మనకేం అడ్డం.. కొట్టేద్దాం! | Chandrababu Naidu and Lokesh investment information chori | Sakshi
Sakshi News home page

మనకేం అడ్డం.. కొట్టేద్దాం!

Nov 21 2026 5:29 AM | Updated on Nov 21 2026 5:32 AM

Chandrababu Naidu and Lokesh investment information chori

గతంలో ఓటు చోరీ, డేటా చోరీ, క్రెడిట్‌ చోరీ.. ఇప్పుడు పెట్టుబడుల సమాచారం చోరీ

సమాచారాన్ని ఏపీ సర్కార్‌కు ఇస్తున్నారంటూ  15 మందిని తొలగించిన తమిళనాడు ప్రభుత్వం 

వారందిరినీ ఏపీ ఈడీబీలో చేర్చుకోవాలంటూ లోకేశ్‌ ఆదేశాలు 

లోకేశ్‌ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగాల్లో చేరిపోయిన ముగ్గురు 

ఈ వ్యవహారంపై జాతీయస్థాయిలో కథనాలు.. రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్న ఈ అంశంపై చంద్రబాబు సర్కార్‌ మౌనం 

గతంలో కర్ణాటక మంత్రులపై ట్వీట్లతో రెచ్చిపోయిన లోకేశ్‌ 

ఆయన ప్రవర్తనపై భగ్గుమన్న కన్నడ ప్రజలు.. తాజా వివాదంతో ఆంధ్రా–తమిళనాడు మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం  

సాక్షి, అమరావతి: ఓటు చోరీ, డేటా చోరీ, క్రెడిట్‌ చోరీలతో రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఇప్పుడు తమ రికార్డులను తామే బద్దలుకొట్టుకున్నారు.  ‘తమిళనాడు నుంచి పెట్టుబడుల సమాచారం చోరీ’  అంశం వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టిస్తోంది. రాష్ట్ర పరువును బజారుకీడ్చిన ఈ వ్యవహారంపై జాతీయ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసుకున్న గైడెన్స్‌ అనే సంస్థలో 15 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సదరు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చేరవేస్తున్నారంటూ వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 

అయితే వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) ఉద్యోగులుగా చేరారు. ఈ విషయాన్ని జాతీయ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ ప్రసారం చేయగా దీన్ని ధ్రువీకరిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి భజన చేసే మరో ఆంగ్ల దినపత్రిక కూడా కథనం రాసింది. పచ్చ మీడియాలోనూ ఈ మేరకు వార్తలు వెలువడ్డాయి. ఏపీఈడీబీలో వీరి చేరికతో తమిళనాడులో పెట్టుబడుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి  చేరవేశారన్న ఆరోపణను నిజం చేసినట్లయ్యిందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పరువును ఇది దిగజార్చడమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. 

పరువు తక్కువ వ్యవహారం ఎలా బట్టబయలైందంటే..!
తమిళనాడులోని సీఎం విజయ్‌ ప్రభుత్వం 15 మందిని తొలగించిన వార్త కొరియా పర్యటనలో ఉన్న లోకేశ్‌కు చేరిన వెంటనే తక్షణం స్పందించిన ఆయన వారందరినీ ఏపీ ఈడీబీలో చేర్చుకోవాలంటూ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ముగ్గురు ఉద్యోగాల్లో చేరిపోవడమూ జరిగింది.  ఏపీ ఈడీబీలో చేరిన వీరు ఇటీవల విశాఖలో జరిగిన ఏపీ ఈడీబీలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడమే కాకుండా వారిలో కొందరు లింక్డిన్‌లో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులను గురించి పోస్ట్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. 

చోరీలో నంబర్‌ 1 ఈ నారా బాబు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లకు ఓటు కొనుగోలు చేస్తూ పట్టుబడిపోవడంతో దేశవ్యాప్తంగా పరువుపోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అప్పటికప్పుడు తట్టాబుట్టా, పెట్టేబేడా సర్దుకొని రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా అనే సంస్థ అభివృద్ధి చేసిన సేవా మిత్ర యాప్‌ ద్వారా కీలకమైన రాష్ట్ర పౌరుల సమాచారాన్ని చోరీ చేసి దొరికిపోయారు.   

తప్పుడు వాగ్ధానాలతో తిరిగి 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొత్త పథకాలు,  ప్రాజెక్టులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమవుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్‌ చోరీ చేస్తూ నవ్వులపాలవుతున్నారు.  తాజాగా ఏకంగా పొరుగు రాష్ట్ర పెట్టుబడుల సమాచారాన్ని కొట్టేశారన్న విమర్శల పాలవుతున్నారు. ‘దేశంలోనే బడాచోర్‌గా.. రాష్ట్ర పరువు తీస్తున్నారు’ అంటూ నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.  

పెట్టుబడులను ఆకర్షించలేక చౌర్యం! 
ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వెల్లువెత్తాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలి. రాజకీయ సుస్థిరత, పారదర్శక పాలన, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండాలి. కానీ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో హింస చెలరేగడం, అడ్డగోలు అవినీతి హద్దులు దాటడంతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ ప్రతికూల పరిస్థితులను కప్పిపుచ్చుతూ పెట్టుబడుల ఆకర్షణలో గొప్పలు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కారు ఇతర రాష్ట్రాల పెట్టుబడుల సమాచారాన్ని చౌర్యం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

పొరుగు రాష్ట్రాలతో దెబ్బతింటున్న సంబంధాలు
ఇప్పటి వరకు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న సరిహద్దు రాష్ట్రాల సంబంధాలు చంద్రబాబు సర్కారు పుణ్యమా అని దెబ్బతింటున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించడంలో తప్పులేదు. కానీ, ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మంత్రులే ట్వీట్లు చేయడం, వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు ఏకంగా పెట్టుబడుల సమాచారం చోరీకి పాల్పడే స్థాయికి దిగజారడం ఇందుకు ప్రధాన కారణం.  
» ‘ఏపీ స్పైసీ దెబ్బకు పొరుగు రాష్ట్రాలకు కడుపు మంట మొదలయ్యింది’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 
» ఇప్పుడు తాజాగా తమిళనాడు డేటా చోరీ విషయం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయంగా ఏపీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా మసకబారుతోంది.
» హెచ్‌ఏఎల్‌ పెట్టుబడుల విషయంలో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ లోకేశ్‌ ట్వీట్‌ చేయడంతో ప్రజలతో పాటు ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి ఎంబీ పాటిల్‌ ఘాటుగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌ ఇస్తున్నట్లు ఉచిత భూమి.. 80 శాతం ప్రోత్సాహకాలు ఇస్తే తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందంటూ కర్ణాటక ఐటీ శాఖ మంత్రి  ప్రియాంక ఖర్గే ఘాటుగా సమాధానం ఇచ్చారు.

15 మందిపై వేటు
» తమిళనాడు పెట్టుబడి రహస్యాల లీక్‌ వ్యవహారం 
»ఆంధ్రా ప్రభుత్వానికి చేరవేసినట్టు కలకలం 
» సమగ్ర విచారణకు విపక్షాల పట్టు 
సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో భారీ కలకలం రేగింది. రాష్ట్రానికి రావాల్సిన కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులకు లీక్‌ చేశారన్న వ్యవహారంలో గైడెన్స్‌ తమిళనాడు సంస్థకు చెందిన 15 మంది సీనియర్‌ అధికారులను ప్రభుత్వం తొలగించింది. వారిలో ముగ్గురు అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బోర్డులో చేరిన సమాచారంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి, ఇప్పుడు తమిళనాడు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కీర్తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 

తమిళనాడు పరిశ్రమల శాఖ నియంత్రణలో పనిచేసే గైడెన్స్‌ సంస్థ తమిళనాడు రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలు, ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు చేరినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ అంతర్గత విచారణ జరిపి సమాచారం లీక్‌ అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో 15 మంది ఉన్నతాధికారులపై వేటు వేశారు. 

ఈ వ్యవహారం శుక్రవారం వెలుగులోకి రావడం తమిళనాట తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా, నిపుణులతో ఎన్నో ఏళ్లుగా నిర్మించిన ఒక కీలక వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తోందని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి టీఆర్‌బీ రాజా మండిపడ్డారు.  దీనికి ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అనిఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రానికి  తీవ్ర ద్రోహం అని.. చోరీకి పాల్పడిన వారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరారంటే అర్థమేంటని  పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు  నిలదీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement