రాజధాని పేరుతో పర్యావరణానికి బాబు సర్కార్ తూట్లు
పర్యావరణ అనుమతులు లేకుండానే పనులా?
చట్ట విరుద్ధంగా ఎలా కొనసాగిస్తారు?
సర్కార్‌కు నోటీసులు జారీ.. కౌంటర్లు దాఖలుకు ఆదేశం
విచారణ జనవరి 19కి వాయిదా
రాజధాని పేరుతో చెరువులు, వాగులను చంద్రబాబు ప్రభుత్వం పూడ్చేస్తోంది
కృష్ణా నదీ గర్భ భూములను ఆక్రమించి సీఆర్‌డీఏకి ఇచ్చేసింది
2 వేల ఎకరాల మేర జల వనరులను కనుమరుగు చేసింది
అనంతవరం కొండపై యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
ఫ్లైయాష్ తో లోతట్టు ప్రాంతాల పూడ్చివేత
గతంలో ఎన్జీటీ విధించిన షరతులు యథేచ్ఛగా ఉల్లంఘన
ఎన్జీటీలో ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ పిటిషన్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కార్ చేస్తున్న పర్యావరణ విధ్వంసం, యథేచ్ఛగా చట్ట నిబంధనల ఉల్లంఘనలను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్రంగా పరిగణించింది. రాజధాని నిర్మాణం ముసుగులో బాబు సర్కార్ చెరువులు, కుంటలు, వాగులతోపాటు కృష్ణా నదీ గర్భ భూములను ధ్వంసం చేయటం.. వాటిని పూడ్చేస్తూ నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మార్చడం.. తనకు నచ్చినట్లుగా సహజ ప్రవాహ మార్గాలను మళ్లించడం.. తప్పడు సమాచారం ఇవ్వడం.. జల వనరులను కనుమరుగు చేయడం.. కొండలను విచ్చలవిడిగా తవ్వేయడంపై ఘాటుగా స్పందించింది. పర్యావరణ అనుమతులు లేకుండా, చట్ట విరుద్ధంగా రాజధాని పనులు కొనసాగిస్తుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ( ఎస్‌ఈఐఏఏ), సభ్య కార్యదర్శి, గుంటూరు కలెక్టర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డైరెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2027 జనవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఎన్‌జీటీ ప్రధాన బెంచ్ చైర్ పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ, ఎక్స్‌పర్ట్ సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని ఆధారాలతో హరిత ట్రిబ్యునల్‌కు..
రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కొద్ది సంవత్సరాలుగా 25 గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులతో పాటు కృష్ణా నదీ గర్భ భూములను ధ్వంసం చేస్తోందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రశాంత్‌రెడ్డి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. చెరువులు, వాగులను పూడ్చేస్తూ వాటిని నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మారుస్తున్నారని, కొండలు, గుట్టలను అక్రమంగా తవ్వేస్తూ కరిగించేస్తున్నారంటూ అన్ని ఆధారాలను ప్రశాంత్‌రెడ్డి ట్రిబ్యునల్ ముందుంచారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.

90కి పైగా షరతులు
పిటిషనర్ తరఫున న్యాయవాది జి.స్టాన్లీ హెబ్జాన్ సింగ్ వాదనలు వినిపించారు. ‘గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 25 రెవెన్యూ గ్రామాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 24 లక్షల జనాభా కోసం 35 ఏళ్లలో మూడు దశల్లో అమరావతి నిర్మాణానికి 09.10.2015న రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ఇందులో 90కి పైగా షరతులు విధించారు.
కృష్ణా నది కలుíÙతం కాకుండా రక్షించడం.. 9 అంతర్గత డిటెన్షన్ పాండ్స్.. 2 జలాశయాలు నిర్మించడం... కొండవీటి వాగు వరద నివారణపై అధ్యయనం... ఏడాదికి 3 సార్లు కాలువల పూడిక తీయడం... గ్రామాల వారీగా సర్వే నంబర్లతో జలవనరుల జాబితా, బేస్ మ్యాప్ తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచడం... 4,815 హెక్టార్ల జలవనరులను సంరక్షించడం... కాలువలకు ఇరువైపులా 30 మీటర్లు, చెరువుల చుట్టూ 50 మీటర్లు, కృష్ణా నది వెంబడి 100 మీటర్ల మేర గ్రీన్ బెల్ట్ ఉంచడం.. లాంటివి అందులోని ప్రధాన షరతులు..’ అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
2050 నాటికి 35 లక్షల జనాభా అంటూ అనుమతి తీసుకోకుండా..
‘09.07.2026 న జరిగిన సమావేశంలో 29 గ్రామాలు, 2050 నాటికి 35 లక్షల జనాభాతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. ఈ మార్పులకు పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ నుంచి తాజాగా అనుమతి తీసుకోలేదు. రాజధాని నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో ఎన్‌జీటీ 17.11.2017 న తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ను రికార్డ్ చేసింది. జల వనరులను 616 ఎకరాల నుంచి 1,813 ఎకరాలకు పెంచుతామని, కొండవీటి వాగును 30–90 మీటర్లకు, పాలవాగును 45 మీటర్లకు వెడల్పు చేస్తామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ క్రమంలో ట్రిబ్యునల్ ఈ హామీలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పలు షరతులు విధించింది. హైడ్రో–జియో మార్ఫాలజీ అధ్యయనం తర్వాతే వరద మైదానాల మార్పు.. సహజ నీటి ప్రవాహ మార్గాలను మార్చకపోవడం.. కరకట్టల పటిష్టత.. ఘన వ్యర్థాల శుద్ధి.. వర్షపు నీటి సంరక్షణ.. సోలార్ కోసం బిల్డింగ్ బైలాస్.. 6 నెలల్లో క్లైమేట్ యాక్షన్ ప్లాన్.. కొండవీటి వాగు పరీవాహక కొండలపై భూసార సంరక్షణ... అడవుల పెంపకం.. 251 ఎకరాల అటవీ భూమి సంరక్షణతోపాటు రూ. 5 కోట్ల రివాల్వింగ్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని ఎన్‌జీటీ నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తొమ్మిదింటిలో పలు షరతులను ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని నివేదించారు.
కృష్ణా నదీ గర్భ భూములనూ వదల్లేదు
‘11.06.2018న పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ అనుమతిని సవరిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కేవలం కొన్ని షరతులనే చంద్రబాబు ప్రభుత్వం చేర్చింది. ముఖ్యంగా అనంతవరం కొండ సంరక్షణ, క్లెమేట్ యాక్షన్ ప్లాన్ అమలు లాంటి కీలక షరతులకు తిలోదకాలిచ్చింది. జలవనరుల రిజిస్టర్‌తో పాటు బేస్ మ్యాప్ తయారు చేయలేదు. 1906 నాటి రీ సర్వే, రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం లింగాయపాలెం సర్వే నెం. 202/2ఏలోని 899 ఎకరాల 76 సెంట్లు కృష్ణా నది’ పోరంబోకుగా నమోదైంది. ఇందులో 184.89 ఎకరాలను సీఆర్‌డీఏకు బదిలీ చేసి హై–డెన్సిటీ రెసిడెన్షియల్ (ఆ 4), మిక్స్‌డ్ యూజ్ (సీ 1), ట్రంక్ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్‌లో కేటాయించారు.
సర్వే నెం. 39, 40లలోని వాగులను కమర్షియల్ హాస్పిటాలిటీ అభివృద్ధి కోసం ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ‘పబ్లిక్ ట్రస్ట్’ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం. హైడ్రో–జియోమార్ఫలాజికల్ అధ్యయనం చేసిన తర్వాతే వరద మైదానాలలో పనులు చేపట్టాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. కానీ 2017 నుంచి 2025 వరకు ఎటువంటి అధ్యయనం జరగలేదు. 15.04.2025న ఒక ప్రైవేట్ సంస్థకు అధ్యయన బాధ్యతలు అప్పగించి అది పూర్తి కాకముందే జూన్ 2025 లో వరద నివారణ పనులను ప్రారంభించారు..’ అని ఎన్జీటీ దృష్టికి తెచ్చారు.
2 వేల ఎకరాల్లో చెరువులు, వాగులు కనుమరుగు
‘ఏప్రిల్ – జూన్ 2026 మధ్య అధికారులు సమాచార హక్కు చట్టం కింద వెల్లడించిన వివరాల ప్రకారం... 13 గ్రామాల్లోని రెవిన్యూ రికార్డుల్లో చెరువులు, కుంటలు, వాగులుగా ఉన్న 2,005.39 ఎకరాలను సీఆర్‌డీఏకు బదిలీ చేశారు. వాటిని నివాస ప్లాట్లు, వాణిజ్య జోన్లు, రోడ్లు, పాఠశాల మైదానాలుగా మార్చారు. చాలా చెరువులను పూడ్చేశారు. అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, నేలపాడు, శాఖమూరు, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం, అబ్బురాజుపాలెం, బోరుపాలెం, నవులూరు, లింగాయపాలెం తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో ఉన్న జల వనరులను కనుమరుగు చేశారు. ఇంకా చాలా గ్రామాల వివరాలు రావాల్సి ఉంది. పర్యావరణ అనుమతిలో 11,898.10 ఎకరాల మేర జలవనరులు ఉన్నాయని పేర్కొనగా, గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో 616 ఎకరాలు అని పేర్కొన్నారు. కానీ కేవలం 13 గ్రామాలలోనే 1,290.52 ఎకరాల జలవనరులు కనుమరుగయ్యాయని అధికారులు వెల్లడించారు..’ అని స్టాన్లీ పేర్కొన్నారు.
నిర్మాణ దశలోనే నీటమునక
‘సహజ కాలువలను, చెరువులను, కుంటలను ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ వరద నివారణ పనులను కేవలం 18–20 శాతం మాత్రమే పూర్తి చేశారు. దీంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణ దశలోనే రోడ్లు, భవనాల పునాదులు నీట మునుగుతున్నాయి. సహజ వాగుల స్వరూపాన్ని మార్చకూడదనే షరతుకు విరుద్ధంగా కొండవీటి వాగును వెడల్పు చేసి లోతు చేస్తున్నామని ఒకచోట చెబుతూ.. మరోచోట ఎటువంటి మార్పులు చేయలేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. కాలువలకు ఇరువైపులా 30 మీటర్లు, చెరువుల చుట్టూ 50 మీటర్లు, కృష్ణా నది వెంబడి 100 మీటర్ల గ్రీన్ బెల్ట్ ఉంచాలనే నిబంధనను ఉల్లంఘించారు. ఏకపక్షంగా కాలువల బఫర్ జోన్‌ను 20 మీటర్లకు తగ్గించి మిగిలిన బఫర్ జోన్లను విస్మరించారు’ అని తెలిపారు.
కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారు
‘అనంతవరం సర్వే నెం 221లో 297.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అనంతవరం కొండ మాస్టర్ ప్లాన్‌లో పీ–3 రక్షిత ప్రాంతంగా ఉంది. అక్కడ అడవులు పెంచి భూసార సంరక్షణ చేపట్టాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. కానీ పనులు చేయకుండా అక్కడ మొక్కలు పెంచడానికి అనుకూలంగా లేదని 09.07.2026న చంద్రబాబు ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంది. మరోవైపు ఎటువంటి పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఈ కొండను తవ్వి మట్టి, రాళ్లను తరలిస్తూ లోతట్టు ప్రాంతాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం అక్రమ మైనింగే అవుతుంది..’ అని ఆయన నివేదించారు.
మీరు నియమించిన కమిటీలు సైతం విఫలం‘2017లో హరిత ట్రిబ్యునల్ తమ ఆదేశాల అమలు, పర్యవేక్షణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీరు, అడవులు, వాగులు, చిత్తడి నేలలను కవర్ చేస్తూ మొత్తం ప్రాజెక్ట్‌పై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ కమిటీలకు అప్పగించింది. అంతేకాక తాము విధించిన షరతులను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏదైనా షరతు ఉల్లంఘిస్తే జప్తు చేయడానికి వీలుగా ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు రూ. 5 కోట్ల రివాల్వింగ్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలని ఆదేశించింది. అమలు కమిటీ 105 సార్లు, పర్యవేక్షక కమిటీ 35 సార్లు సమావేశం కావాల్సి ఉండగా ఈ కమిటీలు కేవలం 6 సార్లు, 4 సార్లు మాత్రమే సమావేశమయ్యాయి.
డిసెంబర్ 2018 నుంచి జనవరి 2025 వరకు ఆరేళ్ల పాటు ఒక్క సమావేశం కూడా జరగలేదు. క్షేత్రస్థాయి తనిఖీలు చేయకుండానే, సీఆర్‌డీఏ ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా అంతా సవ్యంగా ఉందని కమిటీలు తీర్మానించాయి. 20 నివేదికలకు గాను కేవలం 5 మాత్రమే సమర్పించాయి. రూ. 5 కోట్ల రివాల్వింగ్ బ్యాంక్ గ్యారెంటీ గడువు 13.02.2026 తో ముగిసినా చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించలేదు. ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పరస్పరం నెపం వేసుకుంటూ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని స్టాన్లీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
జల వనరులుగా నమోదైన భూములపై యథాతథ స్థితికి ఆదేశాలివ్వండి
‘రెవెన్యూ రికార్డులలో చెరువులు, కుంటలు, వాగులు, కాలువలుగా నమోదైన అన్ని భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలి. ఎటువంటి కేటాయింపులు, పూడ్చివేతలు, నిర్మాణాలు జరగకుండా నిలువరించాలి. అనంతవరం కొండ, కొండవీటి వాగు పరీవాహక కొండలపై జరుగుతున్న తవ్వకాలు, మట్టి తరలింపును తక్షణమే నిలిపివేయాలి. రూ.5 కోట్ల రివాల్వింగ్ బ్యాంక్ గ్యారెంటీని తక్షణమే పునరుద్ధరించి అమలులో ఉంచాలి. 2014 నాటి స్థితికి, ప్రస్తుత స్థితికి ఉన్న తేడాను ఉపగ్రహ చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిశీలించడానికి కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (రూర్కీ), ఎన్‌ఆర్‌ఎస్‌సీ తదితర సంస్థలకు చెందిన నిపుణులతో స్వతంత్ర జాయింట్ కమిటీని నియమించాలి. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి..’ అని ఆయన ఎన్‌జీటీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
25 గ్రామాల జల వనరుల జాబితా రూపొందించాలి
‘లింగాయపాలెంలో 184.89 ఎకరాల కృష్ణా నదీ గర్భం కేటాయింపు, అనంతవరం కొండపై తవ్వకాలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలి. ఈ 184.89 ఎకరాలను తిరిగి ప్రభుత్వ రికార్డులలో నదిగా పునరుద్ధరించి మాస్టర్ ప్లాన్ జోనింగ్ రద్దు చేయాలి. 25 గ్రామాలకు సంబంధించిన జలవనరుల ధ్రువీకరణ జాబితాను రూపొందించాలి. దెబ్బతిన్న జలవనరులు, వాగులు, అనంతవరం కొండను నిర్దిష్ట కాలపరిమితిలో శాస్త్రీయంగా పునరుద్ధరించాలి. రూ.5 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసి.. ‘కాలుష్య కారకులే చెల్లించాలి’ అనే సూత్రం ప్రకారం బాధ్యుల నుంచి నష్టపరిహారం వసూలు చేసి పునరుద్ధరణ పనులకు ఉపయోగించాలి. బఫర్ జోన్లను (30 మీ, 50 మీ, 100 మీ) కచ్చితంగా అమలు చేయాలి. చెరువులు, లోతట్టు ప్రాంతాలను మట్టి, ఫ్లైయాష్ తో పూడ్చకుండా నిషేధించాలి. విధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపి బాధ్యులుగా చేయాలి. ఆ మేరకు తగిన ఆదేశాలు ఇవ్వండి’ అని స్టాన్లీ విన్నవించారు.


