కర్నూలు సర్వజనాస్పత్రి నుంచి డిశ్చార్జ్
వైద్యుల నివేదిక ఆధారంగా రిమాండ్ విధించిన న్యాయాధికారి
అనంతపురం ఎడ్యుకేషన్/కర్నూలు (హాస్పిటల్): అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడిచేసిన హేమంత్‌ను పోలీసులు జైలుకు తరలించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న అతడిని వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య అనంతపురం తరలించి కోర్టులో హాజరుపరిచారు. వైద్యుల నివేదిక పరిశీలించిన న్యాయాధికారి నిందితుడు హేమంత్‌కు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించారు.
కర్నూలులో చికిత్స
గత నెల 31న రంపంతో దాడికి తెగబడిన అనంతరం పారిపోయిన అతడిని ఈ నెల 1వ తేదీ రాత్రి ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు గర్తించారు. ఆ సమయంలో పోలీసులపై కత్తితో దాడిచేసి పారిపోతుండగా జరిపిన కాల్పుల్లో హేమంత్ కాళ్లలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు అతడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బుల్లెట్ గాయాలతో కుడికాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో వైద్యులు మోకాలి పైభాగం వరకు తొలగించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడికి ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో ఈ నెల 13న కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడిన అతడిని బుధవారం డిశ్చార్జ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ.. హత్యాయత్నం కేసు
బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడిచేసే సమయంలో అడ్డుకోబోయిన మరో దళిత బాలికకు తీవ్రగాయాలు కావడంతోరాప్తాడు పోలీస్‌స్టేషన్‌లో హేమంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.


