28న ఢిల్లీ బహిరంగ సభకు రండి | YS Jagan invited by All India Caste Census Coordination Committee | Sakshi
Sakshi News home page

28న ఢిల్లీ బహిరంగ సభకు రండి

Nov 19 2026 4:56 AM | Updated on Nov 19 2026 4:56 AM

YS Jagan invited by All India Caste Census Coordination Committee

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అఖిల భారత కులగణన సమన్వయ కమిటీసభ్యులు

వైఎస్‌ జగన్‌కు అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ ఆహ్వానం

పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేతను కలిసిన కమిటీ సభ్యులు 

బీసీల్లో అన్ని కులాల్ని లెక్కించేందుకు డ్రాప్‌డౌన్‌ ఆప్షన్‌ అమలుచేయాలని మీడియా సమావేశంలో డిమాండ్‌ 

కుల గణనలో సామాజిక పరిస్థితుల ఆధారంగా లెక్కలు తీయాల్సిందేనన్న నేతలు

సాక్షి, అమరావతి: కేంద్రం చేపడుతున్న కులగణనను సమగ్రంగా నిర్వహించడం ద్వారా బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ (ఏఐసీసీసీసీ) ఈనెల 28న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు సంఘీభావం ప్రకటించాలని కమిటీ ప్రతిని«ధులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘ఛలో రాంలీలా మైదాన్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అభ్యర్థించేందుకు కమిటీ ప్రతిని«ధులు బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వానించారు. 

మండల్‌ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసిన బీపీ మండల్‌ మనవడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరజ్‌ మండల్, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ గౌడ్‌ కిరణ్‌కుమార్, సకల్‌ ఓబీసీ మహామోర్చా అధ్యక్షుడు ఉమేష్‌ కుర్రం, డాక్టర్‌ పిట్టి మల్లికార్జున్‌ యాదవ్‌తో పాటు, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం నాయకులు రాకేష్‌ దత్తా, పెండెం జయంతి యాదవ్‌ ఇంకా రజనీకాంత్‌ గౌడ్‌ వైఎస్‌ జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

కులగణనలో ఓబీసీ కాలం చేర్చాలి.. 
ఏఐసీసీసీసీ ప్రతినిధి ప్రొ. సూరజ్‌ మండల్‌ మాట్లా­డుతూ.. నవంబర్‌ 28న ఢిల్లీ రాంలీలా మైదానంలో అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ బహిరంగ సభ నిర్వహిస్తోందని.. కులగణన సమగ్రంగా నిర్వహించాలని, ఇందులో ఓబీసీ కాలం చేర్చాలని, ఓబీసీ కులాల డ్రాప్‌ డౌన్‌ మెన్యూ చేర్చాలని డిమాండ్‌ చేయబోతున్నామన్నారు. ఇవన్నీ జరిగితేనే ఓబీసీ కులాల అసలు లెక్కలు బయటపడటమే కాకుండా, వారికి రిజర్వేషన్‌ ఫలాలు లభిస్తాయని చెప్పారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల డేటా లేకపోవడంవల్లే రిజర్వేషన్‌ పెంచేందుకు ఏపీ హైకోర్టు అనుమతివ్వలేదు. కాబట్టి ఢిల్లీలో తాము  నిర్వహిస్తున్న భారీ సభకు జగన్‌ని ఆహ్వానించామని తెలిపారు. తమ  డిమాండ్‌కు అండగా నిలవాలని ఆయన్ను కోరామని.. అందుకాయన వెంటనే సానుకూలంగా స్పందించారన్నారు. 

సామాజిక పరిస్థితులు బట్టి లెక్కలు తీయాలి.. 
అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీల్లో అన్ని కులాల్ని లెక్కించేందుకు డ్రాప్‌డౌన్‌ ఆప్షన్‌ అమలుచేయాలని తాము కోరుతున్నామని.. ఇందులో భాగంగా  రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీలో ఎన్డీయే కూటమి కాకుండా మిగతా పార్టీలన్నింటినీ కలుస్తున్నామని చెప్పా­రు. అందుకే జగన్‌ని కూడా ఆహ్వానించామన్నారు. బీసీలకు 50 శాతం సీలింగ్‌ బ్రేక్‌ కావాలంటే కుల గణనలో సామాజిక పరిస్థితుల ఆధారంగా లెక్కలు తీయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement