జమ్మలమడుగు: కోర్టుల్లో జడ్జిలు, సిబ్బంది కొరతనే ఇప్పటివరకు తీర్చలేకపోతున్న ప్రభుత్వా లు, ఇక సాయంత్రం పూట (ఈవినింగ్) కోర్టుల నిర్వహణకు సిబ్బందిని ఎక్కడి నుంచి తెస్తాయని జమ్మలమడుగు సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన ఈవినింగ్ కోర్టులకు వ్యతిరేకంగా శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. 100 నుంచి 150 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే కక్షిదారులు సాయంత్రం కోర్టులకు హాజరై, తిరిగి ఇళ్లకు చేరడం ఎలా సాధ్యమని ఆయన నిలదీశారు. ఈ నిరసనలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
అన్నమాచార్య వర్సిటీపై యూజీసీ సంతృప్తి
రాజంపేట: అన్నమాచార్య యూనివర్సిటీలో యూజీసీ నిపుణుల బృందం చేపట్టిన రెండు రోజుల తనిఖీలు శుక్రవారంతో ముగిశాయి. వర్సిటీలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, పరిశోధన విభాగాలు, మౌలిక సదుపాయాలను బృందం పరిశీలించింది. ప్రాంగణంలోని విద్యా వాతావరణం, విద్యా ర్థుల సౌకర్యాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జున, హెచ్‌వోడీలు, పరిపాలన అధికారులు పాల్గొన్నారు.
యువకుడి
ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: విషం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అంగళ్లు పంచాయతీ, తుంగవారిపల్లెకు చెందిన రమణ (35), వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. గమనించిన భార్య, పిల్లలు అతన్ని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు విచారణ చేపట్టారు.


