్చిన చుట్ట వేయటం వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఇది విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగింది కాదని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారులకు నిత్యావసర సరుకులు సైక్లోన్‌ సందర్భంగా ఇచ్చే సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన వలల విషయంలో అంచనా వేయాల్సి ఉందన్నారు. 

వలలు కాలిపోయాయి   
14 రకాల వలలు రెండు భవనాల్లో భద్రపర్చుకున్నాం. ఒక్కో బోటుకు 10 నుంచి 14 రకాల వలలు ఉంటాయి. నా బోటుకు సంబంధించి రూ.65 లక్షల విలువైన వలలు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలి.  – రామలింగం నాగరాజు, కె.పల్లెపాలెం   

తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే.. 
ఆక్వాన్‌ తుపాను తీవ్రంగా ఉందని వలలు, బోట్లు, వేట సా­మగ్రి సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలన్న అధికారుల ఆదే­శాల మేరకు వలలన్నీ భవ­నాల్లో భద్రపర్చుకున్నాం. రా­త్రి సంభవించిన ప్రమాదంలో కాలిబూడిదయ్యా­యి. నా బోటుకు సంబంధించి రూ.48 లక్షల విలువై­న వలలు బూడిదయ్యాయి. నష్ట పరిహారం చెల్లించాలి.  – పనమల సుబ్బారావు, కె.పల్లెపాలెం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement