పోలీసుల కళ్ల ముందే నాపై హత్యాయత్నం | TDP attacks on Avinash Reddy with stones and petrol bombs | Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్ల ముందే నాపై హత్యాయత్నం

Nov 21 2026 4:47 AM | Updated on Nov 21 2026 4:47 AM

TDP attacks on Avinash Reddy with stones and petrol bombs

రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో టీడీపీ మూకల బరితెగింపు 

బీటెక్‌ రవి నేతృత్వంలోనే దాడి 

ఇక ఎన్నికల కమిషన్‌ ఎందుకు? 

బాధితులపైనే తిరిగి 307 కేసులు పెట్టడం దారుణం 

వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ధ్వజం

పులివెందుల: పోలీసుల ఎదుటే టీడీపీ మూకలు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీ నేత బీటెక్‌ రవి నేతృత్వంలోని తనపై టీడీపీ గూండాలు రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారని, పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. శుక్రవారం పులివెందుల నియోజకవర్గం అంకాలమ్మ గూడూరు వద్ద ఎంపీ అవినాశ్‌రెడ్డిపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ప్రాణాలను పణంగా పెట్టి నామినేషన్లు వేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. 

బలపనూరు, చెవ్వారిపల్లి, వై.కొత్తపల్లి, హిమకుంట్ల తదితర గ్రామాల అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని ఎస్పీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని చెప్పారు. శుక్రవారం తాను కేవలం ఐదు వాహనాల్లో సింహాద్రిపురం, బలపనూరు క్లస్టర్లకు చెందిన 9 పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థులను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరగా, అంకాలమ్మగూడూరు వద్ద బీటెక్‌ రవి, జోగిరెడ్డి, ప్రభాకర్‌ తదితరులు వందల మంది మూకలతో తమ వాహనాలను అడ్డుకున్నారని చెప్పారు. 

అక్కడ దాదాపు 70 మంది పోలీసులు ఉన్నప్పటికీ, వారి కళ్ల ముందే తన కారుపై, కాన్వాయ్‌లోని ఇతర వాహనాలు, అభ్యర్థులపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారని తెలిపారు. కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ మద్దతుదారులైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేసేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారమే నామినేషన్లు వేయించమని చెప్పాం
గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే వారి చేతుల్లోని పత్రాలను చించి వెనక్కి పంపించారని, శుక్రవారం అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని వారితో నామినేషన్లు వేయించేందుకు తానే స్వయంగా అభ్యర్థులను తీసుకొని పోలీసు స్టేషన్‌కు బయల్దేరానని అవినాశ్‌రెడ్డి చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభ్యర్థులను అప్పగిస్తామని, మీరే తీసుకెళ్లి నామినేషన్లు వేయించండి అని పోలీసులకు ముందుగానే చెప్పానన్నారు. తామ వస్తున్నట్లు సింహాద్రిపురం ఎస్‌ఐకి ముందుగానే మెసేజ్‌ పెట్టానన్నారు. 

సీఐకీ సమాచారం ఇచ్చానని, హైకోర్టు ఆదేశాల కాపీలను కూడా పంపించానని చెప్పారు. గురువారం నుంచి ఎస్పీతో పదులసార్లు మాట్లాడి, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. తాము 70 వాహనాలతో వెళ్లామని డీఎస్పీ మురళీ నాయక్‌ చెప్పింది పూర్తిగా అవాస్తవమని, కేవలం ఐదు వాహనాల్లోనే వెళ్లామని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే ఇంతటి దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? ప్రజాస్వామ్యం బతికే ఉందా? అని అవినాశ్‌రెడ్డి నిలదీశారు. 

పెట్రో­ల్‌ బాంబులతో దాడులు జరిగితే ఇక ఎన్నికల కమిషన్‌ ఎందుకని ప్రశ్నించారు. తమకు ఈ పోలీసులపై ఒక్క శాతం కూడా నమ్మకం లేదన్నారు. 2025 ఆగస్టులో వేల్పుల రాముపై జరిగిన దాడి నుంచి ఇడుపులపాయ, చక్రాయపేట, తొండూరు ఘటనల వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా, తిరిగి బాధితులపైనే హత్యాయత్నం (సెక్షన్‌ 307) కేసులు పెడుతూ, వేలాది మంది కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement