శేషాచలం అడవి కబ్జా.. పచ్చ కంచె ‘పీకే’యగలరా? | Pulivarthi Nani group has encroached upon 122 acres of forest land | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవి కబ్జా.. పచ్చ కంచె ‘పీకే’యగలరా?

Nov 19 2026 4:43 AM | Updated on Nov 19 2026 4:44 AM

Pulivarthi Nani group has encroached upon 122 acres of forest land

పవిత్ర శేషాచలం అడవుల్లో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని బృందం కబ్జా కాండ

122 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిన పులివర్తి అనుచర గణం

అడవుల్లో తిష్ట వేసి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వసతులతో ఫాం హౌస్‌లు ఏర్పాటు 

దట్టమైన చెట్ల మధ్య ఎర్రచందనం నిల్వ కేంద్రంగా భారీ భవనాల నిర్మాణం 

గుర్రపు స్వారీ.. రేసు కుక్కలు.. తుపాకీలతో అడవి జంతువుల వేటతో ఆటవిక పర్వం

పొలం పనులు.. పశువుల మేత కోసం అటువైపు వెళ్లాలంటే వణుకుతున్న మహిళలు 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు చంద్రగిరి జనసేన ఇన్‌చార్జ్‌ పలుమార్లు ఫిర్యాదు     

ఆక్రమిత అటవీ భూములను స్వా«దీనం చేసుకోవాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి డిమాండ్‌ 

అటవీశాఖను పర్యవేక్షిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఇకనైనా కబ్జాదారుల పనిపట్టాలని కోరుతున్న స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు  

సాక్షి టాస్క్ ఫోర్స్ : పవిత్ర శేషాచలం అడవులు ప్రకృతి సంపదకు నిలయం.. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు అవతరించిన ప్రాంతం.. ఎంతో విలువైన ఎర్రచందనం సంపదకు అడ్డా..! అంతటి వైశిష్ట్యం, ప్రాముఖ్యత ఉన్న అటవీ భూములను ఎమ్మెల్యే పులివర్తి నాని బృందం ఆక్రమించి కంచె వేసింది. మొత్తం 122 ఎకరాలకు కంచె వేసి, అందులో 45 ఎకరాల అటవీ భూములను పులివర్తి తన బినామీలు ఏవీ రమణ మూర్తితో పాటు మరికొందరి పేరిట ఆన్‌లైన్‌ రికార్డుల్లోకి ఎక్కించినట్లు తెలుస్తోంది. మరో 77 ఎకరాల అటవీ భూములను ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

చంద్రగిరి ఎమ్మెల్యే నాని అండతో ఆయన అనుచర బృందం అటవీ భూములను ఆక్రమించడంతో అడవి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని, రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్‌చార్జి దేవర మనోహర్‌  సైతం ఇటీవల స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇకపైనా స్పందించాలని ప్రజలు, పర్యావరణవేత్తలు  కోరుతున్నారు.  అయ్యా..! పవన్‌ కల్యాణ్‌ అలియాస్‌ పీకే గారూ..! అటవీ భూముల జోలికి వస్తే ఎవరినైనా తాట తీస్తానని తరచూ చెప్పే మీరు.. మరి పవిత్ర శేషాచలం అడవులకు పులివర్తి బినామీ ఏవీ రమణమూర్తి వేసిన కంచెను పీకగలరా..? అని స్థానిక ప్రజలు, ప్రకృతి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.  

ఆక్రమిత అటవీ భూములకు ఏర్పాటు చేసిన పటిష్టమైన కంచె  

ఆక్రమిత అటవీ భూముల్లో విలాస భవంతులు.. 
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట అడవుల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బినామీ ఏవీ రమణమూర్తి బృందం కబ్జా చేసిన 122 ఎకరాల ఆక్రమిత అటవీ భూముల్లో తమ విలాసాలకు అనువుగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను తలపించేలా ఫాం హౌస్‌లు నిర్మించింది. ఎర్రచందనం నిల్వలకు అనువైన భారీ భవనాలు కట్టారు. అడవి జంతువులను వేటాడేందుకు రేసు కుక్కలను పెంచుతున్నారు. నిత్యం మద్యం. జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు శేషాచల అడవులను అడ్డాగా మార్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. గుర్రపు స్వారీలు చేస్తూ వ్యవసాయ పనులకు వచ్చే మహిళా కూలీల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.

అసాంఘిక చర్యలకు అడ్డాగా.. 
శేషాచల అడవుల్లో ఒక కొండ నుంచి మరొక కొండ వరకు ఆక్రమించిన 122 ఎకరాల అటవీ భూములను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా అడవి జంతువుల వేట సాగిస్తున్నట్లు సమాచారం. అడవి జంతువులను వేటాడేందుకు రేసు కుక్కలతో పాటు తుపాకీలను వినియోగిస్తున్నట్లు కాల్పుల శబ్దాలు వింటున్న పరిసర ప్రాంత రైతులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకుని మందు, విందు, వినోదాలు, మహిళలతో జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమీప పంట పొలాలకు, గొర్రెలు, మేకలు, పశువుల మేతకు వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా జూదం ఆడుతూ మద్యం మత్తులో అరుస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. 

శేషాచల అడవుల్లో ఒక కొండ నుంచి మరొక కొండ మధ్య పులివర్తి బినామీ ఏవీ రమణమూర్తి ఆక్రమించిన 122 ఎకరాల అటవీ భూమి  

అడ్డదారిలో పరిహారం పొంది... 
ఎమ్మెల్యే పులివర్తి బృందం ఆక్రమించిన 122 ఎకరాల అటవీ భూముల్లో 45 ఎకరాలు ఎన్‌హెచ్‌–71కు ఆనుకుని ఉండటం, కొంత భూమి జాతీయ రహదారి నిర్మాణానికి పోవడంతో దానికి పరిహారం అడ్డదారిలో పొందినట్లు సమాచారం. అటవీ భూములను ఆన్‌లైన్‌లో చేర్చడమే కాకుండా ఆక్రమించిన వాటికి దర్జాగా ప్రభుత్వం నుంచి పరి­హారం కూడా పొందడం విస్మయం కలిగిస్తోంది.    

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి 
ఆక్రమిత అటవీ భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావడంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని, వాటిని ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ భూములు ఆక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ రహదారికి అటవీ భూములిచ్చి అక్రమంగా పరిహారం పొందిన నేపథ్యంలో ప్రజాధనాన్ని పూర్తిగా రికవరీ చేయాలని, వెబ్‌ ల్యాండ్‌లో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు, సర్వేయర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతకంటే ముందు.. దట్టమైన అడవులకు పచ్చ ముఠాలు వేసిన కంచెను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆక్రమణదారులే నేడు ఎంపీపీగా ప్రమాణం 
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో అడవులను ఆక్రమించిన ఆక్రమణ దారుడు ఏవీ రమణ మూర్తి భార్య సరిత టీడీపీ తరఫున చంద్రగిరి ఎంపీపీగా గురువారం ప్రమాణం చేయనుండటం గమనార్హం. రూ.వందల కోట్ల విలువైన అటవీ భూములను కాజేసిన కబ్జాదారుడి కుటుంబానికి టీడీపీ తరపున అవకాశం కల్పించడంతో డబ్బులు వెదజల్లి అక్రమ మార్గంలో పలు ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకుని ఎంపీపీగా ప్రమాణం చేస్తున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.

పులివర్తి బినామీని అరెస్టు చేసి భూములు స్వాదీనం చేసుకోవాలి.. 
చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట వద్ద పవిత్ర శేషాచల అడవులకు కంచె వేసి ఆక్రమిత భూముల్లో అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్న ఎమ్మెల్యే పులివర్తి నాని బినామీ ఏవీ రమణమూర్తిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. అటవీ చట్టం కింద అతడిని అరెస్టుచేసి ఆక్రమిత అటవీ భూములను ప్రభుత్వం వెంటనే స్వా«దీనం చేసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. పర్యావరణ పరిరక్షకులతో కలసి ఆక్రమిత అటవీ భూములను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి, గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తాం.  – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, చంద్రగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement