శబరిమలలో రోజుకు గరిష్టంగా 80 వేల మందికి దర్శనం
నిలక్కల్‌లో రోజుకు 10 వేల మందికి స్పాట్ బుకింగ్ సదుపాయం
కేరళం పోలీసుల సూచనలను తెలిపిన ఏపీ డీజీపీ కార్యాలయం
సాక్షి, అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మండల–మకరవిళక్కు యాత్రాసీజన్ ప్రారంభం కావడంతో అయ్యప్ప భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్‌ను తప్పనిసరి చేశారు. ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకే దర్శనానికి అనుమతి ఉంటుందని కేరళం పోలీసులు స్పష్టం చేశారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశం కల్పిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళం పోలీసుల కీలక సూచనలను ఏపీ డీజీపీ కార్యాలయం శుక్రవారం మీడియాకు విడుదల చేసింది.
నిలక్కల్‌లో రోజుకు 10 వేల మందికి స్పాట్ బుకింగ్..
గతంలో పంబలో ఉన్న రియల్‌టైమ్ స్పాట్ బుకింగ్ కౌంటర్లను నిలక్కల్‌కు తరలించారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేని భక్తులు నిలక్కల్‌కు చేరుకుని అక్కడ స్పాట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాతే పంబకు వెళ్లాల్సి ఉంటుంది. నిలక్కల్‌లో రోజుకు గరిష్టంగా 10 వేల మందికి స్పాట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. ఎరుమేలి–పంబ అటవీ మార్గం, వండిపెరియార్ సత్రం–పుల్లుమేడు అటవీ మార్గాల ద్వారా శబరిమలకు వెళ్లే భక్తులూ తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఆన్‌లైన్, స్పాట్ బుకింగ్ కలిగి ఉండాలి.
ఈ రెండు అటవీ మార్గాలకు సంబంధించి రోజుకు గరిష్టంగా 2 వేల మందికి స్పాట్ బుకింగ్ సదుపాయం కల్పించినట్లు కేరళం పోలీసులు తెలిపారు. పంబలో పార్కింగ్ సదుపాయాలు పరిమితంగా ఉన్నందున ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు నిలక్కల్ బేస్ క్యాంపులోనే వాహనాలను పార్క్ చేయాలి. అక్కడి నుంచి కేఎస్‌ఆర్టీసీ చైన్ సర్వీసుల ద్వారా పంబకు చేరుకోవాలని సూచించారు.


