వీరబ్రహ్మ క్షేత్రం.. ఉత్సవ శోభితం | - | Sakshi
Sakshi News home page

వీరబ్రహ్మ క్షేత్రం.. ఉత్సవ శోభితం

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

బ్రహ్మంగారిమఠం : జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి క్షేత్రం ఉత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్‌ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వామి వారి జయంత్యుత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. దివ్య సన్నిధిని రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారి అష్టాదశోత్తర చతుశ్శత (418వ) జయంతి మహోత్సవాలు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వాముల వారు తొలుత పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి భక్తిపూర్వక నమస్కారాలు సమర్పించి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ధర్మపత్ని ఉమాదేవితో కలిసి మహాగణపతి పూజ, గోపూజ తదితర పవిత్ర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ సిద్ధాంతి ఇడమకంటి జనార్దనాచార్యులు, ప్రధాన అర్చకులు వీరబ్రహ్మయాచారి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా మఠం మేనేజర్‌ పీపీఎన్‌ ప్రసాద్‌ మఠాధిపతి దంపతులకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి సోదరులు దత్తాత్రేయస్వామి, వీరంభట్లయ్య స్వామి, మఠం అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని గురుదేవుల దివ్య ఆశీస్సులు పొందారు.

నేడు ఊరేగింపు

స్వాముల వారి అష్టాదశోత్తర చతుశ్శత (418)వ జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం 418 కలశాలతో పూజ నిర్వహిస్తారు. అనంతరం కలశోత్సవాలతో ఊరేగింపుగా వెళ్లి ఉద్యానవనంలోని స్వామి వారి విగ్రహ మూర్తికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం మాతా గోవిందామాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కల్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారి వారి కృపకు పాత్రులు కావాలని మఠం మేనేజర్‌ పీపీఎన్‌ ప్రసాద్‌ కోరారు.

ప్రారంభమైన వీరబ్రహ్మేంద్రస్వామి

జయంత్యుత్సవాలు

శాస్త్రోక్తంగా కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement